శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 27, 2020 , 04:28:25

వరి నాటేద్దాం..

వరి నాటేద్దాం..

  • n సరైన యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి
  • n కాలిబాటలు తప్పని సరి
  • n అధికారుల సూచనలతో ఎరువుల వినియోగం

ప్రస్తుతం వానకాలం సీజన్‌లో బావులు, బోర్లకింద వరి నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. నాట్లు వేసేటప్పుడు తగిన యాజమాన్య పద్ధతులు పాటించకపోతే దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు సాగుచేస్తే అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది.  

- నేరేడుచర్ల 


పొలం తయారీ 

వరినాట్లు వేయడానికి మూడు వారాల ముందుగానే పొలాన్ని తయారు చేసుకోవాలి. ట్రాక్టర్‌ లేదా ఎడ్ల నాగలితో ఒకసారి దున్నిన తర్వాత నాలుగైదు రోజులకు మరో సారి దున్నాలి. ఇలా చేయడం వల్ల కలుపు మొక్కలు భూమిలో కలిసిపోయి పంటకు ఎరువుగా ఉపయోగపడతాయి. హడావిడిగా పొలాన్ని సిద్ధం చేస్తే కలుపు మొక్కలు ఎక్కువై దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. చాలా మంది రైతులు జనుము, జీలుగ, పెసర వంటి పచ్చిరొట్ట పైర్లను వేసుకొని 30 రోజుల తర్వాత భూమిలో కలియదున్నుతున్నారు. ఇవి భూమిలో చివికి పంటకు అవసరమైన పోషకాలు లభిస్తాయి. పచ్చి రొట్ట పైర్లు భూమిలో చివకడానికి సుమారు రెండు వారాల సమయం పడుతుంది. వాటిని దున్నేసమయంలో ఎకరానికి 50 కిలోల సింగిల్‌ సూపర్‌ పాస్పేట్‌ వేసుకుంటే త్వరగా భూమిలో  కలిసిపోతాయి. 

నాట్లు వేసేటప్పుడు 

నారు పోసిన తర్వాత పొలంలో నాటేందుకు 4నుంచి 6 ఆకులు కలిగిన మొక్కలు ఆనుకూలంగా ఉంటాయి. బురద ఉండేలా పొలాన్ని తయారు చేసుకొని 2 నుంచి 3 సెంటిమీటర్ల లోతులో నాటితే మంచిది. ఎక్కువ లోతుగా నాటితే పిలకలు రావడం ఆలస్యమవడంతో పాటు వాటి సంఖ్య తగ్గుతుంది. కుదురుకు 2-3 మొక్కలు నాటవచ్చు. నాటేటప్పుడు నారు తలలు తుంచితే మంచిది. సరైన సమయంలో  మొక్కలు నాటితే కొనలను కత్తిరించాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా వానకాలంలో చదరపు మీటరుకు దీర్ఘకాలిక రకాలైతే 33 కుదుళ్లు, మధ్యకాలిక రకాలైతే 44 కుదుళ్లు, స్వల్పకాలిక రకాలైతే 50 కంటే ఎక్కువ కుదుళ్లు ఉండేలా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు లేత నారును నాటుకోవడం మంచిది.

దుక్కిలోనే మొదటి దఫా ఎరువులు 

పొలాన్ని దున్నిన తర్వాత దమ్ము చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కలుపు రాదు. పైరంతటికీ నీరు సమానంగా అందుతుంది. చివరి దమ్ములో ఆయా ప్రాంతాలకు సిఫార్సు చేసిన నత్రజని, భాస్వరం, పొటాష్‌ ఎరువులను మొదటి దఫాగా వేసుకోవాలి. కాంప్లెక్స్‌ ఎరువులు వాడదల్చుకుంటే వాటిని దుక్కిలోనే వేసుకోవడం మంచిది. దమ్ములో జింక్‌, భాస్వరం ఎరువులను ఒకే సారి వేయకుండా 2-3రోజుల వ్యవధి ఉండేలా చూడాలి. పొలం గట్లపై ఉన్న కలుపు మొక్కలు, గడ్డిని తీసివేయాలి. 

కాలి బాటలు తప్పనిసరి 

నాట్లు వేసేటప్పుడు ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల చొప్పున కాలిబాటలు తీస్తే పైరుకు గాలి వెలుతురు లభిస్తాయి. చీడపీడల ఉధృతి కొంత వరకు తగ్గుతుంది. ఎరువులు వేయడం, చీడపీడలు, కలుపు నివారణ మందుల పిచికారీ, పైరు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించడం వంటివి తేలికవుతాయి.

 నీటి యాజమాన్యం   

నీటి యాజమాన్యం విషయంలో జాగ్రత్తలు పాటిస్తే పిలకలు సకాలంలో వచ్చి దిగుబడి బాగా ఉంటుంది. నాట్లు వేసిన నాటి నుంచి పైరు మూన తిరిగే వరకు (20 రోజుల పాటు) పొలంలో పలుచగా నీరు ఉంచాలి. పొలంలో నీరు తగిన మోతాదులో ఉంటే సుడి దోమ, లద్దె పురుగుల తాకిడి పెద్దగా ఉండదు. తడి ఆరిపోతే కలుపు మొక్కలు ఎక్కువగా వస్తాయి. రసాయన ఎరువులు వేసేటప్పుడు పొలంలో నీరు తక్కువగా ఉండాలి. logo