బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 18, 2020 , 01:57:23

జిల్లా వ్యాప్తంగా కల్నల్‌ సంతోశ్‌బాబుకు ఘన నివాళి

జిల్లా వ్యాప్తంగా కల్నల్‌ సంతోశ్‌బాబుకు  ఘన నివాళి

  • కొవ్వొత్తుల ప్రదర్శన, జాతీయ జెండాలతో ర్యాలీలు
  • అమరవీరుడి తల్లిదండ్రులకు 
  • పలువురు పరామర్శ

సూర్యాపేట, నమస్తేతెలంగాణ : తండ్రి కోరికతో సైన్యంలో చేరి దేశం కోసం ప్రాణాలర్పించిన సూర్యాపేటకు చెందిన కల్నల్‌ సంతోశ్‌బాబు మృతిని యావత్‌ భారతదేశంతో పాటు జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. పట్టణాలతోపాటు గ్రామాల్లో సైతం సంతోశ్‌బాబు వీరత్వాన్ని స్మరించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ జెండాలు చేత బట్టి ర్యాలీలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య సంఘంతోపాటు ఆయా సంఘాలు, పార్టీల నాయకులు ర్యాలీలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. సంతోశ్‌బాబు తల్లిదండ్రులను అన్ని రాజకీయ పార్టీలతోపాటు పలువురు నాయకులు, స్థానికులు పరామర్శించి సెల్యూట్‌ చేశారు. కొందరు కరోనా నేపథ్యంలో మూతికి కట్టుకునే మాస్కులను ఆయన ఫొటోతో ముద్రించి పంపిణీ చేశారు. 

ఆ ఇంటి వద్ద నిశ్శబ్ధం  

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సంతోశ్‌బాబు తల్లిదండ్రులు ఉండే నివాసం వద్ద నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది. దేశ సేవ కోసం ప్రాణాలర్పించిన సంతోశ్‌బాబు తల్లిదండ్రులను పరామర్శించడానికి బుధవారం పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. పలు మీడియా ప్రతినిధుల రాకతో హడావుడి కనిపించింది. పదకొండేళ్ల వయసులోనే చదువు కోసం సంతోశ్‌బాబు సూర్యాపేట నుంచి వెళ్లిపోవడంతో స్థానికంగా చాలా తక్కువ మందితో సంబంధాలు ఉన్నాయి.  అయితే తెలియని వారు సైతం పెద్దఎత్తున సంతోశ్‌ కుటుంభాన్ని పరామర్శించి తాము మీము అండగా ఉంటామని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. కల్నల్‌ తల్లిదండ్రులు, బంధువులు బుధవారం పెద్దగా మాట్లాడకుండా నిశ్శబ్ధంగా ఉన్నారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్‌ తదితర శాఖల అధికారులు, రాజకీయ నాయకులు, సాధారణ ప్రజలు కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ వారిని పరామర్శించి వెళ్లారు.


logo