గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - Jul 08, 2020 , 00:33:25

పంజా విప్పిన కరోనా

పంజా విప్పిన కరోనా

  • మంగళవారం ఒక్కరోజే 26 కేసులు నమోదు 
  • కొందరి అలసత్వం.. అందరికీ శాపం
  • సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో సెంచరీ దాటిన కేసులు 
  • మాస్కులు ధరించరు.. నిబంధనలు పట్టించుకోరు.. 

నీలగిరి : కరోనా వైరస్‌ నగరాలు, పట్టణాల నుంచి పల్లెలకు విస్తరించింది. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటే ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ సోకే ప్రమాదాన్ని 90శాతం అరికట్టవచ్చని ఆరోగ్య నిపుణులు మొత్తుకుంటున్నా అత్యధికుల్లో మాకేమికాదులే అన్న నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఈ నిర్లక్ష్యమే కొంపముంచుతోంది. బయటకు వచ్చే ప్రజలు కనీసం మాస్కులు కూడా ధరించకపోవడంతో  రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. దుకాణాలు, మార్కెట్లలో సైతం ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంతో కరోనా మరింత వేగంగా వ్యాపిస్తోంది. 

లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించే నాటికి జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు లేవు. జిల్లా అంతా ప్రశాంతంగానే ఉందనే అధికార యంత్రాంగం భావించిన తరుణంలో వలసకూలీల రూపంలో అది భ్రమగా మారిపోయింది. కేసులు వస్తుండడంతో జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోవడం మానేశారు. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 

నిబంధనలకు దూరం...

నిబంధనలు సడలించినప్పటి నుంచే జిల్లాలో కరోనా కేసులు పెరిగాయి. ఏప్రిల్‌, మేతో పోలిస్తే ఇప్పడు నమోదవుతున్న కేసులే మూడింతలు ఉన్నాయి. మార్చి-మే వరకు కేవలం 23కేసులు నమోదయితే జూన్‌లో 66, జూలైలో ఇప్పటివరకు 42కేసులు నమోదయ్యాయి. జిల్లాకేంద్రంతోపాటు మిర్యాలగూడ పట్టణంలో రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నా ప్రజలు మాత్రం నిబంధనలు పాటించడం లేదు. అన్ని రకాల కార్యకలాపాలు నడుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నిర్దిష్ట సమయాల ప్రకారం కిరాణం దుకాణాలు, వాణిజ్య కార్యకలాపాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు భౌతికదూరం పాటించడం మరిచి గుంపులుగా సంచరిస్తున్నారు. మాస్కులు ధరించకుండా గడప దాటుతున్నారు.  స్వీయరక్షణ చర్యలు తీసుకోవాలన్న స్పృహ కోల్పోతున్నారు. బైక్‌లపై వెళ్తున్న వారిలో కూడా ఇద్దరిలో ఒకరికి మాత్రమే మాస్కు ఉంటుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ఇబ్బంది తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

జిల్లాలో పరిస్థితి..

తాజాగా మంగళవారం మరో 19 కేసులు రావడంతో నల్లగొండ జిల్లావ్యాప్తంగా కరోనా కేసులు ఇప్పటివరకు 135కి చేరాయి. మరో కేసుకు ఐడీ ఇవ్వకపోవడంతో సంఖ్యను నమోదు చేయలేదు. ఇందులో 30కేసులు రికవరీ కాగా నలుగురు మృతిచెందగా 102మంది చికిత్స పొందుతున్నారు. ఇందులో 10మంది జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఉండగా 25మంది హైదరాబాద్‌లో, 62మంది ఇంటివద్ద ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. వీరిలో మర్కజ్‌యాత్రకు వెళ్లినవారు ఏడుగురు కాగా వారినుంచి మరో ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. ఇతర కారణాల మరో 81మందికి రాగా వారినుంచి ప్రైమరీ కాంట్రాక్టులో ఉన్న 28మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇతర ప్రాంతాల నుంచి చాలామంది వలసకూలీలు జిల్లాకు రాగా వారినుంచి జిల్లాలో ఒకరిని పాజిటివ్‌ వచ్చి వలసకూలీల సంఖ్య 10కి చేరింది.

జాగ్రత్తలు తీసుకోవాలి

జిల్లాలో కరోనా వైరస్‌ రోజురోజుకూ విజృంభిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు బయటకు రావొద్దు. తప్పనిసరి అయితే మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ శానిటైజర్‌ వాడుతూ ఉండాలి. వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రావొద్దు. 

- డాక్టర్‌ కొండల్‌రావు, డీఎంహెచ్‌ఓ, నల్గొండ


logo