శనివారం 19 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 27, 2020 , 02:02:07

దివ్యాంగుల హక్కుల చట్టంపై అవగాహన కల్పించాలి

దివ్యాంగుల హక్కుల చట్టంపై  అవగాహన కల్పించాలి

  • దివ్యాంగుల డేటాను సేకరించండి
  • 40శాతం వైకల్యం ఉన్నవారికి ఉపాధి కల్పించాలి
  • డబుల్‌ బెడ్‌రూం పథకంలో  ఐదుశాతం రిజర్వేషన్‌ అమలు
  • కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

సూర్యాపేట : దివ్యాంగుల హక్కుల చట్టం 2016పై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి జిల్లా దివ్యాంగుల సంక్షేమ అధికారిని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ర్యాంపులు, వీల్‌చైర్‌లు ఉండేలా చూడాలన్నారు.

దివ్యాంగుల డేటాతో వివిధ అధికారులతో చర్చించి దివ్యాంగుల సమస్యలపై చర్యలు తీసుకోవాలన్నారు. డబుల్‌ బెడ్‌రూం పథకంలో ఐదుశాతం రిజర్వేషన్‌ అమలు చేయనున్నట్లు తెలిపారు. 40శాతంకు పైబడి వైకల్యం ఉన్న వారికోసం ప్రత్యేకంగా గ్రూప్‌ చేసి ఉపాధి హామీ జాబ్‌కార్డులు ఇచ్చి పనులు కల్పించాలన్నారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రుణాలు మంజూరు చేయాలన్నారు. సదరన్‌ క్యాంపు ఏర్పాటు చేసి దరఖాస్తులు పెండింగ్‌ లేకుండా అదేరోజు ధ్రువపత్రాలు అందిస్తామన్నారు. సమావేశంలో జిల్లా మహిళ, శిశు, దివ్యాంగుల సంక్షేమ అధికారి నర్సింహారావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిరణ్‌కుమార్‌, ముఖ్య ప్రణాళిక అధికారి టి.అశోక్‌, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ సుభాష్‌చంద్రబోస్‌, సీడీపీఓలు పాల్గొన్నారు. 

పోషణ్‌ అభియాన్‌ను ప్రజల్లోకి  తీసుకుపోవాలి : కలెక్టర్‌

 పోషన్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత చేరువుగా తీసుకెళ్లాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలు పోషణ లోపం లేకుండా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.  జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ  శాఖ అధికారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో పోషణ మాసంగా ప్రకటించి ప్రతి గ్రామంలో సంబురాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ కిరణ్‌కుమార్‌, సీపీఓ అశోక్‌, పోషణ్‌ అభియాన్‌ జిల్లా కోఆర్డినేటర్‌ సంపత్‌లతోపాటు ప్రజాప్రతినిధులు జీడి భిక్షం, పుల్లారావు, దావుల వీరప్రసాద్‌, బాణాల కవిత, అనిత, ఉమ, సీడీపీఓ పాల్గొన్నారు.


logo