ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 06, 2020 , 03:19:30

సాగునీటి కాల్వల్లో పూడిక, చెట్లు తొలగింపు

సాగునీటి కాల్వల్లో పూడిక, చెట్లు తొలగింపు

  • ‘ఉపాధి’ కూలీలతో  ముమ్మరంగా పనులు
  •  శుభ్రంగా మారుతున్న   నాగార్జునసాగర్‌, శ్రీరాంసాగర్‌, ఏఎమార్పీ, మూసీ కాల్వలు
  • నీటి విడుదల లోపు పూర్తిచేసేలా చర్యలు

వర్షాకాలం వచ్చేసింది.. పంటల సాగు మొదలైంది.. ఇక ఆయా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కొనసాగే సమయం  ఆసన్నమైంది. దీంతో సాగునీటి కాల్వల్లో నీరు ఆయకట్టు చివరి వరకు సాఫీగా సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.  ఇందులో భాగంగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని నాగార్జున సాగర్‌, మూసీ, ఏఎమ్మార్పీ, ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీత, చెట్ల తొలగింపు, గండ్లు పూడ్చివేత పనులు చేపట్టింది. గతానికి భిన్నంగా ఈసారి ముందస్తు ప్రణాళికలతో ఉపాధి హామీ పథకం ద్వారా ఈ పనులు నిర్వహిస్తోంది. కాల్వల పరిధిలోని ఆయా గ్రామాల ఉపాధి కూలీలతోనే పనులు చేపడుతుండడంతో వారికి ఉపాధి కూడా లభిస్తోంది. 12 రోజులుగా ఈ పనులు ముమ్మరంగా సాగుతుండగా కిలోమీటర్ల మేర కాల్వలు పరిశుభ్రంగా మారి ఎలాంటి అవాంతరాలు లేకుండా నీరు పారనుంది.                                                                       - 

సూర్యాపేట, నమస్తే తెలంగాణ : తెలంగాణ ఏర్పాటు అనంతరం ఆరున్నరేళ్లుగా రైతులకు ఏది అవసరమో, ఏది మంచిది, ఎలా చేస్తే వారికి లాభం జరుగుతుందనే విషయాలను ఏ ఒక్క రైతు కూడా సొంతంగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే అన్ని చర్యలు చేపడుతోంది. 24గంటల నిరంతర ఉచిత విద్యుత్‌ మొదలుకుని సకాలంలో విత్తనాలు, ఎరువుల పంపిణీతోపాటు రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం, రైతుబీమా అందిస్తోంది. రైతులను లాభాలబాటలోకి తీసుకెళ్లేందుకు అంతా ఒకే రకమైన పంటలు కాకుండా డిమాండ్‌ ఉండే పంటలు సాగు చేయాలంటూ ఈ సీజన్‌ నుంచి నియంత్రిత సాగును ప్రోత్సహిస్తున్నది. వ్యవసాయానికి అత్యంత ప్రధానమైనది నీళ్లు కాబట్టి స్వల్ప వ్యవధిలోనే భారీ నీటి ప్రాజెక్టులు పూర్తిచేసి దేశానికే తలమానికంగా నిలుస్తున్న విషయం విదితమే. మరోపక్క చివరి ఎకరా వరకు నీరు అందేలా కాల్వల ఆధునీకరణ చేపడుతున్నారు. తాజాగా జిల్లాలోని కాల్వల్లో పేరుకుపోయిన పూడిక, పిచ్చి మొక్కలు తొలగించే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఏ గ్రామ పరిధిలో కాల్వలు ఉంటే ఆయా గ్రామాల ఉపాధిహామీ కూలీలతోనే పనులు చేయిస్తున్నారు.

జిల్లాలోని కాల్వలకు మహర్దశ..

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీరు పుష్కలంగా వస్తుండగా ఆయా కాల్వల మరమ్మతులపై దృష్టి సారించారు. నాగార్జునసాగర్‌, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాలకు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు.. దేవరకొండ, నల్లగొండ నియోజకవర్గాలకు ఏఎమ్మార్పీ.. తుంగతుర్తి, సూర్యాపేటలోని కొన్ని ప్రాంతాలకు శ్రీరాంసాగర్‌ నుంచి గోదావరి జలాలు అందుతుండగా మూసీ నది ద్వారా నకిరేకల్‌, సూర్యాపేట నియోజకవర్గాల్లోని పలు మండలాలకు సాగునీరు అందుతోంది. గత ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో సాగునీరు రాకపోగా నాడు తవ్విన కాల్వలు పూడిపోతున్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని ఉపాధి హామీ పథకం ద్వారా కాల్వల్లో పేరుకుపోయిన పూడిక తీయడంతోపాటు పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో పన్నెండు రోజులుగా జిల్లాలోని సాగునీటి కాల్వలు శుభ్రంగా మారుతున్నాయి. ప్రస్తుతం 14 మండలాల పరిధిలోని 25 గ్రామ పంచాయతీల్లో ఆయా సాగునీటి కాల్వల్లో పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఐబీ ద్వారా 23 ప్రాంతాల్లో కాల్వల్లో పూడిక తీయడం, పిచ్చి చెట్లు తొలగించడం తదితరాలకు ప్రతిపాదనలు పూర్తి చేయగా నాగార్జునసాగర్‌ కాల్వల్లో 22 ప్రాంతాలు, శ్రీరాంసాగర్‌ కాల్వల్లో 17, మూసీ పరీవాహకంలో 4 ప్రాంతాల్లో మొత్తం 66 చోట్ల పనులు గుర్తించగా దాదాపు 35 ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి. ప్రతినిత్యం 710 మంది కూలీలు పనిచేస్తున్నారు. మరోవారం నుంచి పది రోజుల్లోనే పనులన్నీ పూర్తి కానుండగా ఈ వానకాలం పంటల కోసం నీటిని విడుదల చేస్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా చివరి ఆయకట్టు వరకు నీరు చేరనుంది.

కాల్వలు బాగు చేయడమే లక్ష్యం 

జిల్లాలోని సాగునీటి కాల్వల్లో పేరుకుపోయిన పూడిక, చెట్లు తొలగించడమే లక్ష్యంగా ప్రతి నిత్యం పనులు చేపడుతున్నాం. నాగార్జునసాగర్‌, మూసీ, శ్రీరాంసాగర్‌ మూడు నదుల కింద ఉన్న కాల్వలకు ఆయా శాఖల ఆధ్వర్యంలో ఎక్కడెక్కడ పనులు చేయాలనే దానిపై ప్రతిపాదనలు తయారు చేస్తుండగా ఆయా మండలాల్లో ఉపాధి కూలీలు పనులు చేస్తున్నారు. మరో పది రోజుల్లో పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

- సుందరి కిరణ్‌కుమార్‌, డీఆర్‌డీఓlogo