బుధవారం 30 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 09, 2020 , 03:12:48

విడుతలవారీగా నీరు.. సమృద్ధిగా సాగు

విడుతలవారీగా నీరు..  సమృద్ధిగా సాగు

  • ఈ ఏడాదీ ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో సాగర్‌ నీటి విడుదల
  •  సీఎం కేసీఆర్‌ ఆలోచనతో ఐదేళ్లుగా విజయవంతంగా అమలు 
  • చివరి భూములకూ పూర్తిస్థాయిలో నీరు
  • తగ్గిన పంటల తెగుళ్లు.. పెరిగిన దిగుబడి
  • ఇదే విధానం బాగుందంటున్న రైతులు 

వానకాలం పంటల సాగుకు తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి ఎడమ కాల్వకు శుక్రవారం నీటిని విడుదల చేసింది. గత ప్రభుత్వాలకు భిన్నంగా సీఎం కేసీఆర్‌ నీటి వృథాను అరికట్టేందుకు విడుతల వారీగా నీటిని విడుదల చేయాలని ఆలోచన చేసి అమలు చేస్తున్నారు. 2014 నుంచి విజయవంతంగా కొనసాగుతున్న ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిని ఈ సంవత్సరం కూడా కొనసాగించాలని ఆదేశించారు. ఈ విధానంతో తొమ్మిది రోజులపాటు నీరు విడుదల చేసి ఏడు రోజులపాటు నిలుపుదల చేస్తారు. దీనివల్ల నీరు వృథా కాకుండా చివరి భూములకూ సమృద్ధిగా అందుతోంది. ఆయకట్టులోని బీడుభూములూ సాగులోకి వస్తున్నాయి. అంతేకాకుండా పంటలకు తెగుళ్ల బెడద తగ్గి దిగుబడి సైతం గణనీయంగా పెరుగుతోంది. ప్రతియేటా రైతులకు ఈ పద్ధతిపై అవగాహన కల్పించడంతో భారీగా నీరు పొదుపు అవుతోంది. తమకు అనుకూలంగా ఉండడంతో ఈ విధానాన్నే కొనసాగించాలని రైతులు సైతం ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

- మిర్యాలగూడ

 మిర్యాలగూడ : నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ ఆయకట్టుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత ఆరేళ్లుగా ఆన్‌అండ్‌ఆఫ్‌ పద్ధతిలో సాగునీరు విడుదల చేసి పంటలకు సరిపడ సాగునీరు అందించడంలో సక్సెస్‌ అయ్యింది. గతంలో సీమాంధ్ర పాలకులు ఒక వైపు ఆంధ్రాకు అక్రమంగా నీళ్లు తరలించడమే కాకుండా నీటి పొదుపుపై దృష్టి పెట్టకపోవడం వల్ల పొలాలకు సరిపడా నీరందక పంటలు ఎండి తీవ్ర రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పరిస్థితులు పూర్తిగా మారి చివరిభూములకు సైతం నీరు అందడంతో రైతులు ఆనందంగా ఉన్నారు.

సీఎం కేసీఆర్‌ ఆలోచనతో  ఆన్‌అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో నీటి విడుదల

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ ఆలోచన మేరకు సాగర్‌ ఎడమకాల్వ ఆయకట్టుకు 2014-15 సీజన్‌ నుంచి నేటివరకు ఆన్‌అండ్‌ఆఫ్‌ పద్ధతిలో సాగునీరు అందించి నీటి దుబారాను అరికట్టారు. గతంలో పాలకులు మూసధోరణితో సాగునీరు వదిలి ఎంతమేరకు భూములు పారుతున్నాయి.. సరిపోతాయా.. లేదా అనే విషయాలను పరిగణలోకి తీసుకోకుండా చేతులు దులుపుకునేవారు. దీంతో సాగునీరు భారీగా దుబారా అయ్యేది. కానీ సీఎం కేసీఆర్‌ సాగర్‌ ఎడమకాల్వపై ప్రత్యేక దృష్టి సారించి ఏటా రైతులకు సాగునీరు ప్రణాళికబద్ధంగా  ఆన్‌అండ్‌ఆఫ్‌ పద్ధతిలో విడుదల చేసి సక్సెస్‌ సాధించారు. ఈ పద్ధతికి రైతులు సైతం అలవాటుపడి, సాగునీరు పొదుపు అవుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆయకట్టులో భారీగా నీటి పొదుపు

నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ ఆయకట్టు రైతాంగానికి మరింత లబ్ధి చేకూరాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఆన్‌అండ్‌ఆఫ్‌ పద్ధతి ప్రవేశపెట్టాడు. ప్రయోగాత్మకంగా 2014-15లో చేపట్టిన ఈ పద్ధతి వల్ల సాగర్‌ ఎడమకాల్వ పరిధిలో భారీగా నీటి పొదుపు చేయగలిగారు. ప్రభుత్వం, ఎన్‌ఎస్‌పీ అధికారులు ఆయకట్టు రైతులకు నీటి పొదుపుపై అవగాహన కల్పించారు. దీంతో ఈ విధానం సక్సెస్‌ అయ్యింది. రైతులు సైతం అలవాటు పడిపోయారు. ఏటా ఈ పద్ధతిలో 9రోజులపాటు నీరు విడుదల చేసి 7రోజుల పాటు నిలిపివేస్తారు. ఈ పద్ధతి వల్ల పంట పొలాలకు తెగుళ్లు సైతం తక్కువగా వచ్చి పంటలు బాగా పండుతున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

చివరి భూములకూ సాగునీరు

ఆన్‌అండ్‌ఆఫ్‌ పద్ధతిలో సాగునీరు విడుదల చేయడం వల్ల చివరి భూములకు సైతం సాగునీరు పుష్కలంగా అందుతోంది. సీఎం           కేసీఆర్‌ పాలనలోనే సాగర్‌కాల్వల ఆధునీకరణ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించారు. దీంతో  మేజరు కాల్వలకు పూర్తిస్థాయిలో నీరు విడుదల చేస్తున్నారు. దీంతో బీడు భూములుగా ఉన్న చివరి భూములు సైతం సేద్యంలోకి వచ్చాయి.

ఆన్‌అండ్‌ఆఫ్‌ పద్ధతిలో గతంలో నీటి విడుదల

సంవత్సరం వానకాలం యాసంగి

                        సాగు ఎకరాలు సాగు ఎకరాలు

2014-15             259886         257787

2015-16             ------             275880

2016-17             260879     210790

2017-18                 142851 260555

2018-19                 270578 224910

2019-20             283934     290666

ఆన్‌అండ్‌ఆఫ్‌ పద్ధతిలో నీటి విడుదల

ఈ వానకాలం కూడా ఆన్‌అండ్‌ఆఫ్‌ పద్ధతిలోనే నీరు విడుదల చేస్తున్నాం. మరో మూడురోజుల్లో నీటి విడుదల షెడ్యూల్‌ విడుదల చేస్తాం. రైతులు సాగునీరు పొదుపుగా వాడుకోవాలి. కాల్వలకు గండ్లు పెడితే కఠినచర్యలు ఉంటాయి. నీటి సమస్యలు ఉంటే రైతులు ఎన్‌ఎస్‌పీ అధికారుల దృష్టికి తీసుకురావాలి. పొలాలు ఆరిపారడం వలన తెగుళ్లు తక్కువగా ఉండటమే కాకుండా అధిక దిగుబడులు వస్తాయి. ఆయకట్టు రైతులు సాగునీరు పొదుపుగా వాడుకోవాలి.

 - విజయభాస్కర్‌, ఎన్‌ఎస్‌పీ ఎస్‌ఈ, మిర్యాలగూడlogo