మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 21, 2020 , 23:58:57

గ్రామాలకు గ్రీన్‌ బడ్జెట్‌

గ్రామాలకు గ్రీన్‌ బడ్జెట్‌

  • పచ్చదనానికి పది శాతం నిధులు కేటాయింపు
  • పంచాయతీలకు వచ్చే నిధుల  నుంచి ఖర్చు
  • ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం 
  • నర్సరీల నుంచి మొక్కల సంరక్షణ వరకు వినియోగం 

పచ్చదనం పెంపు, పర్యావరణ రక్షణకు తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే ఐదు విడుతలు విజయవంతం కాగా ఆరో విడుతకు సన్నద్ధమవుతోంది. పట్టణాలు, గ్రామాల్లో హరితహారంలో నాటిన మొక్కలు పెరిగి నేడు పచ్చదనంతో కళకళలాడుతుండగా అటవీ శాతాన్ని మరింత పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీల్లో గ్రీన్‌ బడ్జెట్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులతోపాటు గ్రామ పంచాయతీ సాధారణ నిధుల్లో నుంచి 10 శాతం ఈ బడ్జెట్‌కు కేటాయించాలని నిర్ణయించింది. విత్తనాల కొనుగోలు, నర్సరీల పెంపకం, మొక్కలు నాటడం, సంరక్షించడం వరకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. గతేడాది సెప్టెంబర్‌ నుంచి ఈ సంవత్సరం జూన్‌ వరకు 11 నెలల్లో పంచాయతీలకు వచ్చిన నిధుల్లో 10శాతం హరితహారానికి వెచ్చించనున్నారు. 

- నల్లగొండ, సూర్యాపేట

ప్రస్తుతం పల్లెలు, పట్టణాల ఆధునీకరణ పేరుతో చెట్లను నరికి వేస్తుండడంతో అటవీశాతం తగ్గుతోంది. దీంతో పర్యావరణానికి ప్రమాదం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో అటవీశాతాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం 2014 ఆగస్టు నుంచి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు ఐదు దఫాలుగా కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రభుత్వం ఈ నెల 25 నుంచి ఆరో విడుత హరిత హారం కార్యక్రమ నిర్వహణకు ప్రణాళికలు రూపొందించింది. గ్రామాల్లో ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతను గ్రామపంచాయతీ పాలకవర్గాలకు అప్పగించడంతో పాటు గ్రీన్‌ బడ్జెట్‌ పేరిట నిధుల విభజన చేపట్టింది. ఈ నిధులతో గ్రామాల్లో నర్సరీల నిర్వహణ, మొక్కలు నాటడం, వాటి సంరక్షణ చేపట్టి పల్లెలను పచ్చగా మార్చనుంది.   

గ్రీన్‌బడ్జెట్‌కు నిధులు

గ్రామీణ ప్రాంతాల్లో కూడా చెట్ల నరికివేత అధికం కావడంతో అటవీశాతం తగ్గుతోంది. అందుకే ఐదేళ్లుగా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో సైతం హరితహారం కార్యక్రమాన్ని పతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం కోట్ల రూపాయలు కేటాయిస్తోంది. ఈ కార్యక్రమంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఈ ఏడాది నుంచి గ్రామపంచాయతీ పాలకవర్గాలకు అప్పగించింది. ఆయా గ్రామపంచాయతీ పరిధిలో మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించేందుకు గ్రీన్‌ బడ్జెట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి పంచాయతీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులతో పాటు సాధారణ నిధుల నుంచి 10శాతాన్ని గ్రీన్‌బడ్జెట్‌కు కేటాయిస్తారు. ఈ బడ్జెట్‌తో గ్రామాల్లోని నర్సరీల్లో అవసరమైన విత్తనాలు కొనుగోలు నుంచి మొదలు మొక్క నాటిం పు, వాటరింగ్‌, ట్రీగార్డ్స్‌, పరిరక్షణ ఇలా ఉపాధిహామీ పథకం పరిధిలోకి రాని పనులను చేపట్టాల్సి ఉంటుంది.   

ఈ ఏడాది రూ. 24 కోట్లు 

పల్లెల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌ నుంచి పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టింది. సెప్టెంబర్‌ 6 నుంచి అక్టోబర్‌ 5 వరకు తొలి విడుత, జనవరి 2 నుంచి 11 వరకు రెండో విడుత, ఈ నెల 1 నుంచి 8 వరకు మూడో విడుత పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టింది. గతేడాది సెప్టెంబర్‌ నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు 11 నెలల పాటు నెలకు రూ.20 కోట్లు, కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్రం స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కింద రూ.220 కోట్లు గ్రామ పంచాయతీలకు విడుదల చేసింది. ఇలా జిల్లాలోని 844 జీపీలకు రూ. 240 కోట్లు రాగా అందులో పది శాతం రూ. 24 కోట్లు గ్రీన్‌ బడ్జెట్‌కు కేటాయించారు. ఈ నిధులను ఈ ఏడాది హరితహారం కార్యక్రమానికి వినియోగించనున్నారు. 

