బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 03, 2020 , 00:09:08

శానిటైజ‌ర్‌తో జాగ్ర‌త్త‌

శానిటైజ‌ర్‌తో జాగ్ర‌త్త‌

  • n మండే స్వభావం ఉండడంతోప్రమాదం
  • n చిన్న పిల్లల విషయంలో శ్రద్ధ అవసరం
  • n మార్కెట్లో భారీగా నాసిరకం శానిటైజర్లు 

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో శానిటైజర్‌ వాడకం పెరిగింది. బయటికి వెళ్లి ఇంటికొచ్చే వరకు పలుమార్లు చేతులకు శానిటైజర్‌ రాసుకుంటున్నారు. ఎక్కడంటే అక్కడ ఆడుకొనే పిల్లల చేతులను కూడా శానిటైజర్‌తో శుభ్రం చేస్తున్నారు. వంట చేసే సమయంలోనూ దీనిని పూసుకోవడం మానడం లేదు. అయితే శానిటైజర్‌తో ఎంత ప్రయోజనం ఉందో అంతే నష్టం ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాడితేనే మేలు కలుగుతుంది.

- నేరేడుచర్ల /కోదాడటౌన్‌/మఠంపల్లి


 మండే స్వభావం 

కరోనా నేపథ్యంలో చాలా మంది ఏ పని చేయాలన్నా ముందుగా చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. ఇందులో ఎక్కువ మంది శానిటైజర్లు వినియోస్తున్నారు. వీటిలో 60 నుంచి 90 శాతం ఆల్కహాల్‌ ఉంటుంది. అదే క్రిములను సంహరిస్తుంది. ఈ మిశ్రమానికి వంద డిగ్రీల కంటే తక్కువ వేడిలో మండే స్వభావం ఉంటుంది. శానిటైజర్‌ చేతికి రాసుకొని వెంటనే వంట గదిలోకి వెళ్లి గ్యాస్‌ స్టవ్‌ వెలిగిస్తే మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. అందువల్ల చేతికి రాసుకున్న శానిటైజర్‌ ఆరిన తర్వాతే పనులు చేయడం మేలు. 

పిల్లలకు ఇబ్బందే

శానిటైజర్ల వినియోగం ద్వారా సమస్యలు వస్తాయని అంతర్జాతీయ పరిశోధనా సంస్ధ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రివెన్షన్‌ సెంటర్‌ నివేదికలు చెబుతున్నాయి. పదేళ్ల లోపు పిల్లలు వినియోగించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఐదేళ్ల లోపు వారికి చర్మ సంబంధిత సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు.  

మార్కెట్లో పలు రకాలు

ప్రస్తుతం మార్కెట్‌లో వివిధ రకాల శానిటైజర్లు లభిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం శానిటైజర్‌లో ఇథనాల్‌ 60 నుంచి 90 శాతం వరకు ఉండాలి. అలా ఉన్న వాటిని మాత్రమే వినియోగదారులు కొనుగోలు చేయాలి. అలాగే వాటి తేదీ, ధర వంటివి పరిశీలించాలి. మంచి కంపెనీల శానిటైజర్లు మాత్రమే కొనుగోలు చేసుకోవాలి. 

అతిగా వాడితే నష్టం

 శానిటైజర్లను అతిగా వాడడం వల్ల అలర్జీ, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు సబ్బు, లిక్విడ్‌ సోప్‌ ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు. బయటకు వెళ్లినప్పుడు మాత్రమే శానిటైజర్‌ వాడాలి. వీలైతే చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. చాలా మంది శానిటైజర్‌ వాడిన తర్వాత అదే చేతితో ఆహారం తీసుకుంటారు. ఇది సరికాదు. శానిటైజర్‌ రాసుకోవడం వల్ల వైరస్‌, బ్యాక్టీరియా చనిపోతాయి కానీ ఈ ద్రావణంలో ఉండే రసాయనాలు మాత్రం చేతిపైనే ఉండిపోతాయి. అదే చేతితో ఆహారం తీసుకుంటే ఆ రసాయనాలు మన శరీరంలోకి వెళతాయి. అందుకే తినే ముందు కచ్చితంగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. 

సబ్బుతో కడుక్కుంటే మేలు  

శానిటైజర్ల వాడకంపై విస్తృతంగా ప్రచారం జరుగడంతో నాసిరకమైనవి కూడా మార్కెట్‌లోకి వచ్చాయి. వాటి గాఢత ఎక్కువ ఉండడంతో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. శానిటైజర్ల ధరలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. సబ్బు అయితే తక్కువ ధరలో లభిస్తుంది. చేతులు పూర్తి స్థాయిలో శుభ్రమవుతాయి. వైద్యులు సైతం సబ్బుతో చేతులు శుభ్రం చేసుకునేందుకే ప్రాధాన్యమివ్వాలని సూచిస్తున్నారు. 

ఏ శానిటైజర్లు మేలు

  •   నురుగు కంటే ద్రావణం మాదిరిగా ఉండే శానిటైజర్లతోనే ఎక్కువ ప్రయోజనం 
  •   వేసుకుని రుద్దుకున్న తర్వాత ఒక నిమిషంలో ఆరిపోవాలి. అలా కాకుండా చేతులకు అంటుకొని ఉంటే చర్మ సంబంధ సమస్యలు వస్తాయి. 
  •   60 నుంచి 90 శాతం ఆల్కహాల్‌ ఉండాలి. తగ్గినా, ఎక్కువగా ఉన్నా ఆశించిన ఫలితం రాకపోగా కొత్త సమస్యలొస్తాయి. 
  •   20 నుంచి 30 సెకన్ల పాటు చేతులకు రుద్దుకోవాలి. 


logo