బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 24, 2020 , 00:43:04

వద్దన్నదాకా గోదావరి నీళ్లు

వద్దన్నదాకా గోదావరి నీళ్లు

  •  రైతు వేదికలు ఆధునిక దేవాలయాలు
  •  గిట్టుబాటు ధర నిర్ణయించుకునే రోజు దగ్గర్లోనే ఉంది
  •  ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణకు మహాత్ముడే..
  •  విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
  • పేట నియోజకవర్గంలో రైతు వేదికలకు శంకుస్థాపన
  •  ఆత్మకూర్‌ (ఎస్‌)మండలంలోఇనాం భూములకు పట్టాల పంపిణీ

రైతాంగం వద్దనేంత వరకూ సూర్యాపేట జిల్లాలో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతాయని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. కలలోనూ ఎవరూ ఊహించని విధంగా గోదావరి నీళ్లు సుమారు 350కి.మీ దూరం నుంచి సూర్యాపేట జిల్లా ఆసాంతం పరుగులు పెట్టించిన మహాత్ముడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని కొనియాడారు. గురువారం తన నియోజకవర్గంలోని సూర్యాపేట, పెన్‌పహాడ్‌, చివ్వెంల, ఆత్మకూర్‌(ఎస్‌) మండలాల్లో రైతు వేదికల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. అదే విధంగా ఆత్మకూర్‌.ఎస్‌ మండల కేంద్రంలో పాతర్లపహాడ్‌, కందగట్ల గ్రామాలకు చెందిన ఇనాం భూముల లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ ‘కొందరు కలలు కంటారు.. మరి కొందరు పగటి కలలు కంటారు.. తెలంగాణ వస్తదని కన్న కలలు సాకారమయ్యాయి.. కానీ, పగటి కలలు కన్న వారు మాత్రం ఇప్పుడు రాత్రుళ్లు కలవరపడి ఆగమవు తున్నారు’ అని ప్రతిపక్షాలను ఎద్దేవా చేశారు. రైతును రాజును చేయాలన్న సీఎం కేసీఆర్‌ సంకల్పబలంతోనే అసాధ్యం అనుకున్నవన్నీ సుసాధ్యం అవుతున్నా యన్నారు. 24గంటల కరెంటు, ఎకరానికి రూ.10వేలు, రైతు బీమాతోపాటు పండించిన పంటకు రైతే ధర నిర్ణయించుకునే రోజు రావాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన అని తెలిపారు. రైతు వేదికలు రైతాంగానికి ఆధునిక దేవాలయాలుగా మారబోతున్నాయని మంత్రి పేర్కొన్నారు. 


