శనివారం 19 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 07, 2020 , 05:48:39

రెండు పంటలకు సమృద్ధిగా నీరందిస్తాం

రెండు పంటలకు సమృద్ధిగా నీరందిస్తాం

  • మూడ్రోజుల్లో మూసీ ప్రాజెక్టుకు కొత్త గేట్ల ఏర్పాటు
  • పనులను ప్రారంభించిన మంత్రి జగదీశ్‌రెడ్డి  

సూర్యాపేటరూరల్‌/కేతేపల్లి : దశాబ్దాలుగా మూసీ ప్రాజెక్టును పట్టించుకోకుండా గత పాలకులు నిర్లక్ష్యం చేసినందునే లీకేజీలతో నీళ్లన్నీ కృష్ణా నదిలో వృథాగా పోయాయని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలోనే మూసీ ప్రాజెక్టుకు మరమ్మతులు జరిగి చుక్క నీరు వృథా కాకుండా రెండు పంటలకు నీరందించామని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం మూసీ ప్రాజెక్టును సందర్శించి కొత్త గేట్ల నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. 2014లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తిచేసి కొత్త ప్రాజెక్టులు నిర్మించి ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తున్నారన్నారు. రూ.18.70కోట్లతో మూసీ ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేసినట్లు తెలిపారు. దురదృష్టవశాత్తు గత అక్టోబర్‌లో వరద తాకిడి ఎక్కువై ప్రాజెక్టు 5వ నంబర్‌ రెగ్యులేటరీ గేటు ఊడిపోయిందన్నారు.

గేటు ఊడిపోయి ప్రాజెక్టులోని నీరంతా వృథా అవుతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారని, రైతులకు ఎట్టిపరిస్థితిలోనూ యాసంగిలో నీటిని అందించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నాలుగు రోజుల్లోనే తాత్కాలిక  స్టాప్‌లాగ్‌ గేటును అమర్చినట్లు గుర్తు చేశారు. తాజాగా జరుగుతున్న మూసీ గేటు మరమ్మతు పనులతో రెండు పంటలకు సమృద్ధిగా నీరు అందించి రైతాంగాన్ని ఆదుకుంటామన్నారు. రానున్న రోజుల్లో మూసీప్రాజెక్టును పూర్తిస్థాయిలో ఆధునీకరణ చేస్తామని తెలిపారు. ప్రసుత్తం జరుగుతున్న గేటు నిర్మాణ పనులు మూడు రోజుల్లో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఎంపీపీ రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, ప్రాజెక్టు ఈఈ భద్రూనాయక్‌, డీఈ నవీకాంత్‌, ఏఈ శ్రీకాంత్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు ఉన్నారు. 


logo