శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 17, 2020 , 03:54:40

జాగ్రత్తలు పాటిస్తే కరోనా దూరం

జాగ్రత్తలు పాటిస్తే కరోనా దూరం

  • పలుగ్రామాల్లో ఇంటింటి సర్వే 
  • పాజిటివ్‌ కేసులున్న గ్రామాల్లో శానిటైజేషన్‌  

   హుజూర్‌నగర్‌ : మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించడం, శానిటైజర్‌తో చేతులను కడుక్కోవడం,  పౌష్టికాహారం తీసుకుంటే కరోనాకు దూరంగా ఉండవచ్చని పలువురు వైద్యాధికారులు పేర్కొన్నారు. గురువారం హుజూర్‌నగర్‌లోని అంబేద్కర్‌ కాలనీలో వైద్యాధికారి లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి  మాట్లాడారు. హుజూర్‌నగర్‌ మండలంలో ఇప్పటి వరకు 8మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. వీరి ద్వారా 45మంది ప్రైమరీ కాంటాక్ట్‌, 59మంది సెంకడరీ కాంటాక్ట్‌గా గుర్తించి వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచినట్లు  తెలిపారు. 

మేళ్లచెర్వు మండలంలో.. 

మేళ్లచెర్వు : మేళ్లచెర్వుతోపాటు వేపలమాధవరం, రామాపురంలో ఒక్కో పాజిటివ్‌ కేసు  నమోదైనట్లు  వైద్యాధికారి ప్రేమ్‌సింగ్‌ తెలిపారు. వీటిలో బుధవారం రాత్రి 2, గురువారం 1 నమోదైనట్లు చెప్పారు.  ఆయా గ్రామాల్లో వైద్యసిబ్బంది సర్వే చేపట్టి, శానిటైజేషన్‌ చేశామన్నారు.  30మందిని హోంక్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిపారు.   

చెర్వుతండాలో ఇంటింటి సర్వే

పాలకవీడు : మండలంలోని చెర్వుతండాలో గురువారం వైద్యాధికారి నాగయ్య ఆధ్వర్యంలో నేరేడుచర్ల పీహెచ్‌సీ సిబ్బందితో కలిసి ఇంటింటి సర్వే చేశారు. కరోనా సోకిన వ్యక్తితో ప్రైమరీ కాంటాక్టు ఉన్న ఏడుగురిని, సెంకండరీ కాంటాక్టు ఉన్న  11మందిని హోంక్వారంటైన్‌ చేసినట్లు తెలిపారు. శ్యాంసుందర్‌రెడ్డి, కృష్ణ, సునీత, నాగేంద్రమ్మ, ఆశ కార్యకర్తలు  పాల్గొన్నారు.  

కూచిపూడి గ్రామంలో.. 

కోదాడ రూరల్‌ : మండలంలోని కూచిపూడి, కూచిపూడితండాలో గురువారం కాపుగల్లు పీహెచ్‌సీ సిబ్బంది ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. మండల వైద్యాధికారి కళ్యాణ్‌చక్రవర్తి మాట్లాడుతూ.. మండలవ్యాప్తంగా ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం ఉన్నట్లయితే ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.  లక్ష్మీనర్సమ్మ, తిరుపతమ్మ, శ్రీనివాసరావు, గోపమ్మ, రూప, భవానీ, విజయ్‌కుమార్‌, పద్మ  పాల్గొన్నారు.

 వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి 

చిలుకూరు : కరోనా వైరస్‌ దృష్ట్యా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తాసిల్దార్‌ శ్రీనివాసశర్మ, ఎస్‌ఐ నాగభూషణ్‌రావు సూచించారు. గురువారం మండలంలోని బేతవోలులో మహిళకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆమె ఇంటిని పరిశీలించారు. ఎవరికైనా అనారోగ్య పరిస్థితులుంటే ప్రభుత్వ దవాఖానలో సంప్రదించాలన్నారు. అనంతరం  పారిశుధ్య పనులు చేపట్టారు.  సర్పంచ్‌ వట్టికూటి చంద్రకళ, డాక్టర్‌ కిరణ్‌కుమార్‌, సీహెచ్‌ఓ వినోద్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి

  • మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ పద్మాసైదేశ్వర్‌రావు

మేళ్లచెర్వు : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో పారిశుధ్య పనులు విస్తృతంగా చేపట్టాలని ఎంపీపీ కొట్టె పద్మాసైదేశ్వర్‌రావు సూచించారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఆమె అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా ముగిసింది. ఈ సందర్భంగా పలువురు అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. సభ్యులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. సమావేశానికి విద్యుత్‌, వైద్య శాఖల అధికారులు హాజరుకాకపోవడంపై పలువురు సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఇప్పటివరకు కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తూ  సూపరింటెండెంట్‌గా పదోన్నతితో నడిగూడేనికి బదిలీపై వెళ్లిన సయ్యద్‌ ఇమామ్‌ను సన్మానించారు.  ఎంపీడీఓ ఇసాక్‌హుస్సేన్‌, వైస్‌ఎంపీపీ గాయం గోపిరెడ్డి,  సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.



logo