సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 20, 2020 , 05:05:23

కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలి

కరోనా పట్ల  జాగ్రత్తగా ఉండాలి

  • అన్ని ప్రాంతాల్లో వైరస్‌ విస్తరించడంతో అప్రమత్తత తప్పనిసరి 
  • ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి
  •  నిబంధనలు పాటిస్తూ హరిత హారం కొనసాగించాలి
  • కరోనా అభివృధ్ధికి ఆటంకం కాదు.. 
  • అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయి
  • ‘పేట’ నియోజక వర్గ ప్రజా ప్రతినిధులతో మంత్రి జగదీశ్‌ రెడ్డి సెల్‌ కాన్ఫరెన్స్‌

సూర్యాపేట టౌన్‌ : పట్టణాలతోపాటు గ్రామీణప్రాంతాల్లో సైతం కరోనా విస్తరించిందని, ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో ఆదివారం ప్రత్యేకంగా సెల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి కరోనా కట్టడికి చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న హరితహారం కార్యక్రమాన్ని నిబంధనలు పాటిస్తూ కొనసాగించాలన్నారు.

కరోనా నేపథ్యంలోనూ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగుతాయన్నారు. అలాగే రైతుబంధు, రుణమాఫీ ఆసరా పింఛన్‌లతోపాటు ఇతర పథకాలకు నిధుల కేటాయింపులో ఎలాంటి ఇబ్బందిలేదని స్పష్టంచేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఆకలి చావులు ఉండకూడదని సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు లాక్‌డౌన్‌ సమయంలోనూ గణనీయమైన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ నగదు, పేపర్లు తీసుకునేటప్పుడు మరింత జాగ్రత్త తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారంతోపాటు ఇంకా జరగాల్సిన అభివృద్ధిపై పట్టణంలో వ్యాపారస్తులతో త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా కరోనా బారినపడిన పేదల కోసం ఐసోలేషన్‌ కోసం ప్రత్యేక బిల్డింగ్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏ ఒక్కరూ అధైర్యపడకుండా స్వీయ నియంత్రణ, భౌతికదూరం పాటిస్తూ శానిటైజర్లు, మాస్కులు ధరించి కరోనా బారినపడకుండా జాగ్రత్త పడాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా

అన్నిప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ దవాఖానలతోపాటు హెల్త్‌సెంటర్లలో కరోనా టెస్టులు చేసేందుకు ప్రత్యేకంగా ర్యాపిడ్‌ కిట్లు ఏర్పాటు చేశామని త్వరలోనే ప్రారంభంకానున్నట్లు తెలిపారు. అపోహలతో ఎవరూ అధైర్యపడవద్దని జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సెల్‌ కాన్ఫరెన్స్‌లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్‌ వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పుట్ట కిషోశ్‌, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో మంత్రి మాట్లాడారు.


logo