బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 07, 2020 , 02:36:19

ఇక పక్కాగా ఇంటి పన్నుల లెక్క

ఇక పక్కాగా  ఇంటి పన్నుల లెక్క

  • l భువన్‌ యాప్‌తో అక్రమాలకు చెక్‌
  • l ఈ నెల 15లోగా పూర్తికానున్న ఆన్‌లైన్‌ ప్రక్రియ

మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను అక్రమాలకు చెక్‌ పడనుంది. ఇళ్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాల సమాచారం నిక్షిప్తం చేస్తూ ప్రభుత్వం భువన్‌ యాప్‌ను తీసుకొచ్చింది. దీంతో పారదర్శకంగా పన్నులు విధించడంతో పాటు ఎగవేతకు అడ్డుకట్ట పడనుంది. ఈ మేరకు భవనాలను ‘ఆన్‌లైన్‌' చేసే ప్రక్రియ ఈ నెల15లోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ‘భువన్‌' యాప్‌ ద్వారా మున్సిపాలిటీల ఆదాయం సైతం పెరుగనుంది.

- బొడ్రాయి బజార్‌


  సూర్యాపేట, నల్లగొండ జిల్లాలోని మున్సిపాలిటీల్లో ‘భువన్‌ యాప్‌' ప్రక్రియ కొనసాగుతున్నది. ఆగస్టు 15వరకు వివరాలను యాప్‌లోకి ఆప్‌లోడ్‌ చేసే ప్రక్రియ పూర్తి చేయాలని మున్సిపల్‌శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సూర్యాపేట మున్సిపల్‌ అధికారులు సూర్యాపేట పట్టణంలోని ఎస్వీ కళాశాలకు చెందిన 42మంది సిబ్బందిని ప్రత్యేకంగా భువన్‌ యాప్‌ ప్రక్రియ నమోదుకు తీసుకున్నారు. అలాగే మున్సిపాలిటీ నుంచి 100మంది సిబ్బంది బృందాలుగా ఏర్పడి ప్రాంతాల వారీగా భువన్‌యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ బృందాలను పర్యవేక్షించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఒక మొబైల్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారు. 

అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు..

 మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చిస్తున్నది. ఇదే క్రమంలో అక్రమాలకు తావు లేకుండా పక్కాగా పన్ను వసూలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇందులో భాగంగానే భువన్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్‌ ద్వారా చాలా వరకు అక్రమాలకు చెక్‌ పడనున్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

వివరాల నమోదు ఇలా...

ముందుగా మున్సిపల్‌ సిబ్బంది ఇంటి వద్దకు చేరుకొని ఇంటి యజమాని నుంచి వివరాలు సేకరిస్తారు. సేకరించిన వివరాలను భువన్‌యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఇల్లు ఎంత విస్తీర్ణంలో నిర్మించారు, ఎన్ని అంతస్తులు ఉన్నాయి, నల్లా కనెక్షన్‌, విద్యుత్‌ కనెక్షన్‌, అన్ని వివరాలను ఫొటోలతో మున్సిపల్‌ సిబ్బంది తీసుకుంటారు. ఈ వివరాలను యాప్‌లో పొందుపరుస్తారు. ఇంటితోపాటు వాణిజ్య, వ్యాపార సంస్థలకు సంబంధించిన భవనాల వివరాలు అప్‌లోడ్‌ చేస్తారు. సర్వే నెంబర్‌, ఇంటి నెంబర్‌, ఎంత విస్తీర్ణం ఇలా అన్ని వివరాలు యాప్‌లో ఉంటాయి. ఇంటి నెంబర్‌ నొక్కితే పూర్తి వివరాలు ఫొటోలతో సహా అందుబాటులో ఉంటాయి. వీటి ఆధారంగానే పన్ను వసూలు చేయనున్నారు. ఇక నుంచి రెండు మూడు అంతస్తులు ఉండి ఒకే అంతస్తుకు, తప్పుడు సమాచారం ఇచ్చి పన్నులు చెల్లించడం కుదరదు. 

కచ్చితమైన సమాచారం ఇవ్వాలి..

భువన్‌ యాప్‌లో వివరాలు నమోదు చేసేందుకు వెళ్తున్న మున్సిపల్‌ సిబ్బంది మాస్కులు ధరించి శానిటైజర్లు వెంట ఉంచుకొని అన్ని రకాల జాగ్రత్తలో ఇంటికి వస్తున్నా ప్రజలు సహకరించడం లేదు. కరోనా భయమో లేక తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనని ప్రజలు మున్సిపల్‌ సిబ్బందికి కచ్చితమైన సమాచారం ఇవ్వడం లేదు. దీంతో సిబ్బంది వారి ఇష్టానుసారంగా నమోదు చేయడంతో తప్పుడు సమాచారం వెళ్లి ప్రజలే ఇబ్బందులు పడాల్సి వస్తుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. అందుకే మున్సిపల్‌ సిబ్బందికి ఇంటి విస్తీర్ణం, నల్లా, విద్యుత్‌ తదితర సమాచారాన్ని కచ్చితంగా ఇవ్వాలని మున్సిపల్‌ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.  

ఆరు బ్లాకులుగా సూర్యాపేట మున్సిపాలిటీ 

 భువన్‌యాప్‌లో ఇంటి వివరాలు నమోదు చేసిన తర్వాత ఇంటి నెంబర్‌ కొడితే ఇంటికి సంబంధించిన సమాచారం మొత్తం వస్తుంది. దాన్ని బట్టి ఆన్‌లైన్‌లో ట్యాక్స్‌ను చూపెడుతుంది. సూర్యాపేట పట్టణాన్ని ఆరు బ్లాకులుగా విభజించడంతో ఆయా బ్లాకుల వారీగా పన్నుల చెల్లింపు ఉంటుంది. 

భువన్‌ యాప్‌తో పక్కా సమాచారం 


భువన్‌ యాప్‌తో పక్కా సమాచారం రానుంది. ఇంటి వైశాల్యం, నిర్మాణం, అంతస్తులు ఇలా అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో నమోదై ఉంటాయి. దీంతో పన్నుల చెల్లింపుల అక్రమాలకు చెక్‌ పెట్టవచ్చు. ఈ యాప్‌తో ఇంటికి సంబంధించిన పక్కా సమాచారం వస్తున్నందున ట్యాక్స్‌ కూడా ఆన్‌లైన్‌లోనే చూపిస్తుంది. దీంతో మున్సిపల్‌ ఆదాయం కూడా భారీగా పెరుగనుంది. ప్రజలు భువన్‌ యాప్‌లో వివరాలు నమోదు చేసేందుకు వస్తున్న మున్సిపల్‌ సిబ్బందికి సహకరించి సరైన వివరాలు అందించాలి. 
పి.రామానుజులరెడ్డి (మున్సిపల్‌ కమిషనర్‌, సూర్యాపేట)


logo