బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 16, 2020 , 00:52:21

వాన జోరు

వాన జోరు

  • అల్పపీడన ప్రభావంతో పలుచోట్ల భారీ వర్షాలు
  • అలుగు పోస్తున్న చెరువులు, కుంటలు 
  • గాలిలో పెరిగిన తేమ, చల్లబడిన వాతావరణం 

అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా వాతావరణం పూర్తిగా చల్లబడింది. గాలిలో తేమ శాతం పెరిగింది. బుధవారం పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో రోడ్లు జలమయం కాగా, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు, కుంటలు అలుగుపోశాయి. గతేడాది కంటే ఈసారి వర్షపాతం అధికంగా నమోదైనట్లు గణాంకాలు తెలుపుతున్నాయి.                     సూర్యాపేట అర్బన్‌, నల్లగొండ

నల్లగొండ : అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం నుంచే వరుణుడు వర్షించగా..సాయంత్రం వరకు జల్లులు కురిశాయి. ఇదిలా ఉండగా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో గాలిలో తేమ శాతం పెరిగి వణుకు పుడుతోంది.  నల్లగొండ జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం కాసేపు భారీ వర్షం పడగా సాయంత్రం వరకు వాతావరణం చల్లబడి జల్లులు పడ్డాయి. మునుగోడు, నార్కట్‌పల్లి, కట్టంగూర్‌ మండలాల్లోనూ మధ్యాహ్నమే వర్షం ప్రారంభమై సాయంత్రం వరకు చల్లటి గాలులు వీచాయి. మధ్యాహ్నం తర్వాత శాలిగౌరారంలో వర్షం కురువగా మిగిలిన మండలాల్లోనూ చిరుజల్లులు పడ్డాయి.
పెరిగిన తేమ శాతం.. 
వారం రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో గాలిలో తేమశాతం పెరిగింది.  వారంలో తొలి మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడగా నాలుగు రోజులుగా ఈ వర్షాలు జిల్లా అంతటా వ్యాపించాయి. ఈ నేపథ్యంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గటంతోపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా క్షీణిస్తున్నాయి. దీంతో గాలిలో తేమశాతం పెరుగుతోంది. తేమ శాతం కారణంగా చల్లటి గాలులు వీయడంతో పగటి పూటనే వణుకు పుడుతోంది. జిల్లాలో సగటు వర్షపాతం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా  ఆయా మండలాల్లో 150.6 మి.మీటర్లకు 191మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. 
25మండలాల్లో కురిసిన వర్షం..
మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 25మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా దామరచర్లలో 57.3మి.మీ వర్షం పడగా గుర్రంపోడ్‌లో 50.3, నాంపల్లిలో 46.6, అడవిదేవులపల్లిలో 44.8, చండూర్‌లో 30.6, నేరేడుగొమ్ములో 27, వేములపల్లిలో 25, కనగల్‌లో 21.3, మాడ్గులపల్లిలో 21.3, గుండ్లపల్లిలో 20.2, కొండమల్లేపల్లిలో 18.8, అనుములలో 17.5, మర్రిగూడ, తిరుమలగిరి(సాగర్‌)లో 16, చింతపల్లిలో 15.7, పీఏపల్లి 15.4, దేవరకొండ 15, నిడమనూరు 12, పెద్దవూర 10.9, త్రిపురారం 10.6, మునుగోడు 6.1, శాలిగౌరారం 5.5, నార్కట్‌పల్లి 5  మిర్యాలగూడ 3.8, నల్లగొండలో అత్యల్పంగా 3.2 మి.మీటర్ల వర్షం కురిసింది. సగటున 17.4 మి.మీటర్లుగా నమోదైంది. 
సూర్యాపేట జిల్లాలో.. 
సూర్యాపేట అర్బన్‌ : సూర్యాపేట జిల్లావ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు వాన కురిసింది. అత్యధికంగా మేళ్లచెర్వులో 65.9మి.మీటర్లు కురువగా అత్యల్పంగా చివ్వెంలలో 3మి.మీటర్లు నమోదైంది. తుంగతుర్తి, గరిడేపల్లి, ఆత్మకూర్‌.ఎస్‌, మోతె, కోదాడ, తిరుమలగిరి, పెన్‌పహడ్‌, చిలుకూరు, హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల, మేళ్లచెర్వులో భారీ వర్షం కురువగా మిగిలిన ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. మొత్తం వర్షపాతం 438.1మి.మీటర్లు నమోదుకాగా, సగటున 19మి.మీటర్లుగా నమోదైంది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం మేఘావృతం కావడంతోపాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
వాన కురిసె.. వాగులు పొంగె  

