గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 29, 2020 , 02:53:46

పరీక్షలు, ఫలితాలు అక్కడికక్కడే..

పరీక్షలు, ఫలితాలు అక్కడికక్కడే..

  • జిల్లాలో విస్తృతంగా ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు
  • ఇప్పటివరకు నల్లగొండ జిల్లాకు 6348, సూర్యాపేట జిల్లాకు 4,052 కిట్ల సరఫరా
  • మొత్తం 3500 మందికి పరీక్షలు

ఉమ్మడి జిల్లాలో కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు విస్తృతంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్ర దవాఖాన నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు ఎక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తున్నారు. ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టు కిట్ల పరీక్షల్లో కొవిడ్‌ లక్షణాలున్నవారికే ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పటివరకు నల్లగొండ జిల్లాకు 6,348, సూర్యాపేట జిల్లాకు 4,052 కిట్లు సరఫరా కాగా నల్లగొండలో 1700, సూర్యాపేటలో 1861 మందికి పరీక్షలు చేశారు. పాజిటివ్‌ వ్యక్తులకు లక్షణాల తీవ్రతకు అనుగుణంగా వైద్యసేవలు అందిస్తున్నారు.

నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కొవిడ్‌-19 తీవ్రత పెరుగుతున్నా కొద్దీ ప్రభుత్వం అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. పది రోజుల కిందటివరకు కూడా నల్లగొండ జిల్లాలో కరోనా నిర్ధారణ కోసం జిల్లా కేంద్ర దవాఖానలో నమూనాలు సేకరించి హైదరాబాద్‌లోని నిర్ధేశిత ల్యాబ్స్‌కు పంపేవారు. సూర్యాపేట జిల్లా కేంద్ర దవాఖానలో పరీక్షలు నిర్వహించి అక్కడే ఫలితాలు వెల్లడిస్తూ వచ్చారు. జిల్లాలోని ఎక్కడి వారైనా జిల్లా కేంద్రాలకు రాక తప్పేదికాదు. ఈ పరీక్షల ఫలితాలు కూడా ఒకటి, రెండురోజుల సమయం పట్టేది. ఒకవేళ పాజిటివ్‌గా వస్తే... 

ఈ లోగానే బాధితుని నుంచి అది మరికొంతమందికి వ్యాప్తి చెందే అవకాశాలు ఉండేవి. ఇలాంటి జ్యాప్యాన్ని నివారించి, కరోనా వ్యాప్తికి సాధ్యమైనంత వరకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావించింది. అందుకనుగుణంగా జిల్లాల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టుల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. దక్షిణకొరియాలోని ఎస్‌డీ బయో సెన్సార్‌ సంస్థ అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 ఏజీఎస్‌డీ బయో సెన్సార్‌ కిట్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి వాటిని ఈనెల మూడో వారంలోనే జిల్లాకు పంపిణీ చేసింది. నల్లగొండ జిల్లాకు మొదటి విడతగా మొత్తం 2648 టెస్టింగ్‌ కిట్స్‌, రెండోవిడుతలో 3700కిట్లను సరఫరా చేసింది. వీటిని జిల్లా కేంద్ర దవాఖాన నుంచి పీహెచ్‌సీల వరకు అందజేశారు. వీటిని వినియోగించేందుకు మెడికల్‌ ఆఫీసర్లకు, ల్యాబ్‌ టెక్నీషియన్లకు తగిన శిక్షణ కూడా ఇచ్చారు. 

నల్లగొండ జిల్లా కేంద్ర దవాఖానతోపాటు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వరకు కరనా పరీక్షలను విస్తరించారు. నల్లగొండ దవాఖానతోపాటు మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్‌లోని ఏరియా దవాఖానల్లో,  కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు మర్రిగూడ, నకిరేకల్‌ దవాఖానల్లో పదిరోజులుగా పరీక్షలు జరుగుతున్నాయి. వీటితోపాటు ఐదు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, మిగిలిన ప్రైమరీ ఆరోగ్యకేంద్రాల్లోనూ గత నాలుగైదు రోజులుగా పరీక్షలు చేస్తున్నారు. ఈనెల 17వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తూ పరీక్షలు చేస్తున్నారు. అక్కడికక్కడే అరగంట  లోపే ఫలితాలను కూడా వెల్లడిస్తున్నారు. 

