శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 26, 2020 , 02:28:38

హరిత తెలంగాణే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

హరిత తెలంగాణే  సీఎం కేసీఆర్‌ లక్ష్యం

  • మానవ మనుగడకు మొక్కలే మూలం
  • అడవుల పెంపకానికి ప్రభుత్వం ప్రాధాన్యం
  • మొక్కలు నాటుదాం.. పచ్చదనం సాధిద్దాం
  • విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

‘మానవ మనుగడకు మొక్కలే మూలం.. అంతరించిపోతున్న అడవులను విస్తరించడం, ఊరూరా పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ఆరేండ్లుగా హరితహారం కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు’ అని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆరో విడుత హరితహారం కార్యక్రమాన్ని గురువారం సూర్యాపేట, ఇమాంపేట, నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్నెలో మంత్రి ప్రారంభించారు. ప్రజల్లో చైతన్యం పెరుగుతున్నదని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి హరితహారంలో భాగస్వాములవడంతో నేడు ఎక్కడ చూసినా హరిత శోభ ఉట్టిపడుతోందని పేర్కొన్నారు. ప్రజలంతా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించి ‘ఆకుపచ్చ సూర్యాపేట’ను సాధించాలని మంత్రి పిలుపునిచ్చారు.   

- సూర్యాపేట సిటీ/రూరల్‌/నేరేడుచర్ల 

సూర్యాపేటసిటీ/సూర్యాపేటరూరల్‌/నేరేడుచర్ల : హరిత తెలంగాణే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని,  అందులో భాగంగానే హరితహారం పేరుతో గడిచిన ఆరేండ్లుగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మొక్కల పెంపకం చేపట్టారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని 9వ వార్డులో, సూర్యాపేట మండలం ఇమాంపేటలో, నేరేడుచర్ల మండలం పెంచికల్‌ దిన్నెలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ.. మొదటి విడుత హరితహారంలో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై సీఎం కేసీఆర్‌ స్వయంగా మొక్కలు నాటి ప్రారంభించిన హరితహారంతో ఇప్పుడు జాతీయ రహదారి హరితశోభతో వర్ధిల్లుతుందన్నారు. పర్యావరణ సమస్యను అధిగమించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పమని, అందుకు అనుగుణంగా జిల్లాలో 83లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకొని హరితహారం ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలో మూడున్నర శాతంగా ఉన్న అడవులను 33శాతం విస్తరించే లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. గతంలో హైదరాబాద్‌ నుంచి విజయవాడ రహదారిలో ప్రయాణిస్తున్న సమయంలో సూర్యకిరణాలు కూడా ప్రసరించలేనంతగా వృక్షాలు ఉండేవని, రహదారుల విస్తరణలో అవి కనుమరుగయ్యాని, హరితహారంలో భాగంగా మొక్కలు నాటడంతో ఇప్పుడు పూర్వవైభవం కనిపిస్తుందన్నారు. ఇష్టానుసారంగా అడవులను నరికివేయడంతో వానలు రాకపోవడమే కాకుండా కోతులు గ్రామాలపై విజృంభిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రస్తుతం మంకీస్‌ ఫుడ్‌ కోర్టుల నిర్మాణం చేపట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ హరితహారంలో పాల్గొనాలని కోరారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌ మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమాన్ని పవిత్రమైన కార్యక్రమంగా భావించి ఇంటింటా మొక్కలు నాటాలన్నారు. పోయిన పచ్చదనాన్ని తిరిగి తెచ్చుకోవడానికి  హరితహారం కార్యక్రమాన్ని విజయవతం చేయాలని హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఈనెల 29న హుజూర్‌నగర్‌ ఆర్డీఓ కార్యాలయం ప్రారంభోత్సవం, నేరేడుచర్ల మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ్జ దీపికాయుగంధర్‌రావు, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ, కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌, అదనపు కలెక్టర్‌ సంజీవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌,  జడ్పీ వైస్‌ చైర్మన్‌ వెంకటనారాయణగౌడ్‌, ఆర్డీఓ మోహన్‌రావు, డీఆర్‌డీఓ పీడీ కిరణ్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రామానుజులరెడ్డి, డీఎఫ్‌ఓ ముకుందరెడ్డి, ఆర్డీఓ మోహన్‌రావు, ఎంపీపీలు బీరవోలు రవీందర్‌రెడ్డి, నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ జీడి భిక్షం, నేరేడుచర్ల మున్సిపల్‌ చైర్మన్‌ జయబాబు, వైస్‌చైర్‌పర్సన్‌ శ్రీలత, ఎంపీపీ లకుమళ్ల జ్యోతి, జడ్పీటీసీ రాపోలు నర్సయ్య, వైస్‌ ఎంపీపీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.    

ఉత్సాహంగా.. ఉల్లాసంగా.. 

సూర్యాపేట సిటీ : ఆరో విడుత హరిత హారం కార్యక్రమం జిల్లాకేంద్రంలో ఉత్సాహవంతమైన, సంతోషకరమైన వాతావరణంలో ప్రారంభమైంది. 9వార్డులోని పార్కులో కార్యక్రమం విజయవంతంగా సాగింది. కార్యక్రమానికి మున్సిపల్‌ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కాలనీ ప్రజలు, మహిళలు, పిల్లలు, రాజకీయ నాయకులు, కౌన్సిలర్లు, కలెక్టర్‌, ఎస్పీ, రెవెన్యూ, మున్సిపల్‌, ఆరోగ్యశాఖ, పోలీస్‌ అధికారులు పాల్గొనడంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. మంత్రి జగదీశ్‌రెడ్డి ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటి సందడి చేశారు.   

 హుషారుగా బైక్‌ నడిపిన మంత్రి  

నేరేడుచర్ల : పెంచికల్‌దిన్నెలో హరితహారం ముగిసిన వెంటనే మంత్రి జగదీశ్‌రెడ్డి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. సమావేశం ముగిసిన అనంతరం ప్రజాప్రతినిధులంతా కార్లలో తిరిగి వెళ్తారని ఊహించారు. కానీ చెరువు కట్టపై మత్స్యకారులు నిలబడి ఉండడంతో మంత్రి జగదీశ్‌రెడ్డి స్వయంగా బైక్‌ నడుపుకుంటూ చెరువు కట్టపైకి వెళ్లి అక్కడున్న మత్స్యకారులతో ముచ్చటించారు. మంత్రి బైక్‌పై వెళ్లడం చూసిన ఎంపీ బడుగుల, ఎమ్మెల్యే శానంపూడి మంత్రిని అనుసరించారు. logo