మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 05, 2020 , 00:50:03

ప్రకృతి సహకరించింది.. ప్రభుత్వం పెట్టుబడి అందించింది..

ప్రకృతి సహకరించింది.. ప్రభుత్వం పెట్టుబడి అందించింది..

ప్రకృతి సహకరించింది.. ప్రభుత్వం పెట్టుబడి అందించింది.. దీనికి తోడు సాగునీరు, 24 గంటల విద్యుత్‌ ఉండనే ఉంది.. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా సాగు జోరందుకుంది. వానకాలం సీజన్‌లో ఇప్పటికే మెట్టపంటలతో పాటు వరి కూడా గతంతో పోలిస్తే అధికంగా సాగైంది. సీజన్‌కు ముందే ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు సమకూర్చగా రైతులకు ఇబ్బందులు తీరాయి. ప్రస్తుతం వర్షాలు కూడా అనుకూలంగా కురుస్తుండగా జిల్లా వ్యాప్తంగా సాగు సందడి నెలకొంది.  వానకాలం సీజన్‌లో వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పంటలు సాగవుతున్నాయి. పరిస్థితిని ముందే ఊహించిన తెలంగాణ ప్రభుత్వం పంటలసాగు అంచనాకు అనుగుణంగా జిల్లాకు ఎరువులు అందించింది. దీంతో ప్రస్తుతం రైతులకు ఎరువుల కొరత లేకుండా ఉంది. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పత్తితో పాటు ఇతర మెట్ట పంటలు సాగు చేసిన రైతులు, ముందస్తుగా వరిసాగు చేసిన రైతులు ఎరువులు వేసుకుంటున్నారు. మండలకేంద్రాల్లోని ఫర్టిలైజర్‌ దుకాణాల నుంచి ఎరువులు కొనుగోలు చేసి గ్రామాలకు ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి దృశ్యాలే కనిపించాయి.   

నల్లగొండ జిల్లాలో 239.3మి.మీటర్ల సాధారణ వర్షపాతానికి గాను 266.6మి.మీటర్ల వర్షం కురిసింది. ఇది 11.4శాతం అదనం కావడం విశేషం. గతేడాది ఇదే సమాయానికి 135.9మి.మీ.వర్షంతో -40శాతం ఉంది. సూర్యాపేట జిల్లాలో 296.6మి.మీ. సాధారణ వర్షపాతానికి 357.9మి.మీ. వర్షపాతం నమోదైంది. 21శాతం అదనంగా పడింది. గతేడాది 187.5మి. మీటర్ల వర్షం మాత్రమే పడగా -37శాతం ఉంది. 

88శాతం పంటల సాగు...  

నల్లగొండ జిల్లాలో ఇప్పటికే 88శాతం సాగు పనులు పూర్తయ్యాయి. సాధారణంగా ఈ సీజన్‌లో 7.98 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. సాధారణంగా జూలై నెల ముగిసే నాటికి 5,89,468ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతుంటాయి. అయితే, ఇప్పటికే ఈ సారి 7,04,962 ఎకరాల్లో అన్ని పంటలు సాగయ్యాయి. ఇది మొత్తం లక్ష్యంలో 88శాతంగా ఉంది. గతేడాది ఇదే సమయానికి కేవలం 5,35,940ఎకరాల్లో మాత్రమే సాగైంది. సూర్యాపేట జిల్లాలో మొత్తం 3,90,916 ఎకరాల సాధారణ విస్తీర్ణానికి గాను 1,86,893 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇది మొత్తం విస్తీర్ణంలో 48శాతం. ఎస్సారెస్పీ ఆయకట్టులోనూ వరి సాగు ఘననీయంగా పెరగనుంది. ఇప్పటికే నారు సిద్ధం చేసుకున్న వారు నాట్లు ప్రారంభించారు.  

ముమ్మరంగా వరి నాట్లు...

ఆయకట్టును మినహాయిస్తే నాన్‌ఆయకట్టులో వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో పక్షం రోజులుగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కాల్వల్లో గోదావరి జలాలు ప్రవహిస్తుండగా.. నాగార్జునసాగర్‌, ఏఎమ్మార్పీ, మూసీ ఆయకట్టుకు నీటి విడుదల కావాల్సి ఉంది. ఆయా ప్రాంతాల్లో రైతులు వరినార్లు సిద్ధం చేసుకుంటున్నారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 1,94,865ఎకరాల్లో వరి సాగు అంచనా ఉండగా ఇప్పటివరకు 53,214ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. గతేడాది 35,054ఎకరాల్లో మాత్రమే వరి సాగైనట్లు లెక్కలున్నాయి. సూర్యాపేట జిల్లాలో 2,00,906ఎకరాల సాధారణ విస్తీర్ణానికి గాను ప్రస్తుతం 16,845ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 8,389ఎకరాల్లోనే నాట్లు పూర్తయ్యాయి. సూర్యాపేట జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నీటిని వానకాలంలో విడుదల చేస్తుండడంతో వరి సాగు రికార్డుస్థాయిలో పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఓ వైపు ఎస్‌ఆర్‌ఎస్పీ మరో వైపు నాగార్జునసాగర్‌ సాగు నీటితో సూర్యాపేట జిల్లాలో వరి సాగు అగ్రస్థానంలో నిలువనుంది. 

ఊపుందుకున్న పప్పుదినుసుల సాగు...

