శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 13, 2020 , 03:35:02

అనకాపల్లి నుంచి అక్రమ రవాణా

అనకాపల్లి నుంచి అక్రమ రవాణా

  • నకిరేకల్‌లో గంజాయి వాహనం పట్టివేత 
  • 80 కిలోలు స్వాధీనం
  • స్కార్పియో సీజ్‌, ఇద్దరు అరెస్టు 
నకిరేకల్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి ముంబయికి గంజాయి రవాణా చేస్తుండగా  పోలీసులు   పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత పది రోజుల్లో 65వ జాతీయ రహదారిపై గంజాయి అక్రమ రవాణా 2సార్లు బయటపడింది. దీంతో జిల్లా ఎస్పీ రంగనాథ్‌ ఆదేశాల మేరకు జాతీయ రహదారిపై పోలీసులు నిత్యం వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అదివారం ఉదయం నకిరేకల్‌ పట్టణ శివారు పరిధిలో సీఐ బాలగోపాల్‌ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న స్కార్పియో (ఎంహెచ్‌ 14 సీఎఫ్‌0171)ను ఆపగా.. డ్రైవర్‌ ఆపకుండా వెళ్లాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వాహనాన్ని వెంబడించారు. పోలీసుల రాకను గమనించిన దుండగులు మండలంలోని చందంపల్లి స్టేజీ వద్ద వాహనాన్ని ఆపి అందులో ఉన్న ఇద్దరు పారిపోయారు. మరో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. వాహనంలో తనిఖీ చేయగా.. 40 గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఒక్కొక్కటి 2 కిలోల చొప్పున మొత్తం 80కిలోలను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.8లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. 
అనకాపల్లి నుంచి అక్రమంగా తెచ్చి మంబయిలో అమ్ముతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు.  కేసులో మహారాష్ట్రకు చెందిన బాపుసాహెబ్‌ భాస్కర్‌ డాంగే, అంకిత్‌ అర్జున్‌ చౌదరిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. అక్రమ రవాణా గుట్టు రట్టు చేసిన సీఐ బాలగోపాల్‌, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో తాసిల్దార్‌ జంగయ్య, సీఐ బాలగోపాల్‌, ఎస్‌ఐ శ్రీనివాస్‌యాదవ్‌, రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఉన్నారు.


logo