శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 28, 2020 , 00:07:19

ఒకే భూమిని రెండుసార్లు ఎట్ల రిజిస్ట్రేషన్‌ చేస్తరు

ఒకే భూమిని రెండుసార్లు ఎట్ల రిజిస్ట్రేషన్‌ చేస్తరు

  • సూర్యాపేట కలెక్టరేట్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం 
  • పెట్రోల్‌ బాటిల్‌తో కాసేపు హంగామా 
  • అడ్డుకున్న స్థానికులు, కలెక్టరేట్‌ పోలీసు సిబ్బంది 
  • సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశం  

సూర్యాపేట : భూ సమస్యను పరిష్కరించాలని కోరు తూ ఓ యువకుడు సూర్యాపేట కలెక్టర్‌ కార్యాలయంలో పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి నేరేడుచర్ల మండలం పెంచికల్‌ దిన్న గ్రామానికి చెందిన పెద్దారపు నాగరాజు కలెక్టరేట్‌కు వచ్చాడు. తన వెంట తీసుకొచ్చిన పెట్రోల్‌ బాటిల్‌తో కాంప్లెక్స్‌లోని షటిల్‌ కోర్టు వద్దకు వెళ్లి పెట్రోల్‌ మీద పోసుకున్నాడు. యువకుడిని గమనించిన కలెక్టరేట్‌ సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది అతని పట్టుకొని పక్కకు తీసుకెళ్లారు. అనంతరం బాధితుడు నాగరాజు మాట్లాడుతూ తన అమ్మమ్మ అయిన చిలకరాజు మాణిక్యమ్మ 2016 పెంచికల్‌ దిన్న గ్రామ శివారులోని సర్వేనెంబర్‌ 135/ ఆలో ఉన్న 1.36 ఎకరాల భూమిలో ఒక ఎకరం భూమిని తన పేరుమీద గిఫ్ట్‌ డీడీ చేసిందని తెలిపాడు. కానీ 2020లో 1.36 ఎకరాల భూమిని చిలకరాజు మాణిక్యమ్మ కుమారుడి భార్య అయిన చిలకరాజు నాగమణిపై రిజిస్ట్రేషన్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకే భూమిని రెండు సార్లు ఎలా రిజిస్ట్రేషన్‌ చేస్తారని, తనకు నాకు న్యాయం చేయాలని కోరాడు. ఇప్పుడు పట్టా పాస్‌పుస్తకం రాకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారుల చుట్ట ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదన్నారు. 

బాధితుడితో ఫోన్‌లోమాట్లాడిన కలెక్టర్‌

కొవిడ్‌ నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేయగా కలెక్టర్‌ కలెక్టరేట్‌లో అందుబాటులో లేరు. దీంతో కలెక్టర్‌ కార్యాలయంలో యువకుడు ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి యువకుడితో ఫోన్‌లో మాట్లాడారు. ఆత్మహత్య చేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా న్యాయం చేస్తానని చెప్పారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని హుజూర్‌నగర్‌ రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు.


logo