శనివారం 26 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 09, 2020 , 03:35:04

జూలైలో జలధార

జూలైలో జలధార

  • నాలుగేళ్ల తర్వాత అత్యధిక వర్షపాతం 
  • సూర్యాపేట జిల్లాలో సాధారణ వర్షపాతం 209.5 మి.మీ.. కురిసింది 224.3 మి.మీ
  • 9 మండలాల్లో అధికం.. 11 మండలాల్లో సాధారణం
  • మెట్ట పంటలకు మేలుచేసిన వర్షాలు

సూర్యాపేట జిల్లాలో నాలుగు సంవత్సరాలుగా జూలై నెల వర్షపాతం ఎప్పుడూ లోటులోనే ఉండేది. కానీ ఈ ఏడాది మాత్రం లోటును అధిగ మించి మంచి వర్షాలు కురిశాయి. సాధారణంగా సూర్యాపేట జిల్లాలోని 23 మండలాల పరిధిలో జూలై నెలలో 209.5 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా ఈ ఏడాది 224.3 మిల్లీమీటర్లు కురిసి 7 శాతం అధికంగా నమోదైంది. 9 మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే 20 శాతం ఎక్కువగా, 11 మండలాల్లో సాధారణ వర్షం పడింది. కేవలం మూడు మండలాలోనే లోటు వర్షపాతం నమోదైంది.   


సూర్యాపేట జిల్లా ఏర్పాటు నుంచి జూలై మాసంలో వర్షాలు ఎప్పుడూ మొహం చాటేసేవి. దీంతో ఆరుతడి పంటలు సాగు చేసే రైతన్నలకు నిరాశే మిగిలేది. సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతూ వచ్చేది. కానీ ఈ ఏడాది మాత్రం గతానికి భిన్నంగా వర్షాలు పడ్డాయి. గడిచిన 30 రోజుల్లో సగటున 15 రోజులకు పైగా జిల్లాలో వర్షాలు పడ్డాయి. దీంతో మైనస్‌లో నమోదయ్యే వర్షపాతం ఈ సారి మాత్రం ప్లస్‌లోకి వచ్చింది. జూలై నెలలో సాధారణ వర్షపాతం 209.5 మి.మీ ఉండగా 224.3 మి.మీ వర్షం కురిసింది. దీంతో 7 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది జూన్‌, జూలైలో వర్షాలు బాగానే కురిశాయి. జూన్‌లో 93.7 మి.మీగాను 134.02 మి.మీ కురిసి 39 శాతం అదనపు వర్షపాతం నమోదైంది. జూలైలో 9 మండలాల్లో అధిక వర్షం పడగా, 11 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. కేవలం మూడు మండలాలు నాగారం -52, నూతనకల్‌ -20, నేరేడుచర్ల -47 లోటు వర్షపాతం శాతం నమోదైంది. మండల సగటు వర్షపాతం కంటే అత్యధికంగా మేళ్లచెర్వు 65, మఠంపల్లి 23, హుజూర్‌నగర్‌ 44, చింతలపాలెం 39, తిరుమలగిరి 23, ఆత్మకూర్‌(ఎస్‌ ) 32, మోతె 21, నడిగూడెం, అనంతగిరి 28 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో మండల సాధారణ వర్షపాతం కంటే కొద్దిమేర ఎక్కువ వర్షం పడింది. 

ఆరుతడి పంటలకు ప్రాణం పోసిన వర్షాలు  

జూన్‌, జూలైలో కురిసిన వర్షాలు ఆరుతడి పంటలకు ప్రాణం పోశాయి. జిల్లాలో పత్తి, కంది, వేరుశనగ, పెసర పంటలకు ఈ వర్షాలు ఎంతో ఉపయోగ పడ్డాయి. సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే పత్తి 1,50,200 ఎకరాలు, కంది 13 వేల ఎకరాలు, పెరస 11 వేల ఎకరాలు, వేరుశనగ 1500 ఎకరాల్లో సాగయ్యాయి. జూలైలో పడ్డ వర్షాలతో ఆ పంటల్లో కలుపు తీయడం, గంటక తోలడం వంటి పనులు జోరుగా సాగుతున్నాయి. logo