  మఠంపల్లి/పాలకవీడు/మాడ్గులపల్లి : వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మఠంపల్లి మండల కేంద్రంలోని కప్పలవాగు  ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రఘునాథపాలెం, గుండ్లపల్లి గ్రామాలతోపాటు మేళ్లచెర్వు, చింతలపాలెం మండలాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.  పాలకవీడు మండలంలో  ఏకధాటిగా కురిసిన వర్షాలకు జాన్‌పహాడ్‌దర్గా గ్రామపంచాయతీ పరిధిలోని కల్మటితండా వద్ద గల ఉప్పరేణి వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో పాలకవీడు- జాన్‌పహాడ్‌ రహదారిపై రాకపోకలకు ఆటంకం కలిగింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి మాడ్గులపల్లి మండలంలోని చిరుమర్తి, బొమ్మకల్‌ శివారుల్లోని పాలేరు వాగు పారింది. కల్వెలపాలెం చెక్‌డ్యాంలోకి నీరు చేరి పొంగి ప్రవహిస్తోంది.   మండలంలోనే అతిపెద్ద రిజర్వాయర్‌ అయిన యాతవాకిళ్లలోని వేములూరి రిజర్వాయర్‌ పూర్తిగా నిండి అలుగుపోస్తోంది. 
‘ముసురు’కుంది.. 
మేళ్లచెర్వు/గరిడేపల్లి : అల్పపీడన ప్రభావంతో మేళ్లచెర్వు, గరిడేపల్లి మండలాల వ్యాప్తంగా వాన ముసురుకుంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం వరకు విస్తారంగా వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు చెరువులు అలుగు పోస్తున్నాయి.   
 ఎడతెరిపి లేని వర్షం 
పాలకవీడు : మండలవ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురిసింది.   వర్షంతో జనజీవనానికి ఆటంకం కలిగింది.  భారీ వర్షంతో  చెరువులు, కుంటల్లోకి నీరు భారీగా చేరింది.  
 నేరేడుచర్ల :  మండలంలో బుధవారం తెల్లవారుజాము నుంచి నిరంతరంగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, ఖాళీ స్థలాల్లోకి భారీగా వరద చేరింది. సీజన్‌ ప్రారంభంలోనే సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
తిరుమలగిరిలో భారీ వర్షం 
తిరుమలగిరి : తిరుమలగిరి, తుంగతుర్తి మండలాల్లో బుధవారం వర్షం కురిసింది. వర్షానికి పీహెచ్‌సీ గోడ కూలింది. తెలంగాణ చౌరస్తాలో నీరు భారీగా నిలిచింది. 15వ వార్డులో మేడబోయిన యాదగిరి ఇంట్లో నీరు నిలిచి బియ్యం బస్తాలు తడిశాయి.   
రైతుల్లో ఆనందం.. 
మునుగోడు : మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కొద్ది రోజులుగా సరైన వర్షాలు లేకపోవడంతో పత్తి గింజలు విత్తిన రైతులు ఒకింత ఆందోళన చెందారు. ఈ తరుణంలో వరుణుడు కరుణించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  
శాలిగౌరారంలో మోస్తరు వాన.. 
శాలిగౌరారం :  వర్షాలకు మండలంలోని చెరువులు, కుంటల్లో నీరు చేరింది. ఆయకట్టేతర రైతులు బోర్లల్లో నీరు సమృద్ధిగా లభిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  
కనగల్‌ : రెండ్రోజులుగా మండల వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు నిండి జలకళను సంతరించుకున్నాయి.  ముందుగా విత్తిన పత్తిచేలు ఏపుగా పెరిగాయి. 
  నిడమనూరులో.. 
తిరుమలగిరి (సాగర్‌)/నిడమనూరు : తిరుమలగిరి మండలంలోని పలు గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది. దీంతో పత్తి చేలకు ఊరట లభించిందని రైతులు పేర్కొన్నారు.  నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నిడమనూరు, త్రిపురారం, అనుముల మండలాల్లోని చెరువుల్లోకి వాన నీరు చేరడంతో జలకళను సంతరించుకున్నాయి.  
దేవరకొండలో భారీ వర్షం
 చందంపేట(దేవరకొండ) : దేవరకొండ నియోజకవర్గంలోని మల్లేపల్లి, చందంపేట, నేరేడుగొమ్ము, గుండ్లపల్లి, చింతపల్లి, పెద్దఅడిశర్లపల్లి మండలాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది. పొలాల్లో వర్షపు నీరు చే రడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  
నిండిన చెరువులు.. 
 దామరచర్ల : మండలంలో మంగళవారం రాత్రి ప్రారంభమైన వాన బుధవారం మధ్యాహ్నం వరకు కొనసాగింది. నాగుల్‌చెరువు, బైరవాన్‌ చెరువు, బొత్తలపాలెం ఊరచెరువు, కొండ్రపోల్‌లోని కొత్తచెరువు పూర్తిగా నిండాయి.  


logo