ఆత్మకూర్‌.ఎస్‌/సూర్యాపేట రూరల్‌/చివ్వెంల/పెన్‌పహాడ్‌ : రైతులు వద్దనే దాకా సూర్యాపేట జిల్లాలో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతాయని  విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం ఆత్మకూర్‌.ఎస్‌, సూర్యాపేట మండలం టేకుమట్ల, చివ్వెంల, పెన్‌పహాడ్‌లో రైతు వేదికల నిర్మాణాలతోపాటు పెన్‌పహాడ్‌లో రూ.3.33కోట్లతో చేపట్టిన కస్తూర్బా ఆశ్రమ పాఠశాల నూతన భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఆత్మకూర్‌ ఎస్‌. మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాతర్లపహాడ్‌, కందగట్ల గ్రామాలకు చెందిన ఇనాం భూముల లబ్ధిదారులకు పట్టాలు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొందరు కలలు కంటారు.. మరి కొందరు పగటి కలలు కంటారు.. తెలంగాణ వస్తదని కలలు కన్న వారి కలలు సాకారమయ్యాయని, పగటి కలలు కన్న వారు మాత్రం ఇప్పుడు రాత్రిళ్లు కలవరపడి ఆగమవుతున్నారని ఎద్దేవా చేశారు. అందరూ అనుకున్నది అనుకున్నట్లు సాధించలేరని, అలా సాధించగలిగిన వారిని మహాత్ములని సంబోధించిన చరిత్ర మనుకుందని,
అలాంటి మహాత్ముడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని కొనియాడారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర సాధించడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పమన్నారు. రైతులు అధునాతన వ్యవసాయం వైపు అడుగులు వేయాల్సిన అవసరముందన్నారు. రైతాంగాన్ని సంఘటితం చేసేందుకే రైతు వేదికల నిర్మాణాలకు సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. దశాబ్దాలుగా రైతాంగాన్ని కేవలం ఓటు బ్యాంకుగానే చూసిన కాంగ్రెస్‌ తదితర పార్టీలకు రైతుబంధు, రైతుబీమాతోపాటు రైతువేదికలు, కల్లాల నిర్మాణాలు కలలో కూడా వచ్చి ఉండవని మంత్రి పేర్కొన్నారు. 45ఏళ్లుగా గోదావరి జలాల కోసం ఎదురుచూసిన సూర్యాపేట జిల్లా ప్రజలకు  తాము చెప్పిన ప్రకారం 350కిలోమీటర్ల దూరం నుంచి కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు తీసుకొచ్చామన్నారు. సమైక్య పాలనలో తాగు, సాగునీటి  కోసం ధర్నాలు, రాస్తారోకోలు జరిగితే.. నేడు ఇక తమకు నీళ్లు చాలన్న రోజులు వచ్చాయన్నారు. గత ప్రభుత్వాల హయాంలో వ్యవసాయం దండుగ కాగా నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో పండుగలా మారిందన్నారు. ఇక నుంచి సంవత్సరం పొడవునా వ్యవసాయానికి గోదావరి జలాలు అందించి రైతులను ఆదుకోబోతున్నట్లు మంత్రి భరోసా ఇచ్చారు. తెలంగాణ ఏర్పడితే చిమ్మచీకట్లు అలుముకుంటాయని ఉమ్మడి రాష్ట్రం చివరి సీఎం కర్ర పట్టుకొని బోధించిన నాడు ఇక్కడి కాంగ్రెస్‌ నేతలంతా సీమాంధ్రుల మోచేతి నీళ్లు తాగిన వారేనని విమర్శించారు. రైతు వేదికల ద్వారా బహుళ ప్రయోజనాలున్నాయని, రైతులంతా ఒకే వేదిక కిందకొచ్చి తాము పండించే పంటలపై చర్చకు దిగితే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చన్నారు.
పొలాల వద్ద కల్లాల నిర్మాణం వ్యవసాయ రంగంలో సంచలనాత్మకమైందన్నారు. ఈ సందర్భంగా చివ్వెంల మండల లక్ష్మీనాయక్‌తండా వద్ద గోదావరి జలాలకు పుష్పాభిషేకం చేసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీళ్లు పోశారు. పెన్‌పహాడ్‌ మండల కేంద్రంలో కస్తూర్బా ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు ప్రభుత్వం అందించిన ఉచిత పాఠ్య పుస్తకాలను  పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో  రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్‌ సంజీవరెడ్డి, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ వట్టె జానయ్యయాదవ్‌, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ ఎస్‌ఏ రజాక్‌, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, డీఏఓ జ్యోతిర్మయి, ఆర్డీఓ మోహన్‌రావు, ఎంపీపీలు మర్ల స్వర్ణలత, బీరవోలు రవీందర్‌రెడ్డి, కుమారిబాబునాయక్‌, నెమ్మాది భిక్షం, జడ్పీటీసీలు జీడి భిక్షం, మామిడి అనిత, సంజీవనాయక్‌, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్లు  కక్కిరేణి నాగయ్యగౌడ్‌, పొదిల నాగార్జున,  గ్రామ కో ఆర్డినేటర్లు, వైస్‌ ఎంపీపీలు, ఎంపీడీఓలు, తాసిల్దార్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.   


logo