ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 20, 2020 , 05:29:34

కృత్రిమ చెరువులు.. ఆర్థిక వనరులు

కృత్రిమ  చెరువులు.. ఆర్థిక వనరులు

  • నీలి విప్లవంలో నూతన అధ్యాయం 
  • ఉపాధి కూలీలతో చేపల చెరువుల తవ్వకాలు
  • సన్నకారు రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహకాలు
  • దరఖాస్తు చేసుకున్నప్రతి రైతుకూ అనుమతి
  • అర ఎకరంలో చెరువు ద్వారా రూ.4లక్షల ఆదాయం
  • రోల్‌ మోడల్‌గా కోదాడ,  హుజూర్‌నగర్‌ చెరువులు 

తెలంగాణ ప్రభుత్వం అన్నదాతకు ఆర్థిక పరిపుష్టి కల్గించడం కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న వాటికి కూడా ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇప్పటి వరకు చెరువుల్లో ఉచితంగా చేపపిల్లలు వదలడం ద్వారా మత్స్యకారులకు ఉపాధి మార్గం సుగమం చేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం మరో అడుగు ముందుకేసి ఉపాధిహామీ పథకం ద్వారా రైతుల భూముల్లో ఉచితంగా చేపల చెరువులు తవ్విస్తోంది. సన్నకారు రైతులకు లబ్ధి కలిగేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.   - కోదాడ 

 సన్నకారు రైతులకు ఆర్థిక పరిపుష్టి కల్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు అనుసంధానం చేసింది. ఇందులో భాగంగా నీటి వసతి ఉన్న రైతుల పొలాల్లో ఉపాధి కూలీలతో చేపల చెరువుల తవ్వకాలు చేపడుతోంది. దీంతో ఆయా గ్రామాల్లోని కూలీలకు సంవత్సరం పొడవునా పని లభించడంతో పాటు రైతులకూ లబ్ధి చేకూరనుంది. 5 ఎకరాలున్న సన్నకారు రైతులు, 10 ఎకరాల లోపు ఉన్న ఎస్సీ రైతులు ఈ పథకాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధి సహాయ సంచాలకుడు డా.పెంటయ్య మార్గదర్శకత్వంలో కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లోని 13 మండలాల్లో 90 చెరువులకుగాను 70 పూర్తయ్యాయి. చేపల చెరువుల ద్వారా అర ఎకరంలోనే అన్ని ఖర్చులు పోనూ 4 లక్షలకు పైగా ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది.  

చేపల చెరువులతో ఆదాయం

చేపల చెరువు గట్లపై తీగ పందిళ్లతో కూరగాయలు పండించి సంవత్సరం పొడవునా ఆదాయం పొందవచ్చు. దీంతోపాటు పాడి పరిశ్రమకు ఉపకరించే పశుగాస్రం కూడా లభిస్తుంది. గడ్డి పెంపకంతో కట్టకోత అరికట్టడంతోపాటు పశువులకు పచ్చిమేత లభిస్తుంది. ఈ మేతతో ఒక్కొక్క పశువు రోజూ ఒక లీటర్‌ అధికంగా పాలు ఇస్తాయి. ఫలితంగా రైతులకు అదనపు ఆదాయం లభించనుంది. దీంతో పాటు చెరువుల్లో నీటి మీద తేలియాడే కోళ్ల గూళ్లు ఏర్పాటు చేసుకుంటే చెరువులోని అజోల్లా కోళ్లకు మేత అవుతుంది. దీనికి తోడు కోళ్ల పెంట చేపలకు ఆహారమవుతుంది. చేపల చెరువులున్న గ్రామాల్లో చిరు వ్యాపారులకు ఉపాధి కూడా లభిస్తుంది. గ్రామాల్లోనే చేపలు కొనుక్కొని ఇతర గ్రామాలకు వెళ్లి అమ్ముకోవడం వల్ల వారికి ఆదాయ మార్గం లభిస్తుంది. హరితహారంలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న శ్రీగంధం లాంటి మొక్కలను నాటితే భవిష్యత్తులో అవి కూడా ఆదాయ వనరులవుతాయి.

