సోమవారం 28 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 25, 2020 , 01:56:10

కోదాడ టు కోల్‌కతా

కోదాడ టు కోల్‌కతా

కోదాడ : కోదాడ పట్టణ కేంద్రంగా బాతుగుడ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. నాగార్జున సాగర్‌ ఆయకట్టు చివరి ప్రాంతం కావడం, ఇక్కడ పంటలు బాగా పండుతుండడంతో బాతుల పెంపకాన్ని కొందరు ఉపాధిగా ఎంచుకున్నారు. కొందరు వ్యాపారులు బాతుగుడ్లను పలు రాష్ర్టాలకు ఎగుమతి చేస్తూ లబ్ధిపొందుతున్నారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మందికి జీవనోపాధి లభిస్తోంది. 

బాతు గుడ్లను సేకరించి..

బాతు గుడ్లను వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు కొనుగోలు చేసి కోదాడ కేంద్రంగా పలు ప్రాంతాలకు విక్రయిస్తుంటారు. బాతుగుడ్లు అధికంగా డిమాండ్‌ ఉన్న పశ్చిమ బెంగాల్‌, కేరళ రాష్ర్టాలకు ఎగుమతి చేస్తుండడంతో పలువురికి ప్రయోజనకరంగా మారింది. స్థానికులతో పాటు తెలుగు రాష్ర్టాలలోని వివిధ ప్రాంతాల నుంచి గుడ్లను సేకరించి ఎగుమతి చేస్తున్నారు. ఆటుపోట్లు ఎదురైనప్పటికీ దీనిపై ఆధారపడి  అనేక కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. కోదాడ ప్రాంతం నాగార్జున సాగర్‌ ఆయకట్టు పరిధిలో ఉండటంతో పంటల కోతల అనంతరం వ్యవసాయ భూముల్లో లభించే ఆహారాన్ని తీసుకుంటూ బాతులు పెట్టిన గుడ్ల ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు. ఒ క్కో కుటుంబంలోని భార్యాభర్తలు సుమారు వెయ్యి బాతులను హేచరీల నుంచి కొనుగోలు చేసి వాటిని సుమారు 5 నెలలపాటు నిరుపయోగంగా ఉన్న వ్యవసాయ భూముల్లో తిప్పుతూ జీవనం కొనసాగిస్తుంటారు. వెయ్యి బాతులను సాకిన వ్యక్తి రోజుకు సుమారు 500 నుంచి 600 వరకు గుడ్లను సేకరిస్తూ కోదాడ ప్రాంతంలో ఉన్న వ్యాపారులకు విక్రయిస్తుంటారు. ఒక్కో గుడ్డును సీజన్‌ బట్టి రూ.4 నుంచి 6 వరకు అమ్ముతుంటారు. సదరు వ్యాపారులు పెంపకందార్ల నుంచి సేకరించిన గుడ్లను అధికంగా కొనుగోలు చేసే కోల్‌కతా, కేరళ రాష్ట్రాలలోని వివిధ మార్కెట్‌లకు ఎగుమతి చేస్తుంటారు. నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు అధికంగా ఎగుమతులు ఉంటాయని, మిగతా నెలలో సాధారణ వ్యాపారం కొనసాగుతుందని వ్యాపారులు తెలుపుతున్నారు. బాతుల పెంపకందార్లకు ముందస్తుగా వేల రూపాయలను అడ్వాన్సుగా చెల్లించినప్పటికీ ఆశించిన మేరకు గుడ్లు రాని పరిస్థితిలో నష్టాలకు గురవుతాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతరుల నుంచి లక్షలాది రూపాయలు అప్పుగా తెచ్చి వ్యాపారం కొనసాగించాల్సి వస్తుందని అంటున్నారు. ప్రభుత్వం సబ్సిడీల రూపంలో వ్యాపారులను ఆదుకోవాలని కోరుతున్నారు. అధిక పోషక విలువలు ఉండే బాతుగుడ్ల విక్రయాలతో అటు బాతుల పెంపకందార్లకు, ఇటు వ్యాపారులు ఒడిదుడుకులతోనే జీవనం కొనసాగిస్తున్నారని పేర్కొనవచ్చు. సూర్యాపేట జిల్లాలో కోదాడ కేంద్రంగా, నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ, చిట్యాల కేంద్రాలలో మార్కెట్లను అనుసరిస్తూ ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. 

ఇప్పుడు ఆశాజనకంగానే ఉంది

బాతుగుడ్ల ఎగుమతి వ్యాపారం నిత్యం ఆటు పోట్లతో కొనసాగుతోంది. వ్యాపారులుగా మేము ఒడిదుడుకులతోనే వ్యాపారం కొనసాగిస్తున్నాం. బాతుగుడ్ల ద్వారా పెంపకందారులతోపాటు వందల మంది వ్యాపారులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు ముందు కంటే నీటి లభ్యతతోపాటు వ్యవసాయం పెరిగింది. దీంతో బాతులకు మేత లభిస్తుండటంతో వ్యాపారం ఆశాజనకంగా ఉంది.  -రావూరి రాజు, బాతుగుడ్ల వ్యాపారిlogo