శనివారం 19 సెప్టెంబర్ 2020
Suryapet - Jul 06, 2020 , 02:57:29

అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు

అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు

  • హత్యకు కారుకులైన వారికి శిక్ష పడేలా చర్యలు
  • విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి 
  • లాలూనాయక్‌ భౌతికకాయం వద్ద నివాళులు
  • మండలి చైర్మన్‌ గుత్తాతో కలిసి కుటుంబానికి  పరామర్శ

కాంగ్రెస్‌ కార్యకర్తల చేతిలో దారుణహత్యకు గురైన చందంపేట జడ్పీటీసీ సభ్యురాలు రమావత్‌ పవిత్ర తండ్రి, రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ లాలూనాయక్‌ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండి ఆదుకుంటామని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని బిల్డింగ్‌ తండాలో లాలూనాయక్‌ భౌతికకాయానికి మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జడ్పీచైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. హత్యకు కారకులైన వారికి శిక్ష పడేలా చర్య తీసుకుంటామని, ధైర్యంగా ఉండాలని వారి కుటుంబానికి భరోసానిచ్చారు.                                                                              - చందంపేట



 చందంపేట : టీఆర్‌ఎస్‌ నేత, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ రమావత్‌ లాలూనాయక్‌ హత్యను మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆదివారం మండలంలోని బిల్డింగ్‌తండాలో లాలూనాయక్‌ మృతదేహాన్ని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌తో కలిసి మంత్రి సందర్శించారు. మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లాలూనాయక్‌ కూతురు, జడ్పీటీసీ పవిత్రను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  అధైర్యపడొద్దని, కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, అన్నివిధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పరామర్శించిన వారిలో దేవరకొండ మున్సిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ, టీఆర్‌ఎస్‌ జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పాశం రాంరెడ్డి, ఎంపీపీలు జాన్‌యాదవ్‌, పద్మాహన్మానాయక్‌, ఆర్డీఓ లింగ్యానాయక్‌, డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, తాసిల్దార్‌ వెంకటేశ్వర్లు, జడ్పీటీసీలు బాలూనాయక్‌, సురేశ్‌గౌడ్‌, బిక్కూనాయక్‌, లక్ష్మానాయక్‌, ముత్యాల సర్వయ్య, మల్లారెడ్డి, తిరుపతయ్య, అనంతగిరి, నారాయణరెడ్డి, శంకర్‌రావు, మున్నయ్యయాదవ్‌, బుజ్జినాయక్‌, రావుల శ్రీనివాస్‌ యాదవ్‌, కంకణాల వెంకట్‌రెడ్డి, పల్లా ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.   

 ఎస్‌ఐ నిర్లక్ష్యంతోనే హత్య

చందంపేట ఎస్‌ఐ సందీప్‌కుమార్‌ నిర్లక్ష్యంతోనే తన తండ్రి హత్యకు గురయ్యాడని చందంపేట జడ్పీటీసీ రమావత్‌ పవిత్ర  మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎదుట రోదిస్తూ విన్నవించారు. ఘటనాస్థలంలో పోలీసులు ఉన్నా తన తండ్రిని కాపాడలేకపోయారని విలపించారు. పాత కక్షలతోనే కాంగ్రెస్‌ కార్యకర్తలు తమ నాన్నను హత్య చేశారని ఆరోపించారు.  

బంధువుల రాస్తారోకో

చందంపేట(దేవరకొండ) : లాలూనాయక్‌ హత్యకు చందంపేట ఎస్‌ఐ సందీప్‌కుమార్‌ నిర్లక్ష్యమే కారణమని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం దేవరకొండ పట్టణంలోని డిండి రోడ్డు చౌరస్తాలో లాలూనాయక్‌ మృతదేహంతో బంధువులు రాస్తారోకో నిర్వహించారు.  ఎస్‌ఐపై చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌  చెప్పడంతో రాస్తారోకో విరమించారు.   

ముగిసిన అంతిమ యాత్ర

 లాలూనాయక్‌ మృతదేహానికి ఆదివారం ఆయన స్వగ్రామం బిల్డింగ్‌తండాలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రకు మండల ప్రజలతోపాటు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, బంధువులు వేలాదిగా తరలివచ్చారు. అంతిమయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీఐలు ఆదిరెడ్డి, వెంకటేశ్వర్లు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. 

 అన్నీ ముందుండి నడిపిన ఎమ్మెల్యే   

దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ లాలూనాయక్‌ కుటుంబానికి అండగా ఉండి  అన్ని కార్యక్రమాలు ముం దుండి నడిపించారు. పోస్టుమార్టం నుంచి అంత్యక్రియలు జరిగే వరకు ఎమ్మెల్యే  దగ్గరుండి చూసుకున్నారు. 

 త్వరలోనే  అదుపులోకి తీసుకుంటాం

లాలూనాయక్‌ను హత్య చేసిన నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని దేవరకొండ రూరల్‌ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. లాలూనాయక్‌ను కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పది మంది కార్యకర్తలు హతమార్చినట్లు వారి బంధువులు ఫిర్యాదు చేశారని తెలిపారు.  


logo