మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 18, 2020 , 01:28:11

అంతిమ యాత్రకు ఏర్పాట్లు

అంతిమ యాత్రకు  ఏర్పాట్లు

  • ఆర్మీ లాంఛనాలతో నిర్వహణ
  • కాసరబాద రోడ్‌లోని సొంత స్థలంలో ఏర్పాట్లు పూర్తి 
  •  సూర్యాపేటకు చేరుకున్న ఆర్మీ అధికారులు 
  • ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ 
  • హాజరుకానున్న ప్రముఖులు 

భారత్‌-చైనా సరిహద్దులో వీరమరణం పొందిన కల్నల్‌  బిక్కుమళ్ల సంతోశ్‌బాబు అంత్యక్రియలు నేడు జరుగనున్నాయి. కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు కాసరబాద గ్రామ సమీపంలోని వారి సొంత భూమిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకుపలువురు ఆర్మీ అధికారులు, 50మంది జవాన్లు బుధవారం సూర్యాపేటకు చేరుకున్నారు. కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్‌ ఏర్పాట్లుపర్యవేక్షించారు. సంతోశ్‌బాబు మృతికి సంతాపంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేసి నివాళులర్పించారు. పలుపార్టీల ప్రముఖులు  సంతోశ్‌బాబు తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. 

          సూర్యాపేట : కల్నల్‌ బిక్కుమళ్ల సంతోశ్‌బాబు అంత్యక్రియలు గురువారం ఆర్మీ అధికారిక లాంఛనాలతో జరుగనున్నాయి. సంతోశ్‌ కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు సూర్యాపేటకు సమీపంలోని కాసరబాద రోడ్డులోని భూమిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు పలువురు ఆర్మీ అధికారులు, 50మంది జవాన్లు బుధవారం సూర్యాపేటకు చేరుకున్నారు.

అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధిగా విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పీసీసీ అధ్యక్షుడు ఉత్తం కుమార్‌రెడ్డితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్‌ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల సందర్శనార్థం సంతోశ్‌బాబు పార్థివ దేహాన్ని ఇంటి వద్దనే ఉంచుతారని, ఉదయం 8గంటలలోపు బంధువులు, ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించి చూడాలన్నారు. అనంతరం అంతిమయాత్ర ఉంటుందని, తదుపరి దహన సంస్కారాలు కాసరబాదలోని ఆయన వ్యవసాయక్షేత్రంలో నిర్వహిస్తారని తెలిపారు.

కరోనా నిబంధనల మేరకు 50మందిని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. అంతకు ముందు ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌తో కలిసి దహన సంస్కారాల ఏర్పాట్ల స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీఓ మోహన్‌రావు, కమిషనర్‌ రామానుజులరెడ్డి, ఆర్మీ సుబేదార్‌ దినేశ్‌కుమార్‌, తాసిల్దార్‌ వెంకన్న ఉన్నారు. 
logo