సోమవారం 28 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 07, 2020 , 05:50:09

1.20లక్షల మొక్కల పెంపకమే లక్ష్యం

1.20లక్షల మొక్కల పెంపకమే లక్ష్యం

  • కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ 

దామరచర్ల : హరితహారంలో భాగంగా జిల్లా పరిధిలోని నేషనల్‌, స్టేట్‌ హైవేల వెంట 1.20లక్షల మొక్కలు నాటేలా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అన్నారు. మండలంలోని నార్కట్‌పల్లి-అద్దంకి ప్రధాన రహదారి పరిధిలోని కొండ్రపోల్‌, రాళ్లవాగుతండా, బొత్తలపాలెం, దామరచర్ల, వాడపల్లి గ్రామాల పరిధిలో రహదారి వెంట నాటిన మొక్కలను స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి సోమవారం పరిశీలించారు. ఆయా గ్రామాల పరిధిలో మొక్కలు నాటారు. గ్రామాల్లో హరితహారం మొక్కల ప్రగతి గురించి సర్పంచులను, కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన కంపోస్ట్‌ షెడ్డులు, వైకుంఠధామాల నిర్మాణాలు, డంపింగ్‌ యార్డులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల గురించి  అధికార్లను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కింద చేపట్టిన నిర్మాణాలను సత్వరమే పూర్తి చేయాలనీ ఆదేశించారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హరితహారంలో భాగంగా జిల్లాలోని నేషనల్‌ హైవే నార్కట్‌పల్లి నుంచి నకిరేకల్‌, స్టేట్‌హైవే నార్కట్‌పల్లి నుంచి నల్లగొండ, నల్లగొండ నుంచి మిర్యాలగూడ, వాడపల్లి వరకు, మిర్యాలగూడ నుంచి దేవరకొండ, దేవరకొండ నుంచి కొండమల్లేపల్లి, కొండమల్లేపల్లి నుంచి చింతపల్లి, నాగార్జునసాగర్‌, దేవరకొండ నుంచి హాలియా వరకు కిలో మీటర్‌కు 400 మొక్కల చొప్పున 300 కిలో మీటర్ల పరిధిలో ఐదు రహదార్లకు ఇరువైపులా 1.20లక్షల మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత ఆయా గ్రామపంచాయతీలదేనన్నారు. సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వీటిని పర్యవేక్షించాలన్నారు. దామరచర్ల, వేములపల్లి, మాడ్గులపల్లి, మిర్యాలగూడ మండలాల్లో హరితహారం కింద ప్లాంటేషన్‌ బాగుందన్నారు. కార్యక్రమంలో పీడీ డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ డి.నారాయణరెడ్డి, ఎంపీపీ రమావత్‌ నందిని, జడ్పీటీసీ ఆంగోతు లలిత, రైతబంధు సమితి మండల కో ఆర్డినేటర్‌ కె.వీరకోటిరెడ్డి, వైస్‌ ఎంపీపీ కె.సైదిరెడ్డి, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, తాసిల్దార్‌ రాజు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. logo