సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 20, 2020 , 05:33:02

పలుచోట్ల భారీ వర్షం

పలుచోట్ల భారీ వర్షం

  • జిల్లావ్యాప్తంగా అల్పపీడన  ద్రోణి ప్రభావం
  • జలమయమైన రోడ్లు..పొంగిన కాల్వలు.. 
నల్లగొండ : అల్పపీడన ప్రభావంతో జిల్లాలో ఆదివారం పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. నల్లగొండ జిల్లాకేంద్రంలో మోస్తరు వర్షం పడగా మునుగోడు, కట్టంగూర్‌, కేతేపల్లి మండలాల్లో భారీ వర్షం పడింది. దాదాపు గంటసేపు వర్షం కురవడంతో పంటపొలాల్లో వరదనీరు ఉధృతి కొనసాగింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఈ వర్షం పత్తి, కంది, వేరుశనగ పంటలకు మేలు చేకూరుస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆరు మండలాల్లో వర్షం పడగా 1.6మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా శాలిగౌరారంలో 23.2 మి.మీ. నకిరేకల్‌లో 12.8, నార్కట్‌పల్లిలో 3.6, కట్టంగూర్‌ 3.3, కేతేపల్లి 2.5మి.మీ. వర్షం కురవగా అత్యల్పంగా చిట్యాలలో 1.9 మి.మీ. వర్షం పడింది. ఇక ఈ సీజన్‌లో ఇప్పటివరకు 172.8 మి.మీ. గాను 206.0 మి.మీ. పడటంతో 20 శాతం అదనపు వర్షపాతం నమోదైంది.

సూర్యాపేట జిల్లాలో..

సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం గంటకు పైగా భారీ వర్షం కురిసింది. ఆత్మకూరు(ఎస్‌), చివ్వెంల, సూర్యాపేట, తుంగతుర్తి, పెన్‌పహాడ్‌ మండలంలోని కొన్ని గ్రామాల్లో వర్షం కురిసింది. భారీ వర్షం కురవడంతో సూర్యాపేట పట్టణంలోని రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వర్షపునీటితో నిండిపోయాయి. పలు గ్రామాల్లో కుంటలు, చెరువులు నిండిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం ఎండ ఎక్కువగా ఉండి ఒక్కసారిగా మేఘావృతమై ఎడతెరిపి లేకుండా గంటపాటు వర్షం కురిసింది.

మూసీ ప్రాజెక్టుకు 600క్యూసెక్కుల ఇన్‌ఫ్లో


కేతేపల్లి : మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు ఎగువప్రాంతాల నుంచి ఆదివారం సాయంత్రం వరకు 600క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం 615.30(0.267 టీఎంసీలు) అడుగులకు పెరిగింది. ప్రాజెక్టు 5వ నెంబరు రెగ్యులేటరీ గేటు ఊడిపోవడంతో ఇటీవల శాశ్వత ప్రాతిపదికన నూతన గేటును ఏర్పాటు చేశారు. నూతన గేటు ఏర్పాటు పనులు పూర్తికావడంతో ప్రాజెక్టులో నీటినిలువ ప్రారంభం అయ్యింది. దీంతో 610అడుగుల కనిష్ట నీటిమట్టం నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 (4.46 టీఎంసీలు) అడుగులుగా ఉంది.


logo