ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 10, 2020 , 04:43:14

లాభసాటి వ్యవసాయమే ప్రభుత్వ లక్ష్యం

లాభసాటి వ్యవసాయమే  ప్రభుత్వ లక్ష్యం

  •  రైతుల సంఘటితం కోసం రైతు వేదికల నిర్మాణం
  • నియంత్రిత సాగుతోనే ఆశించిన దిగుబడి 
  •  విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి 
  • పలుచోట్ల రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపన 

నియంత్రిత సాగును ప్రోత్సహించి రైతును ఆర్థికంగా పరిపుష్టి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అందుకోసం రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం తిరుమలగిరి, నాగారం, కట్టంగూరు మండలాల్లో రైతు వేదికల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు అందజేసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యం ఇచ్చారని, వ్యవసాయం లాభసాటిగా మారేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. 

తిరుమలగిరి/నాగారం/కట్టంగూర్‌ : తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలు రైతులను సంఘటితం చేసేందుకేనని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం తిరుమలగిరి మండలంలోని తొండ, నాగారం మండలంలోని వర్ధమానుకోట, కట్టంగూర్‌ మండలంలోని పామనుగుండ్లలో  రైతువేదికల నిర్మాణ పనులకు  ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్‌, చిరుమర్తి లింగయ్యలతో కలిసి శంకుస్థాపనలు చేశారు.  నాగారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 70మందికి ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు పంపిణీ చేసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. నాగారం గ్రామస్తులు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల, ఎమ్మెల్యే కిశోర్‌లను గజమాలతో సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్యేయమన్నారు. రైతులందరినీ సంఘటితం చేసి సాగు విధానంలో మెళకువలు, లాభసాటి వ్యవసాయం చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు.  పంట ధర నిర్ణయంలో రైతులు భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఒకే చోట కూర్చొని మాట్లాడుకునేందుకు రైతు వేదికలను నిర్మిస్తున్నట్లు చెప్పారు.  రైతులు నియంత్రిత సాగుపై దృష్టి సారించాలని కోరారు.  నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకే ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలను మంజూరు చేసిందని తెలిపారు.  ప్రతి ఒక్కరికీ ఉచితంగా కార్పొరేట్‌స్థాయి విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో 900పైగా గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలను మన సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టాడన్నారు.  

రైతుల ఐక్యత కోసమే :  ఎంపీ బడుగుల  

ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌ మాట్లాడుతూ.. రైతుల ఐక్యత కోసమే తెలంగాణ ప్రభుత్వం రైతువేదికలను నిర్మిస్త్తోందన్నారు. అన్నికులాల వారిని తన కుటుంబంలా భావించిన మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని పేర్కొన్నారు.  ఈనెల 16న గోదావరి జలాల ద్వారా నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలను నింపుతామన్నారు.  

ప్రతి ఎకరాకూ నీరు : ఎమ్మెల్యే కిశోర్‌  

ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ మాట్లాడుతూ.. తుంగతుర్తి నియోజకవర్గం గోదావరి జలాలతో సస్యశ్యామలం అవుతోందన్నారు. గత ఏడాది రైతులు సాగు చేసిన ప్రతి ఎకరాకూ   నీరందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. 

రైతాంగానికి పెద్దపీట : ఎమ్మెల్యే చిరుమర్తి 

ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, రైతులకు ఉపయోగపడేలా రైతు వేదికలను నిర్మిస్తుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌, రాష్ట్ర ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లాల కోఆర్డినేటర్లు ఎస్‌ఏ రజాక్‌, రామచంద్రనాయక్‌, డీఏఓలు జోతిర్మయి, శ్రీధర్‌రెడ్డి, ఆర్డీఓ మోహన్‌రావు, ఎంపీపీలు స్నేహలత, కూరం మణి, ముత్తిలింగయ్య,  వైస్‌ ఎంపీపీలు గుంటకండ్ల మణిమాల, సుజాత, కోటిరెడ్డి, జడ్పీటీసీలు అంజలి, ఇందిర, బలరాములు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు రఘునందన్‌రెడ్డి, కల్లెట్లపల్లి ఉప్పలయ్య, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ పి.నర్సింహారెడ్డి,  ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శిరీష, జిల్లా సభ్యుడు, పొదిల రమేశ్‌, ఏడీఏ జగ్గూనాయక్‌, ఎంపీడీఓలు, తాసిల్దార్లు, ఏఓలు, సర్పంచులు పాల్గొన్నారు.  logo