 గ్రామపంచాయతీకో నర్సరీ  

హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామీణాభివృద్ధి, అటవీ, ఉద్యానవన శాఖలు సమన్వయంతో ప్రతి గ్రామపంచాయతీలో ఒక్కో నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచారు. ఆశాఖలే బాధ్యతగా మొక్కలను నాటించినా సంరక్షణ జరుగక పోవడంతో అనుకున్న లక్ష్యం చేరక నిధులు దుర్వినియోగం అయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈసంత్సరం ఈ బాధ్యతను గ్రామపంచాయతీ పాలకవర్గాలకు అప్పగించింది. గ్రీన్‌బడ్జెట్‌ నిధులతో డీఆర్‌డీఏ ద్వారా ఈ ఏడాది జిల్లాలోని 844 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచారు. డీఆర్‌డీఏ యంత్రాంగం నర్సరీలను ఇప్పటికే పంచాయతీరాజ్‌ శాఖకు అప్పగించగా పంచాయతీ పాలకవర్గాలు మొక్కలు నాటించడంతో పాటు సంరక్షణ బాధ్యత చూడనుంది. ఈ నెల 25 లోపు అన్ని గ్రామాల్లో మొక్కల లభ్యతను బట్టి గుంతలు తీసి నాటేందుకు సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత ఉపాధి నిధులు వినియోగించుకుంటూ మొక్కలు నాటించేందుకు సిద్ధమవుతున్నారు.  

సూర్యాపేటలో రూ.11 కోట్లు

 సూర్యాపేట జిల్లాలోని 475 గ్రామ పంచాయతీలకు 2019 సెప్టెంబర్‌ నుంచి 2020 జూన్‌ వరకు జనరల్‌ ఫండ్‌, 14వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఇస్తున్న ప్రత్యేక గ్రాంట్‌ (ఎస్‌ఎఫ్‌సీ) వంటి వాటికి సుమారు రూ.142.14 కోట్లు కేటాయించింది. వీటిలో రూ.31.72 కోట్లు  ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ఖర్చు చేశారు. ఇంకా రూ.110.41 కోట్లు ఆయా గ్రామ పంచాయతీల ఖాతాలో ఉన్నాయి. వాటిలో నుంచి రూ.11 కోట్లు గ్రీన్‌ బడ్జెట్‌కు కేటాయించారు. ఈ నిధులతో నర్సరీలకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, ట్రీగార్డులు, ఎర్రమట్టి, వంటి వాటికి కేటాయించనున్నారు. గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కలు సరిపోకుంటే 4 నుంచి 5 అడుగుల మొక్కలను ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయడానికి  కూడా ఈ నిధులు వినియోగించుకోవచ్చు.  

గ్రామపంచాయతీ నిధుల్లో 10శాతం గ్రీన్‌ బడ్జెట్‌కే

గ్రామ పంచాయతీ నిధుల్లో 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌కు కేటాయిస్తున్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులు రూ.240 కోట్లు ఉండగా అందులో రూ. 24 కోట్లు దీనికింద కేటాయించాలని పాలక వర్గాలను ఆదేశించాం. విత్తనాలు విత్తే దగ్గర నుంచి అవి మొక్కగా పెరిగే వరకు ఉపాధి నిధులు వర్తించని పనులకు వీటిని వినియోగించనున్నాం.

-విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి, నల్లగొండ.

హరితహారం కోసమే వినియోగించాలి

గ్రామపంచాయతీ నిధుల నుంచి 10శాతాన్ని గ్రీన్‌ బడ్జెట్‌కే కేటాయించాం. ఈ నిధులను కేవలం హరితహారంలో మొక్కల కోసమే వినియోగించాల్సి ఉంటుంది. ప్రభుత్వం కేటాయించే నిధులకు తోడు వీటిని వినియోగించి పల్లెలను పచ్చగా మార్చాలి. జిల్లా వ్యాప్తంగా 475 గ్రామ పంచాయతీలలో సుమారు రూ.11 కోట్లు గ్రీన్‌ బడ్జెట్‌కు కేటాయించాం.   

- యాదయ్య , డీపీఓ, సూర్యాపేట 


logo