గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 31, 2020 , 02:00:02

ఆదర్శ రైతాంగం.. ఆరుత‌డి సేద్యం

ఆదర్శ రైతాంగం.. ఆరుత‌డి సేద్యం

  • వాణిజ్య పంటల సాగులో నంద్యాలవారిగూడెం 
  • వ్యవసాయంలో ఆదర్శంగా నిలుస్తున్న ఆవాసం
  • తక్కువ విస్తీర్ణంలో విభిన్న రకాల పంటలు 

వ్యవసాయమే జీవనాధారంగా వలసవచ్చిన కుటుంబాలవి. 30ఏండ్ల కిందట ఆవాసంగా ఏర్పడిన వారంతా కలిసికట్టుగా ‘సాగు’తున్నారు. ఒకే మాటపై నిలబడి విభిన్న పంటలను సేద్యం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సుమారు 150మంది రైతులు.. 500ఎకరాల్లో ఆరుతడి పంటలైన పత్తి, మిర్చి కంది, వేరుశనగ, జొన్న, మల్బరీ పండిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు.

- అత్మకూర్‌ (ఎస్‌)

ఆత్మకూర్‌ (ఎస్‌)కు 5కిలోమీటర్ల దూరంలో ఉంది  నంద్యాలవారిగూడెం. 1982లో ఏర్పడిన ఈ గ్రామం సాగులో జిల్లాలోనే ఆదర్శంగా నిలిచింది. ఇక్కడి రైతులు మూకుమ్మడిగా, మూస పద్ధతిలో పంటలు సాగు చేయకుండా ఆధునిక పద్ధతులు అవలంబిస్తున్నారు. అధికశాతం ఆరుతడి పంటలనే సాగు చేస్తూ.. నిత్యం పంటమార్పిడి అమలు చేస్తున్నారు. దీంతో పాటు మల్బరీ, పట్టు పురుగుల పెంపకంలో ఉమ్మడి జిల్లాలోనే ఈ గ్రామం ప్రథమ స్థానంలో నిలిచింది. 

మొదట మండలకేంద్రానికి చెందిన నంద్యాల కృష్ణారెడ్డి సుదూరంగా ఉన్న తన వ్యవసాయ క్షేత్రానికి వచ్చి వెళ్లేవాడు. అయితే ప్రతిరోజూ 5కి.మీ మేర ప్రయాణించాల్సి రావడంతో ఇబ్బందులు ఎదుర్కొనేవాడు. 1982లో తనతో పాటు అదే ప్రాంతంలో భూములున్న మరో 8 కుటుంబాలతో కలిసి అక్కడికి మారాడు. వారంతా వ్యవసాయ భూముల వద్దే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అలా ఏర్పడిందే నంద్యాలవారిగూడెం. క్రమంగా మరో 42 కుటుంబాలు అత్మకూర్‌ఎస్‌ నుంచి ఇక్కడికి వచ్చి భూములు కొనుగోలు చేసుకొని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. 

150 మంది రైతులు.. 500 ఎకరాలు

ఈ గ్రామంలో 150 మంది రైతులు 500 ఎకరాల భూమిలో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. గ్రామ రైతులంతా కలిసి కట్టుగా ఉంటూ వ్యవసాయంలో నూతన పద్ధతులు అమలు చేస్తున్నారు. వీరంతా కేవలం ఆరుతడి పంటలైన కంది, వేరుశనగ, మిరప, జొన్న, పత్తి పండిస్తున్నారు. ఏ సీజన్‌లో ఏ పంటలు వేయాలనేది అందరూ కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకుంటారు. ఎక్కువగా సేంద్రియ ఎరువులు వినియోగిస్తూ.. ఆధునిక పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. మల్బరీ తోటలను కూడా సాగుచేస్తూ పట్టు ఉత్పత్తి చేస్తున్నారు. మల్బరీ సాగులో ఈ గ్రామం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. సాగులో గ్రామస్తుల కృషిని గమనించిన గడ్డిపెల్లి కృషి విజ్ఞానకేంద్రం వారు నిత్యం గ్రామాన్ని సందర్శించి రైతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. వారి సూచనలతోనే రైతులు మల్బరీ సాగు చేస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. గ్రామ రైతులు సాగు చేస్తున్న వివిధ రకాల పంటలను పరిశీలించేందుకు నిత్యం వివిధ గ్రామాల రైతులు ఇక్కడికి వస్తుంటారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో  ఇతర ప్రాంతాల రైతులకు అనేక క్షేత్ర ప్రదర్శనలు కూడా నిర్వహించారు. 

ఆరుతడి పంటలే సాగుచేస్తాం

 వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ ఆరుతడి పంటలే అధికంగా సాగు చేస్తున్నాం. ఏకాలంలో ఏ పంట వేస్తే లాభం అనే విషయాలు అధికారుల ద్వారా తెలుసుకొని వాటిని సాగు చేస్తున్నాం. దీంతో పాటు ప్రతిసంవత్సరం పంటమార్పిడి విధానాన్ని అనుసరిస్తుండడం వల్ల అధిక దిగుబడి వస్తోంది. 

- ఉయ్యాల కొండయ్య 
logo