సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 11, 2020 , 01:34:09

7 విడుతలు.. 78 రోజులు

7 విడుతలు.. 78 రోజులు

  • సాగర్‌ ఎడమ కాల్వకు నీటి విడుదల షెడ్యూల్‌ ఖరారు
  • ఈ వానకాలంలోనూ ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతే..
  • నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 6 లక్షల 30 వేల ఎకరాల ఆయకట్టు 
  • 50 టీఎంసీల విడుదలకు ప్రణాళికలు
  • నీటిని పొదుపుగా వాడుకోవాలి :  ఎన్‌ఎస్పీ సీఈ

వానకాలం పంటల సాగుకు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఎడమ కాల్వ నీటి విడుదల షెడ్యూల్‌ను సోమవారం ఖరారు చేశారు. గత శుక్రవారం సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ముందే నీటి విడుదల ప్రారంభం కాగా ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో నీరందించేందుకు తేదీలను వెల్లడించారు. ఎడమ కాల్వ రెండు జోన్ల పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 6 లక్షల 30 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆగస్టు 7 నుంచి నవంబర్‌ 28 వరకు.. ఏడు విడుతలు, 78 రోజుల్లో 50 టీఎంసీల నీరు అందించే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించారు. మొదటి విడుత 24 రోజులు ఆ తర్వాత ఆరు విడుతలు 9 రోజుల చొప్పున నీటి విడుదల చేయనున్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని, కాల్వలకు గండ్లు పెట్టొద్దని ఎన్‌ఎస్పీ సీఈ నర్సింహ సూచించారు.

- మిర్యాలగూడ

 

మిర్యాలగూడ : నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ ఆయకట్టుకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ముందస్తుగానే నీటిని విడుదల చేసింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఈ నెల 7న గంటల వ్యవధిలోనే ఎన్నెస్పీ అధికారులు కాల్వకు నీటి విడుదలను ప్రారంభించగా.. సోమవారం పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ఎన్నెస్పీ సీఈ నర్సింహ ప్రకటించారు.

వరుసగా ఐదో ఏడాది  

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ రైతులకు మేలు కలిగేలా ప్రయోగాత్మకంగా ఆన్‌అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పూర్తి ఆయకట్టుకు నీరందడం ద్వారా సాగు విస్తీర్ణం సైతం పెరిగింది. ఇప్పటికే నాలుగు పర్యాయాలు సమయానికి సాగునీరు అందించిన ప్రభుత్వం వరుసగా  ఐదోసారి ఎడమ కాల్వకు సాగునీటిని విడుదల చేసింది. ఎడమకాల్వ, దాని అనుబంధ కాల్వల ఆధునీకరణ ఫలితంగా చివరి భూములకు సాగునీరు అందుతోంది. మెయిన్‌ కెనాల్‌కు రెండు వైపులా సీసీ లైనింగ్‌ వేశారు. దీంతో పాటు మేజరు, మైనరు కాల్వలకు కూడా సీసీ వేయడంతో లీకేజీ తగ్గింది. కట్టలు బలోపేతం చేయగా.. శిథిలమైన షట్టర్లు తొలగించి కొత్తవి అమర్చారు. కాల్వల సామర్థ్యానికి అనుగుణంగా నీటిని విడుదల చేయడంతో చివరి భూములు సైతం సస్యశ్యామలం అవుతున్నాయి. 

ముందస్తు నీటి విడుదలతో హర్షం

వానకాలం సాగుకు సాగర్‌ ఎడమ కాల్వ ఆయకట్టుకు ఈ ఏడు ముందస్తుగానే నీటిని విడుదల చేయడంతో రైతులు ఉత్సాహంగా సాగు పనులు మొదలు పెట్టారు. సరైన సమయంలో నీటిని విడుదల చేయడం వల్ల నిర్ణీత సమయంలోనే నాట్లు వేసుకుంటామని, దీంతో మంచి దిగుబడులు వస్తాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

78 రోజుల పాటు సాగునీరు 


నాగార్జునసాగర్‌ ఎడమకాల్వకు వరుసగా ఐదేళ్లుగా సమయానుకూలంగా ప్రభుత్వం నీటిని విడుదల చేస్తోంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో గతేడాది కంటే ముందుగానే ఈ ఏడాది అధికారులు నీటిని విడుదల చేశారు. దీంతో వానకాలం సీజన్‌లో వరిసాగు పనులను రైతులు ముమ్మరం చేశారు. వానకాలం సీజన్‌కు ప్రభుత్వం ఎడమకాల్వకు ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో నీటిని విడుదల చేస్తోంది. మొదటి విడుతగా ఈ నెల 7 నుంచి 24 రోజుల పాటు నీటిని విడుదల చేస్తారు. తర్వాత 6 రోజుల పాటు నీటి విడుదల నిలిపివేసి తిరిగి 9 రోజులు విడుదల చేస్తారు. ఇలా ఏడు విడుతలుగా 78 రోజుల పాటు 50 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు.

ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో నీటి విడుదల


సాగర్‌ ఎడమకాల్వకు ఈ వానకాలం సాగుకు ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నాం. 50 టీఎంసీలను ఏడు విడుతలుగా 78 రోజులపాటు విడుదల చేస్తాం. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో 6 లక్షల 30 వేల ఎకరాల భూములకు సాగునీరు అందిస్తాం. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలి. కాల్వకు గండ్లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం. వారికి ఏమైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తాం.

- నర్సింహ, ఎన్‌ఎస్పీ, సీఈ logo