మంగళవారం వరకు జిల్లావ్యాప్తంగా 1700మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 284మందికి పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. ఇక వీటితోపాటు జిల్లాలోని అన్ని దవాఖానల్లో డిజిటల్‌ పల్స్‌ మీటర్లు, థర్మల్‌ స్కానర్లు కూడా ప్రభుత్వం ఇప్పటికే  అందుబాటులో ఉంచింది. వీలైనన్నీ ఎక్కువ పరీక్షలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అవసరాన్ని బట్టి ఎన్ని టెస్టింగ్‌ కిట్స్‌ అయినా సరఫరా చేస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది. సూర్యాపేట జిల్లాకు 4052 కిట్లు రాగా, ఇప్పటివరకు 1861మందికి పరీక్షలు చేశారు.  774మందికి పాజిటివ్‌ అని తేలింది.

 అక్కడికక్కడే ఫలితం...

సరిగ్గా పక్షంరోజుల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టింగ్‌ పద్ధతిలో అక్కడికక్కడే వ్యాధి నిర్ధరాణ చేస్తున్నారు. 15 నిమిషాల నుంచి అరగంట లోపే పాజిటివ్‌వా నెగెటివ్‌వా అనేది స్పష్టమవుతోంది. పరీక్ష కోసం వచ్చే వ్యక్తి ముక్కు నుంచి ఒక లిక్విడ్‌ పూసిన పుల్లతో స్వాప్‌ను సేకరిస్తున్నారు. దాన్ని ప్రత్యేక ద్రావకంలో ముంచితే పుల్లపై రెండు లైన్స్‌లా సింబల్‌ వస్తే పాజిటివ్‌గా ఒక లైన్‌లా వస్తే నెగెటివ్‌గా పరిగణిస్తారు. అయితే పరీక్షలు నిర్వహిస్తున్న ప్రతీ ఆరోగ్యకేంద్రం లేదా ప్రభుత్వ దవాఖానకు ప్రత్యేకమైన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇచ్చారు. పరీక్షల కోసం వచ్చిన వారి వివరాలను ముందుగా ఇందులో పొందుపరుస్తారు. తర్వాత ఫలితాలను కూడా ఇందులో అప్‌లోడ్‌ చేస్తున్నారు. తద్వారా ఈ మొత్తం ప్రక్రియను నేరుగా ఉన్నతాధికారులు పర్యవేక్షించేందుకు ఆస్కారం ఏర్పడింది. దీంతో కిందిస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రతిరోజు ఎన్ని పరీక్షలు, ఎన్ని పాజిటివ్‌, ఎన్ని నెగెటివ్‌ అనేవి వెంటనే వెల్లడి అవుతున్నాయి. ర్యాపిడ్‌ టెస్టింగ్‌ ద్వారా లక్షణాలు ఉన్న వ్యక్తికి అక్కిడికక్కడే ఫలితం ఎంటో తేల్చిచెప్పడం వల్ల ఎంతో ఉపయోగం జరుగుతోంది. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని వెంటనే అలర్ట్‌ చేస్తూ... ప్రత్యేకంగా ఉండాలని సూచిస్తున్నారు. దీంతోపాటు మరింత మందికి ఇది వ్యాపించకుండా తోడ్పడుతుంది. నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చిన వ్యక్తులకు మానసికంగా ఎంతో ఉపశమనం లభిస్తోంది.  

ర్యాపిడ్‌ టెస్టులతో వ్యాప్తికి అడ్డుకట్ట 

కరోనా వ్యాధి నిర్ధారణ కోసం ఎక్కడికక్కడే ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాం. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులకు వెంటనే వైద్యం అందిస్తూ  ఇతరులకు విస్తరించకుండా అడ్డుకుంటున్నాం.  పాజిటివ్‌ లక్షణాలు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు చేస్తున్నాం. భారీసంఖ్యలో ర్యాపిడ్‌ కిట్స్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. పాజిటివ్‌ వచ్చిన వారిలో 90శాతానికి పైగా హోంఐసోలేషన్‌లోనే చికిత్స సరిపోతుంది. మిగతావారికి కొవిడ్‌ వార్డుల్లో చికిత్స అందిస్తున్నాం. 95శాతం మంది   రికవరీ అవుతున్నారు. 

- డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కొండల్‌రావు


logo