సోమవారం 03 ఆగస్టు 2020
Suryapet - Jul 09, 2020 , 03:54:18

హరితవనంలా కనిపించాలి

హరితవనంలా కనిపించాలి

  • జాతీయ రహదారి వెంట పెద్దఎత్తున మొక్కలు నాటాలి 
  • వాటిని సంరక్షించే బాధ్యత స్థానికులు, అధికారులదే..
  • సీఎం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్‌, సీఎం స్పెషల్‌ సెక్రటరీ భూపాల్‌రెడ్డి
  • 65 వ జాతీయ రహదారి వెంట మొక్కల పరిశీలన 
  • మొక్కల పెంపకంపై అధికారులకు అభినందనలు 

65వ జాతీయ రహదారి వెంట ఖాళీ స్థలం కనిపించకుండా మొక్కలు నాటాలని, వాటిని స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు సంరక్షించాలని సీఎం ఓఎస్‌డీ, హరితహారం ఇన్‌చార్జి ప్రియాంక వర్గీస్‌ అన్నారు. బుధవారం ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డితో కలిసి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని చిట్యాల, సూర్యాపేట, చివ్వెంల, కోదాడ మండలాల్లో 65వ జాతీయ రహదారి వెంట హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. మొక్కల సంరక్షణ బాగుందని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పలువురు అధికారులను వారు అభినందించారు. అటవీ శాఖ, జీఎంఆర్‌, ఉపాధిహామీ అధికారులు జాతీయ రహదారి వెంట పెద్ద సంఖ్యలో మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అన్నారు. 

చిట్యాల/సూర్యాపేట రూరల్‌/చివ్వెంల/కోదాడ : 65వ జాతీయ రహదారి వెంట ఆరో విడుత హరితహారంలో భాగంగా మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతను రహదారి వెంట ఉన్న గ్రామాల ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు చేపట్టాలని సీఎం ఓఎస్డీ, హరితహారం ప్రత్యేకాధికారి ప్రియాంక వర్గీస్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు బుధవారం చిట్యాల మండలం గుండ్రాంపల్లి, వెల్మినేడు, సూర్యాపేట మండలం టేకుమట్ల, చివ్వెంల మండలం వల్లభాపురం, కోదాడ మున్సిపల్‌ పరిధిలో జాతీయ రహదారికి ఇరువైపులా ఆరో విడుత హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సీఎంఓ కార్యదర్శి భూపాల్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.

ముందుగా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో రెండో విడుత హరితహారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ నాటిన మొక్కను నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌తో కలిసి పరిశీలించారు.  అనంతరం వెల్మినేడు శివారులో మొక్కలు నాటి నీళ్లు పోశారు.  ఈ సందర్భంగా ఆమె డీపీఓ విష్ణువర్ధన్‌ను జాతీయ రహదారి వెంట, గ్రామీణ ప్రాంతాల్లో పెంచుతున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారి వెంట మొక్కల నిర్వహణ తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక అధికారులను అభినందించారు. ఆ తర్వాత సూర్యాపేట మండలం టేకుమట్ల, చివ్వెంల మండలం వల్లభాపురంలో జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలను పరిశీలించి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై అటవీ శాఖ, జీఎంఆర్‌, ఉపాధి హామీ అధికారులు కలిసి ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ మొక్కలు నాటాలని, మొక్క చనిపోతే దాని స్థానంలో మరో మొక్కను నాటి రహదారి మొత్తం ఎక్కడ చూసినా హరితవనంలా కనిపించాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.  అనంతరం కోదాడ మున్సిపల్‌ పరిధిలో ఇటీవల నాటిన 8అడుగుల మొక్కలను   పరిశీలించారు.  శ్రీరంగపురం సమీపంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనపర్తి శీరీషాలక్ష్మీనారాయణ,  కమిషనర్‌ మల్లారెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి బుధవారం నాటిన 2000మొక్కలను  పరిశీలించి వాటిలో ప్రతి మొక్కనూ సంరక్షించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌కు సూచించారు. వారి పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో  సూర్యాపేట అదనపు కలెక్టర్‌ సంజీవరెడ్డి, పీడీ కిరణ్‌కుమార్‌, డీఎల్‌పీఓ లక్ష్మీనారాయణ, డీఈ లక్ష్మానాయక్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, కమిషనర్‌ రామానుజులరెడ్డి, మేనేజర్‌ అంకషావలీ, జడ్పీటీసీ జీడి భిక్షం, ఎంపీడీఓలు శ్రీనివాస్‌రావు, జమలారెడ్డి, ఎంపీఓలు పద్మ,  గోపి, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.  logo