శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 21, 2020 , 01:38:12

అటవీ అధికారుల సస్పెన్షన్‌

అటవీ అధికారుల సస్పెన్షన్‌

అశ్వారావుపేట : విధినిర్వహణలో అలసత్వంతో పాటు అక్రమాలు, అటవీ భూముల అన్యాక్రాంతంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై రేంజర్‌తో పాటు మరో ముగ్గురు అటవీ అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేస్తూ  శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పాపిడిగూడెం గ్రామ సమీపంలో అన్యాక్రాంతమైన అటవీ భూములను వదిలేసి ఆక్రమణదారులతో కుమ్మక్కై కందకం తవ్వటమే కాకుండా వినాయకపురం ఫారెస్ట్‌ క్వార్టర్స్‌లో పట్టుబడిన కలప మాయం, అశ్వారావుపేట చెక్‌పోస్ట్‌లో అక్రమాలు, చెక్‌పోస్ట్‌ వెనుక భాగంలో అటవీ ఆస్తులను నిర్లక్ష్యం చేయటం వంటి కారణాలతో రేంజర్‌ ముక్తార్‌ హుస్సేన్‌, డీఆర్వో శ్రీనివాసరావు, ప్రస్తుతం కారేపల్లిలో పనిచేస్తున్న ఫారెస్టర్‌ శ్రీనివాసరావు, బీట్‌ ఆఫీసర్‌ రమేశ్‌లను సస్పెండ్‌  చేశారు. ఇటీవల డివిజనల్‌ ఆఫీసర్‌ పలు ఆరోపణలపై విచారణ నిర్వహించారు. విచారణలో పైన పేర్కొన్న ఆరోపణలతో పాటు కన్నాయిగూడెంలో ఒక రైతు భారీగా మారుజాతి కలపను అక్రమంగా నిల్వ చేసినట్లు నిర్ధారించారు. విచారణాధికారి నివేదిక ఆధారంగా అటవీ శాఖ ఉన్నతాధికారులు బాధ్యులైన నలుగురు అధికారులను సస్పెండ్‌ చేసినట్లు సమాచారం. కన్నాయిగూడెంలో ఒక రైతు మారుజాతి కలపను అక్రమంగా తరలించుకుపోయినట్లు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. దీనిపై అటవీ ఉన్నతాధికారులను వివరణ కోరగా అధికారిక ఉత్తర్వులు అందలేదని, మౌఖిక సమాచారం అందినట్లు తెలిపారు.  logo