ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 30, 2020 , 01:49:04

సేంద్రియ సాగులో

సేంద్రియ సాగులో

సేంద్రియ ఎరువులు వినియోగించాలని ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పిస్తున్నా.. ఆచరించేవారు తక్కువే. కానీ  మేళ్లచెర్వు మండలం ఎర్రగట్టు తండాకు చెందిన వెంకట్‌రెడ్డి మాత్రం రసాయన ఎరువులు వినియోగించకుండానే సాగు చేస్తున్నాడు. ఆరుపదుల వయసులోనూ కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నాడు. తాను సాగు చేసిన పొలానికి సేంద్రియ ఎరువునే వినియోగిస్తూ.. క్రిమిసంహారకాలు కూడా సహజంగానే తయారు చేసి వినియోగిస్తూ.. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ  రైతు.  

మేళ్లచెర్వు మండలం ఎర్రగట్టు తండాకు చెందిన సోమిరెడ్డి వెంకట్‌రెడ్డి (65)కి ఆరు ఎకరాల భూమి ఉంది. ఈ రైతుకు కుమారుడు, ఇద్దరు కూతుళ్లు. కొడుకు జాంబియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు.  వెంకట్‌రెడ్డి మాత్రం తనకున్న పొలాన్ని సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుమారుడి సలహా, వ్యవసాయ శాఖ, గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం వారి ప్రోత్సాహంతో స్వయంగా సేంద్రియ ఎరువులు తయారు చేసి వినియోగించడం మొదలు పెట్టాడు. గోమూత్రం, వేపాకుతో తానే స్వయంగా క్రిమిసంహారకాలు తయారు చేసి పంట పొలాలకు పిచికారీ చేస్తుంటాడు. ఎనిమిదేళ్లుగా ఏనాడు కూడా రసాయన ఎరువులు, పురుగుల మందులు వినియోగించలేదు.  

నాలుగెకరాల్లో సాగు

నీటి వనరులు అందుబాటులో ఉండడంతో తనకున్న నాలుగు ఎకరాల్లో వానకాలంలో వరి, యాసంగిలో కొర్రలు, సామలు, రాగులు సాగు చేస్తున్నాడు. ఏడాది పొడవునా పొలంలో ఏదో పక్క కూరగాయలు పండిస్తూనే ఉంటాడీ రైతు. వంగ, టమాటా మొదలు పుదీనా, పొన్నగంటి వంటి వివిధ రకాలు పండిస్తాడు. సేంద్రియ పద్ధతిలో పంటలు పండించడంతో గరిష్ఠంగా 40 బస్తాల ధాన్యం దిగుబడి వస్తుందని రైతు వెంకట్‌రెడ్డి తెలిపాడు. ధాన్యాన్ని పట్టించి బియ్యంగా మార్చి విక్రయిస్తుంటాడు. ఇతడి వద్ద బియ్యం కొనుగోలు చేసేందుకు గుంటూరు జిల్లా నుంచి కూడా వినియోగదారులు వస్తుంటారు.  

శాస్త్రవేత్తలు, అధికారుల సందర్శన

65 ఏళ్ల వయసులోనూ అంకిత భావంతో శ్రమించే రైతు కావడంతో వెంకట్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని తరచూ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సందర్శిస్తుంటారు. సాగులో సలహాలు, సూచనలు అందిస్తారు. కొత్త వంగడం ఏది వచ్చినా మొదటగా వెంకట్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సాగు చేసేందుకు ప్రోత్సహిస్తుంటారు. ఇతర ప్రాంతాల రైతులు కూడా తరచూ వెంకట్‌రెడ్డి పొలాన్ని సందర్శిస్తుంటారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఇతర రాష్ర్టాల పర్యటనకు వెంకట్‌రెడ్డిని తీసుకెళ్తారు. ఇప్పటి వరకు బెంగళూరు, మైసూరు, ములుగు, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఈ రైతు సాగులో మెళకువలు తెలుసుకోవడంతో పాటు తన అనుభవాలను కూడా వారితో పంచుకున్నారు. 

ఇంత శ్రమ అవసరమా అంటుంటారు...

ఈ వయసులో ఇంతశ్రమ అవసరమా అని బంధువులు, స్థానికులు అడుగుతుంటారు. రసాయన ఎరువులు వాడి పక్కవాళ్లు 40, 45 బస్తాలు పండిస్తుంటే.. నువ్వు అంతచాకిరీ చేసి 30బస్తాలే పండిస్తున్నవుగా అంటుంటారు. రసాయన ఎరువులు వేసిన పంటలు తిని రోగాలు తెచ్చుకోవద్దని నా కొడుకు చెప్పిన మాటలు నాలో మార్పు తెచ్చాయి. కష్టమైనా సేంద్రియ సాగు ఎంతో ఉత్తమం. నా ఇంటికి కావల్సినవన్నీ ఈ పద్ధతిలో పండించుకుంటున్నాను. వ్యవసాయాధికారులు కూడా ప్రోత్సహిస్తున్నారు.  


logo