నల్లగొండ జిల్లాలో 23,574ఎకరాల్లో కంది సాగు అంచనా వేయగా 13,156ఎకరాల్లో పూర్తైంది. సూర్యాపేట జిల్లాలో 25059సాధారణ సాగు విస్తీర్ణానికి గాను 12,954ఎకరాల్లో విత్తనాలు వేశారు. మొత్తంగా పప్పుదినుసుల సాగును పరిశీలిస్తే నల్లగొండ జిల్లాలో 27,314ఎకరాలకు గాను 13,888ఎకరాల్లో సాగయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 62,488ఎకరాలకు గాను 23,090ఎకరాల్లో పప్పుదినుసుల సాగయ్యా యి. జొన్న, పెసర, వేరుశనగ, సజ్జ పంటలు కూడా గతంతో పోలిస్తే ఈ సారి అదనంగానే సాగయ్యాయి. 

అంచనాలు మించుతున్న పత్తి సాగు...

ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయ సాగులో భాగంగా నల్లగొండ జిల్లాలో భూముల స్వభావం, వనరుల లభ్యత దృష్ట్యా పత్తి సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయానికి జిల్లా రైతన్నలు జై కొడుతూ భారీగా సాగుకు ఉపక్రమించారు. జిల్లాలో ఈ ఏడాది 7.10లక్షల ఎకరాల్లో పత్తి సాగు అంచనా వేశారు. వర్షాలు సకాలంలో కురవడంతో భారీగా పత్తి సాగైంది. గతంలో ఈ సమయానికి జిల్లాలో 5,28,309ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. 6.40లక్షల ఎకరాల్లో (90శాతం) సాగైంది. సూర్యాపేట జిల్లాలో 1,60,169ఎకరాల్లో పత్తి సాగు అంచనా వేయగా ప్రస్తుతం 1,45,835ఎకరాల్లో సాగు చేశారు. మొత్తం విస్తీర్ణంలో 91శాతం పూర్తైనట్లే. గతానికి ఇప్పటికి పత్తి సాగులో పొంతనే లేకుండా పోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించిన విధంగా నియంత్రిత సాగుకు రైతులు జై కొట్టారు అనేందుకు పై లెక్కలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

నేరుగా పంట పెట్టుబడి...

ఆరేండ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో తొలకరి జల్లులు పడుతున్నాయంటే రైతాంగం గుండెల్లో గుబులు మొదలయ్యేది. అప్పుల కోసం తిప్పలు..విత్తనాలు, ఎరువుల కోసం యుద్ధమే చేయాల్సి వచ్చేది. తెలంగాణ ఆవిర్భావానంతరం అన్ని సమస్యలు ఆవిరయ్యాయి. రైతుబంధు పథకంతో పంట పెట్టుబడి ప్రభుత్వమే అందిస్తోంది. ఎకరానికి రూ.10వేలు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నాయి. ఫలితంగా ఎంతో కష్టమైన వ్యవసాయ పనుల్లో రైతులు ఇష్టంగా సాగుతున్నారు.

నిరంతర విద్యుత్‌..

ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగానికి ఏది కావాలన్నా నిరసనలు, రాస్తారోకోలు తప్పేవి కావు. పోలీసుల లాఠీచార్జీలో అన్నదాతలు రక్తం చిందించేవారు. కరెంటు కోసం సబ్‌స్టేషన్లపై దాడులు, ఓ ఓల్టేజీతో కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు, అర్ధరాత్రి వచ్చిపోయే విద్యుత్‌కోసం కాపలాగా వెళ్లి విద్యుదాఘాతంతో మరణాలు.. మొత్తానికి వ్యవసాయం దండుగ అనే పరిస్థితులు ఉండేవి. కానీ, నేడు నిరంతర విద్యుత్‌ అందుతోంది. ఎరువులు, విత్తనాల సమస్య లేకుండా ప్రభుత్వం అందుబాటులో ఉంచుతోంది. 

మూడు నదుల నీళ్లు..

ఉమ్మడి జిల్లాలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టులోనే వరి పండించేది. కానీ, నేడు మూసీ ప్రాజెక్టుకు మరమ్మతులతో కుడి, ఎడమ కాల్వకు రెండు పంటలకు నీరందుతున్నది. మరోవైపు కాళేశ్వరం కల నెరవేరింది. ఎస్సారెస్పీ ఫేజ్‌2 కాల్వల ద్వారా గోదావరి జలాలు పరుగులు తీస్తున్నాయి. 300కి.మీ. తరలివచ్చిన గోదారమ్మ సూర్యాపేట జిల్లాను సస్యశ్యామలం చేసింది. వెరసి కరువుప్రాంతాల్లోనూ భూగర్భ జలం ఎగిసిపడుతోంది.

గోదావరి జలాలతో జోరుగా సాగు 

తుంగతుర్తి : ఎస్సారెస్పీ కాలువ ద్వారా గోదావరి జలాలు మండలానికి చేరగా బీడు భూములు సైతం సాగులోకి వచ్చాయి. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ కృషితో 69డీబీఎం ద్వారా గోదావరి జలాలు మండలానికి చేరాయి. ప్రస్తుతం 24గ్రామపంచాయతీల్లోని కుంటలు, చెరువుల్లోకి నీరు చేరడంతో జలకళను సంతరించుకున్నాయి. ఫలితంగా బావులు, బోర్లలో పుష్కలంగా నీరు వస్తుండగా.. రైతులు బీడు భూములను సైతం సాగు చేసుకుంటున్నారు. 50 సంవత్సరాలుగా సాగుకు నోచని భూములు సైతం ఈ సంవత్సరం పంటపొలాలుగా మారడంతో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తోంది. మండలంలో గత సంవత్సరం 12వేల ఎకరాల్లో వరిసాగు చేయగా.. ఈ సీజన్‌లో 15వేల ఎకరాల్లో సన్నరకం వరి, 8,852 ఎకరాల్లో పత్తి, 2,500 ఎకరాల్లో కంది సాగైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషితోనే మండలానికి గోదావరి జలాలు వచ్చి తమ భూములు సాగులోకి వచ్చాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   logo