గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 23, 2020 , 02:52:12

ఆద్యంతం ఉద్వేగ భరితం

ఆద్యంతం ఉద్వేగ భరితం

కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి అండగా ఉంటూ మనోధైర్యం కల్పించే ఉద్దేశంతో సోమవారం సూర్యాపేటకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన ఆద్యంతం ఉద్వేగభరితంగా కొనసాగింది. ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌ నుంచి రోడ్డుమార్గాన భువనగిరి, చిట్యాల మీదుగా సూర్యాపేటకు చేరుకున్నారు. నేరుగా సంతోష్‌బాబు నివాసానికి వెళ్లగా అక్కడ తీవ్ర ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. వాహనం దిగిన సీఎం కేసీఆర్‌ సంతోష్‌బాబు చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తుండగా అక్కడ కొద్దిసేపు నిశ్శబ్ధ వాతావరణం ఏర్పడింది. ఇంట్లోకి వెళ్లాక తల్లిని, భార్యనుద్దేశించి ‘సారీ.. అమ్మా’ అని పలుకరించడంతో కొద్దిసేపు అందరూ మౌనంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత వారికి మనోధైర్యం చెబుతూ భవిష్యత్తుపై భరోసా కల్పించేలా ఆర్థిక సాయం, ఇంటి స్థలం, ఉద్యోగ పత్రాలు అందజేశారు.

    నల్లగొండ ప్రతినిధి/సూర్యాపేట, నమస్తే తెలంగాణ : కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్‌ సోమవారం పరామర్శించారు. సూర్యాపేటలోని వారింటికి స్వయంగా వచ్చి ప్రకటించిన ప్రభుత్వ సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంతోష్‌బాబు చిత్రపటానికి నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని ఆయన మరణవార్త తెలిసిన మరుక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఆ ప్రకారంగానే పార్థివదేహం తరలింపు నుంచి మొదలుకొని అంత్యక్రియలు ముగిసే వరకు ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు నిర్వహించింది. ప్రభుత్వ ప్రతినిధి మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్‌ తన స్పందనను తెలియజేస్తూ.. వారి కుటుంబానికి భరోసానిచ్చే విధంగా సాయం ప్రకటించారు. సంతోష్‌బాబు సతీమణి సంతోషికి గ్రూప్‌-1 ఉద్యోగంతోపాటు హైదరాబాద్‌లో ఇంటి స్థలం, రూ.5 కోట్ల నగదు అందజేయనున్నట్లు వెల్లడించారు. వాటిని కూడా తానే స్వయంగా సూర్యాపేటలోని కర్నల్‌ సంతోష్‌బాబు ఇంటికి వచ్చి ఇస్తానని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారంగానే సీఎం కేసీఆర్‌ స్వయంగా సోమవారం సూర్యాపేటలోని సంతోష్‌బాబు నివాసానికి వచ్చారు. భార్య సంతోషి, తల్లిదండ్రులు ఉపేందర్‌, మంజుల, సోదరి శృతిని పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. సంతోష్‌బాబు పిల్లలను బాగా చదివించి మంచి భవిష్యత్తునివ్వాలని ఆకాంక్షించారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని, మంత్రి జగదీశ్‌రెడ్డి ఇక్కడే అందుబాటులో ఉంటారని తెలిపారు. దీంతో సంతోష్‌బాబు భార్య, తల్లిదండ్రులు ఎంతో ఊరట చెందారు. ఆయన లేనిలోటు తీర్చలేనిదైనా సీఎం కేసీఆర్‌ తమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారని చెప్పారు. జీవితాంతం సీఎం కేసీఆర్‌కు, మంత్రి జగదీశ్‌రెడ్డిలకు రుణపడి ఉంటామని ప్రకటించారు. ప్రభుత్వం అందించే సాయం కూడా తమ అభీష్టానికి అనుగుణంగా చేస్తుండడం కేసీఆర్‌ గొప్పతనానికి నిదర్శనమని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోశ్‌కుమార్‌, బడుగుల లింగయ్యయాదవ్‌, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌, బొల్లం మల్లయ్యయాదవ్‌, శానంపూడి సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, భూపాల్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ దీపికాయుగంధర్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్‌, ఆర్డీఓ మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్‌ పర్యటన సాగిందిలా... 

 • 3.40 గంటలకు సూర్యాపేట చేరుకున్న కేసీఆర్‌
 • 3.42 నిమిషాలకు సంతోష్‌బాబు ఇంటికి చేరిక, చిత్రపటానికి నివాళి
 • 3.43కు ఇంట్లోకి వెళ్లి కుటుంబసభ్యుల పరామర్శ
 • 3.46కు ఉద్యోగ, ఇంటిస్థలం ధ్రువపత్రాల అందజేత
 • 3.48కు నగదు చెక్కులు అందజేత 
 • 3.50కు కుటుంబసభ్యులతో మాటామంతి
 • 20నిమిషాలు పాటు కుటుంబసభ్యులకు భరోసానిస్తూ బాగోగులపై ఆరా
 • 4.09కు కర్నల్‌ సంతోష్‌బాబు చిత్రపటంపై       ‘జైహింద్‌', అంటూ సంతకం
 • 4.10కు ఇంటినుంచి బయటకు వచ్చిన కేసీఆర్‌ 
 • 4.11కు బయట ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అభివాదం చేస్తు వాహనం వద్దకు చేరిక
 • 4.12కు తన కాన్వాయ్‌లో బయల్దేరి వెళ్లిన సీఎం


logo