సోమవారం 28 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 29, 2020 , 02:53:46

ఆప్తులతోటే అపాయం.. కరోనాతో జరభద్రం

ఆప్తులతోటే అపాయం.. కరోనాతో జరభద్రం

  • విందులు, వినోదాలతో అధికవ్యాప్తి
  • స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష.. 
  • కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్‌ కృషి అభినందనీయం
  • విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
  • వర్తక, వృత్తి, కార్మిక సంఘాలతో టెలీ కాన్ఫరెన్స్‌
  • షరతులతో లాక్‌డౌన్‌ అమలు చేయాలి : వర్తకులు

ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటిస్తున్న తరుణంలో ఆప్తులతోటే కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నదని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. విందులు, వినోదాల కారణంగా వైరస్‌ విజృంభిస్తోందని చెప్పారు. మంగళవారం సూర్యాపేట మున్సిపల్‌, వర్తక, కార్మికసంఘాల ప్రతినిధులతో మంత్రి జగదీశ్‌రెడ్డి టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వారంతా స్వచ్ఛంద లాక్‌డౌన్‌ అమలు చేస్తే బాగుంటుందని మంత్రికి విజ్ఞప్తి చేశారు. 

సూర్యాపేట టౌన్‌ : ఆప్తులతోటే కరోనా వ్యాప్తి చెందుతుందని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అయినవారే కదా అని అల్లుకుపోతే అంతిమంగా నష్టపోయేది మనమే అన్నారు, ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్‌ ఆప్తులతో, స్నేహితులతో, బంధుమిత్రులతో విస్తరిస్తుందన్నారు. అటువంటి ప్రమాదకరమైన వైరస్‌ లక్షణాలు సోకినపుడు దాచిపెట్టాలని చూస్తే మొదటికే మోసం వస్తుందని పేర్కొన్నారు. విందులు, వినోదాలతోటే కరోనా వైరస్‌ విపరీతంగా వ్యాప్తిచెందుతుందన్నారు. కాగితాలతో పాటు కరెన్సీ నోట్లు చేతులు మారినప్పుడు వైరస్‌ సోకే అవకాశాలు లేకపోలేదని నిపుణులు పేర్కొంటున్నారన్నారు. 

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో మంగళవారం రోజున సూర్యాపేటలోని మున్సిపల్‌ పాలకవర్గంతోపాటు వర్తక, వాణిజ్య, వ్యాపార, వృత్తి, కార్మిసంఘాల ప్రతినిధులతో మంత్రి జగదీశ్‌రెడ్డి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన లాక్‌డౌన్‌ అమలుపై ఆయాసంఘాల ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి భయోత్పాతం సృష్టిస్తున్న కరోనా వైరస్‌ కట్టడిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలు సాధించిందన్నారు. దాచిపెట్టడం వలన సన్నిహితులకు సోకి వ్యాధి వందలాది మందికి వ్యాపించే ప్రమాదముందన్నారు. మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని సొంత నిధులతో ఏర్పాటుచేస్తున్న అంబులెన్స్‌లతో గ్రామీణ ప్రాంతాల్లో సైతం పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. 

ఇదే విషయమై వర్తక, వ్యాపార, వాణిజ్య, వృత్తి, కార్మికసంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ కరోనా కట్టడికి షరతులతో కూడిన లాక్‌డౌన్‌ అమలు పర్చాల్సిందే అన్నారు. వ్యవసాయ వైద్యరంగంపై ప్రభావం చూపకుండా లాక్‌డౌన్‌ అమలుపరచాలన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్‌ చైర్మన్‌ పుట్ట కిశోర్‌, సీనియర్‌ టీఆర్‌ఎస్‌ నేతలు వై వెంకటేశ్వర్లు, వ్యాపారసంఘాల ప్రతినిధులు,  డాక్టర్‌ విద్యాసాగర్‌, కిరాణామర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొమ్మిడి లక్ష్మీనారాయణ, కొండపల్లి దిలీప్‌రెడ్డి, ఉప్పల ఆనంద్‌, మొరిశెట్టి యోగితోపాటు కమిషనర్‌ రామానుజులరెడ్డి, మున్సిపల్‌ సభ్యులు పాల్గొని లాక్‌డౌన్‌పై తమతమ అభిప్రాయాలను వెల్లడించారు.


logo