మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 27, 2020 , 01:32:26

రైతు వేదిక ల నిర్మాణం ఎవ్వరూ ఊహించని పరిణామం

రైతు వేదిక ల నిర్మాణం ఎవ్వరూ ఊహించని పరిణామం

  •  రైతులు డిమాండున్న పంటలనే పండించాలి
  • ప్రజలంతా ఉద్యమంలా మొక్కలు నాటాలి
  • విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
  • మిర్యాలగూడలో హరితహారంలో పాల్గొన్న మంత్రి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

లాభసాటి వ్యవసాయంపై చర్చించడంలో రైతు వేదికలు కీలకభూమిక పోషిస్తాయని, వేదికల నిర్మాణం వ్యవసాయ చరిత్రలో ఓ మలుపు లాంటిదని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమన్న మంత్రి.. మార్పు ఎక్కడో ఒకచోట ప్రారంభం కావాలని.. అందుకు తెలంగాణ రాష్ట్రం నాంది పలుకాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని వివరించారు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ లాంటి పథకాలతో వ్యవసాయాన్ని పండుగలా మార్చి దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలుస్తోందన్నారు.

శుక్రవారం మిర్యాలగూడ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో రూ.20 లక్షలతో రైతు వేదిక, కిష్టాపురంలో రూ.8కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకుముందు పట్టణంలోని రామచంద్రగూడెం కాలనీ, మండలంలోని ధీరావత్‌తండాలో ‘హరితహారం’లో భాగంగా మొక్కలు నాటారు. నియంత్రిత సాగు విధానం లాభాన్ని చేకూరుస్తుందని, రైతులంతా ప్రభుత్వం సూచించిన పంటలు సాగు చేయాలని కోరారు.  

మిర్యాలగూడ/రూరల్‌ : లాభసాటి వ్యవసాయంపై చర్చించడానికి రైతు వేదికలు కీలకపాత్ర పోషిస్తాయని, ఇవి వ్యవసాయ చరిత్రలో ఓ మలుపు లాంటివని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో రూ.20 లక్షలతో నిర్మించనున్న రైతు వేదికకు, మిర్యాలగూడ మండలం కిష్టాపురంలో రూ.8 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా రామచంద్రగూడెం కాలనీ  బైపాస్‌ వై జంక్షన్‌ వద్ద, మండలంలోని ధీరావత్‌తండాలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనే లక్ష్యంతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ ఎకరాకు రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారన్నారు. 

రైతు వేదికల నిర్మాణం ఎవరూ ఊహించని పరిణామమని, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమని తెలిపారు. మార్పు ఎక్కడో ఒకచోట ప్రారంభం కావాలని, అది తెలంగాణ నుంచే నాంది పలకాలన్నదే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని చెప్పారు. రైతులు ప్రణాళిక ప్రకారమే పంటలు వేసేలా నియంత్రిత సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. గిట్టుబాటు ధర రావాలంటే మార్కెట్‌లో డిమాండు ఉన్న పంటలే పండించాలని సూచించారు. రైతులను సమన్వయ పరిచేందుకు రైతు క్లస్టర్లు ఏర్పాటు చేశామని, రైతులు పంటల విషయంలో ఒకేచోట కూర్చుని వ్యవసాయ అధికారులతో కలిసి చర్చించుకునేందుకు రైతు వేదికలు నిర్మిస్తున్నామని చెప్పారు. పచ్చని తెలంగాణతో ఎన్నో విప్లవాత్మక మార్పులకు ఆస్కారం ఉందని, ఆరో విడుత హరిత హారంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌, రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్‌ రాంచంద్రనాయక్‌, మున్సిపల్‌ చైర్మన్‌ తిరునగరు భార్గవ్‌, జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, డీసీఎంస్‌ వైస్‌ చైర్మన్‌ నారాయణరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కోటేశ్వర్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ నూకల సరళాహనుమంతరెడ్డి; ఆర్డీఓ రోహిత్‌సింగ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకన్న, నామిరెడ్డి యాదగిరిరెడ్డి, నల్లమోతు సిద్ధార్థ, ఉదయభాస్కర్‌, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. logo