చేపల పెంపకంతో నికర ఆదాయం

ఎకరం వరి పంటకు రెండు కార్లల్లో ఖర్చులు పోను రూ.40వేల ఆదాయం లభిస్తుంది. అదే అర ఎకరం చేపల చెరువులో సాలుసరి మేత, చేప పిల్లలకు గ్రాసం, తవుడు, చెక్క, అజోల్లా(నీటి తేలియాడే నాచు), నిర్వహణ ఖర్చులు కలిపి రూ.70 వేల కంటే ఎక్కువ కాదు. చేపల విక్రయం ద్వారా ఖర్చులన్నీ పోను రూ.4 లక్షల వరకు ఆదాయం లభిస్తుంది.  

రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు ప్రణాళికలు

కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లోని చేపల చెరువుల నిర్వహణను స్ఫూర్తిగా తీసుకుని ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గత నెలలో సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌ సువర్ణ నేతృత్వంలో సంబంధిత అధికారులతో ఇదే అంశంపై సమీక్ష నిర్వహించారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రోత్సాహంతో మత్స్యశాఖ మంత్రి శ్రీనివాసయాదవ్‌ సంబంధిత అధికారులతో పలుమార్లు సమీక్ష సైతం నిర్వహించారు.

కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో..

కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో 90 చెరువుల తవ్వకానికి అధికారులు అనుమతివ్వగా.. ఇప్పటికే 70 చెరువులు పూర్తయ్యాయి. చిలుకూరు మండలంలోని కొండాపురంలో శ్రీరామ్‌ రామకృష్ణ అనే సన్నకారు రైతు చేపల చెరువులో పెంచుతున్న చేపలు మరో నెలలో విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాడు. కోదాడ మండలం దోరకుంటలో బలపటి వెంకటేశ్వర్లు, చాకిరాలలో గరిడేపల్లి రాములు, మఠంపల్లిలో భూక్యా గామా, పాలెఅన్నారానికి చెందిన తమ్మనబోయిన రామారావు చేపల చెరువుల్లో కూడా ఇప్పటికే చేపలు అరకిలో నుంచి కేజిన్నర వరకు బరువు పెరిగాయి. మరో రెండు నెలల్లో వాటిని విక్రయిస్తామని.. అరెకరంలో ఖర్చులు పోను రూ. మూడున్నర నుంచి రూ.4లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. 

సన్నకారు రైతులకు వరప్రదాయిని..

ఉపాధిహామీ కింద నిర్మితమవుతున్న చేపల చెరువులు సన్నకారు రైతులకు వరప్రదాయినిగా మారుతున్నాయి. జాబ్‌కార్డు ఉండి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ అనుమతి ఇస్తాం. చేపల పెంపకంతో అర ఎకరానికి ఖర్చులు పోను రూ.4 లక్షల ఆదాయం లభిస్తుంది. ప్రభుత్వమే ఉచితంగా చేపల చెరువులు తవ్విస్తుండడంతో రైతులకు ఆర్థిక భారం తప్పుతోంది.  

- డా.పెంటయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి సహాయ సంచాలకుడు, సూర్యాపేట జిల్లా  

చేపల చెరువుతో ఆర్థిక వెసులుబాటు

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంతో చేపల చెరువును ఏర్పాటు చేసుకున్నా. డా.పెంటయ్య సూచనలు పాటిస్తూ ఆయన పర్యవేక్షణలో చేపలను పెంచుతున్నా. ఇప్పటికే నా చెరువులో రూ.4 లక్షల విలువ కలిగిన చేపలున్నాయి. వచ్చే నెలలో అమ్మేందుకు సిద్ధం చేస్తున్నా. వరి పంట కంటే అర ఎకరంలో అధిక ఆదాయం లభిస్తున్నందుకు సంతోషంగా ఉంది.

- శ్రీరాం రామకృష్ణ, రైతు, కొండాపురం, చిలుకూరు మండలంlogo