శనివారం 08 ఆగస్టు 2020
Suryapet - Jul 10, 2020 , 04:32:02

సకాలంలో రైతులకు రుణాలందించాలి

సకాలంలో రైతులకు రుణాలందించాలి

  • సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్‌ సంజీవరెడ్డి
  • జిల్లాస్థాయి బ్యాంకర్లతో సమావేశం  

సూర్యాపేట: జిల్లాలోని బ్యాంకులు  రైతులకు సకాలంలో రుణాలు అందజేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ డి.సంజీవరెడ్డి సూచించారు. గురువారం జిల్లాస్థాయి బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి బ్యాంకు తమ శాఖ పరిధిలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. రుణాల పంపిణీలో కొన్ని బ్యాంకులు అలసత్వం ప్రదర్శిస్తున్నాయన్నా రు. అనంతరం బ్యాంకుల వారీగా వ్యవసాయ పంట రుణాల లక్ష్యాలు.. సాధించిన పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కొన్ని బ్యాంకులు మినహా ఆశించిన స్థాయిలో రుణాలు మంజూరు  చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 

అలాగే కేంద్ర ప్రభుత్వం చిన్న, మధ్యతరగతి వ్యాపారుల కోసం ప్రత్యేక రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు.  కానీ బ్యాంకులు మాత్రం   రుణాల మంజూరులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రతి బ్యాంకు తప్పకుండాముద్ర రుణాలివ్వాలని ఆదేశించారు. అవసరం ఉన్న వారు బ్యాంకు లో సంప్రదిస్తే తిరస్కరించినట్లు తెలిస్తే సంబంధిత బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి రైతు పంట బీమా చేయించుకునేలా చూడాలన్నారు. ఆత్మ నిర్భర్‌ అభియాన్‌  పథకం కింద జిల్లాలోని పాడి రైతులకు రుణాలు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ జగదీశ్‌చంద్రబోస్‌, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.  


logo