సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 17, 2020 , 00:41:39

బిందు సేద్యానికి ప్రోత్సాహం

బిందు సేద్యానికి  ప్రోత్సాహం

  • ఉద్యాన రైతులకు డ్రిప్‌ సబ్సిడీ
  • ఎస్సీ, ఎస్టీలకు 100శాతం రాయితీ 
  • దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ప్రభుత్వం 

ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకంగా డ్రిప్‌ ఇరిగేషన్‌ విధానాన్ని సమకూర్చాలని నిర్ణయించింది. పంట్ల తోటలు, ఆయిల్‌ పామ్‌, ఆగ్రో ఫారెస్ట్‌ (శ్రీగంధం) సాగు చేసే రైతులకు సబ్సిడీపై అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఐదు హెక్టార్ల వరకు 80శాతం, రెండు హెక్టార్లకు తక్కువ ఉన్న రైతులకు 90శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు 100శాతం సబ్సిడీపై ఇవ్వనున్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ అందజేయనుండగా ఉమ్మడి జిల్లాలోని రైతులకు ఎంతో ఉపయుక్తం కానుంది.        - సూర్యాపేట

సూర్యాపేట : ఉద్యాన పంటల సాగుపై తెలంగాణ ప్రభుత్వం మరోమారు దృష్టి సారించింది. ఇప్పటికే ఉద్యానపంటల సాగును ఉపాధి హామీలో  చేర్చింది. పంటకు నీటిని సరఫరా కోసం ఉపయోగించే డ్రిప్‌ ఇరిగేషన్‌ సిస్టమ్‌ను మరోమారు రైతులకు అందించాలని అధికారులు నిర్ణయించారు. ఈసారి పండ్ల తోటలు, ఆయిల్‌పామ్‌, ఆగ్రో ఫారెస్ట్‌(శ్రీగంధం) చెట్లు పెట్టే రైతులకు సబ్సిడీపై డ్రిప్‌లు అందించనున్నారు. గతంలో జిల్లాకు డ్రిప్‌ యూనిట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరికీ డ్రిప్‌ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించారు.  రైతులకు ఎలాంటి భారం పడకుండా సబ్సిడీపై అందించనున్నారు. 5 హెక్టార్లు ఉన్న పెద్ద రైతులకు 80శాతం సబ్సిడీపై డ్రిప్‌ ఇవ్వనుండగా 2 హెక్టార్లకు తక్కువగా ఉన్న చిన్న రైతులకు 90శాతం సబ్సిడీపై డ్రిప్‌ ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు మాత్రం పూర్తి ఉచితంగా 100శాతం సబ్సిడీపై డ్రిప్‌ ఇవ్వనున్నారు. ఈ అవకాశం ఉమ్మడి జిల్లాలోని పండ్ల తోటలు, ఆయిల్‌పామ్‌, ఆగ్రో ఫారెస్ట్‌ (శ్రీగంధం) చెట్లు పెట్టే రైతులకు ఎంతో ఉపయోగపడనున్నాయి. 

రైతులను ప్రోత్సహించేందుకే..

రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని ప్రవేశపెట్టింది.  జిల్లాలకు అవసరమైన పంటలను ఆ జిల్లాలోనే పండేలా పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో పండ్ల తోటలతోపాటు ఆయిల్‌పామ్‌, శ్రీ గంధం సాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు. రైతులకు అధిక ఆదాయం ఇచ్చే ఈ పంటల సాగుతో రైతులకు ఎంతోమేలు జరుగనున్నది. తక్కువ ఖర్చుతో ప్రభుత్వం అందించే రాయితీలతో ఈసాగు చేయడం వలన అటు రైతులకు ఇటు ప్రజలకు అవసరమైన పంటలు పండనున్నాయి.  మామిడితోపాటు ఇతర పండ్లను ఇతరజిల్లాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంది. కొత్త రకం మామిడి వంగడాలను జిల్లాలో పరిచయం చేసి పండించాలని ఉద్యాన అధికారులు నిర్ణయించారు. ఆయిల్‌పామ్‌ తోటలను విరివిరిగా నాటించేందుకు ఇప్పటికే జిల్లాలో అధికారులు పర్యటనలు చేసి భూముల సారాన్ని పరీక్ష చేశారు. రైతులకు అవగాహన కల్పించేందుకు స్టడీ టూరులు నిర్వహించి మరీ ప్రోత్సహించారు. ఇప్పుడిప్పుడే రైతులు ఆయిల్‌పామ్‌ సాగుకు ముందుకొస్తుండడంతో వీరిని ప్రోత్సహించేందుకు డ్రిప్‌లను అందించనున్నారు. 

దరఖాస్తు ఇలా..

పండ్ల తోటలు, ఆయిల్‌పామ్‌, శ్రీగంధం సాగు చేసే రైతులు తమ ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్‌ పుస్తకం, ఫాం 1బీ, బ్యాంక్‌ ఖాతా బుక్‌, ఒక పాస్‌ఫొటోతో మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత పత్రాలను స్థానిక ఉద్యాన అధికారులకు అందించాలి. వారు జిల్లాలవారీగా పత్రాలను రాష్ట్ర అధికారులకు పంపిస్తారు. అక్కడి నుంచి డ్రిప్‌ మంజూరుచేసి రైతులకు అందించనున్నారు. 

 నియోజకవర్గం అధికారి ఫోన్‌నెంబర్‌ 

సూర్యాపేట 7997725378 
కోదాడ 7997725296 
తుంగుతుర్తి 7997725379
హుజూర్‌నగర్‌ 7997725376 
నల్లగొండ 7997725344
మిర్యాలగూడెం 7997725377
దేవరకొండ 7997725349
నాగార్జునసాగర్‌ 7997725345
నకిరేకల్‌ 7997725347
మునుగోడు 7997725346

త్వరగా దరఖాస్తు చేసుకోవాలి

పండ్లతోటలు, ఆయిల్‌పామ్‌, శ్రీగంధం సాగు చేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం డ్రిప్‌ అందించాలని నిర్ణయించింది. దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరికీ డ్రిప్‌ ఇవ్వనున్నారు. రైతులు ఎంత త్వరగా దరఖాస్తు చేసుకుంటే అంత తర్వగా వస్తాయి. ఎలాంటి సమాచారం కావాలన్న స్థానిక ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాలి. తక్కువ నీటితో ఎక్కువ పంటలకు నీరందించే డ్రిప్‌ ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇది రైతులకు ఎంతో ఉపయోగకరం.

- శ్రీధర్‌,  ఉద్యానశాఖ ఏడీ, సూర్యాపేట


logo