శనివారం 19 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 16, 2020 , 02:02:03

భర్తపై కోపంతో ఇద్దరు పిల్లలను చెరువులో పడేసిన తల్లి

భర్తపై కోపంతో ఇద్దరు పిల్లలను చెరువులో పడేసిన తల్లి

  • చిన్నారుల ఆర్తనాదాలతో భయంతో పారిపోయిన వైనం 
  • తెల్లవారుజామున నీళ్లపై తేలిన మృతదేహాలు
  • సూర్యాపేటలో సద్దుల చెరువు వద్ద విషాదం

 సూర్యాపేటసిటీ : కన్నతల్లే ఘాతుకానికి ఒడిగట్టింది. భర్తపై కోపంతో తన కడుపున పుట్టిన ఇద్దరి పిల్లల ఉసురు తీసింది. భర్త ఆగడాలు భరించలేక.. పిల్లలను చంపి తనూ తనువు చాలించాలనుకుంది.. అదే తడవుగా సూర్యాపేట సద్దుల చెరువులో బిడ్డలను విసిరేసింది. కానీ వారి ఆర్తనాదాలతో తను చావలేక.. వారిని కాపాడలేక భయంతో పరారైంది. ఈ హృదయవిదారకర ఘటన సూర్యాపేట పట్టణ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. పెన్‌పహాడ్‌ మండలం సింగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన నాగమణి గతంలో హైదరాబాద్‌లో పనిచేసి జీవనం గడిపేది. ఈక్రమంలో అక్కడే డ్రైవర్‌గా పనిచేసే ప్రశాంత్‌కుమార్‌తో 2006లో ప్రేమ వివాహం జరిగింది. అనంతరం వారి మకాం సూర్యాపేట పట్టణానికి మారింది. వీరికి కుమార్తె జ్యోతి మాధవి(8), కుమారుడు హర్షవర్ధన్‌(6) ఉన్నారు.

ప్రశాంత్‌ జనగాం క్రాస్‌రోడ్‌లోని ఓ పాత ఇనుప దుకాణంలో పనిచేస్తుండగా విద్యానగర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే ప్రశాంత్‌ వ్యసనాలకు బానిసకావడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఆదివారం రాత్రి తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆవేశంలో నాగమణి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటినుంచి బయటకు వచ్చేసింది. భర్తతో విసిగి వేసారిన ఆమె ఇద్దరు చిన్నారులను చంపి తనూ చావాలనుకుంది. సద్దుల చెరువు వద్దకు వెళ్లి పిల్లలిద్దరనీ చెరువులోకి విసిరేసింది. నీట మునుగుతూ పిల్లలు కేకలు వేస్తుండడంతో వారిని రక్షించుకునే అవకాశం లేక.. తనకూ చావంటే భయం వేసి పరారైంది. కొంతసేపటికి మృతదేహాలనైనా తీసుకుపోవాలని నాగమణి తిరిగి చెరువువద్దకు చేరుకోగా అప్పటికే చెరువుకట్టపై వాకర్స్‌కు బాలుడి మృతదేహం కనపడడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. అలాగే నాగమణి రోదిస్తుండడం వాకర్స్‌ గమనించి ప్రశ్నించడంతో ఆమె అక్కడనుంచి పరారైంది. సమాచారం అందుకున్న పట్టణ ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయులు, ఇతర ఎస్‌ఐలు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

తెల్లవారుజామున ఓ మహిళ ఇద్దరు పిల్లలతో చెరువు కట్టపై తిరిగిందని స్థానికులు తెలపడంతో పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించి చెరువులో వెతికించగా చిన్నారి జ్యోతిమాధవి మృతదేహం కూడా లభ్యమైంది. చిన్నారుల తండ్రి ప్రశాంత్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఏరియా దవాఖానకు తరలించగా సాయంత్రం తల్లి అక్కడకు వచ్చింది. దీంతో నాగమణిని సొంత సోదరుడితోపాటు బంధువులు చితకబాదారు. అయితే చిన్నారుల మృతి పట్ల నాగమణితోపాటు మరో వ్యక్తిపై పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం. చెరువులో పడేసి చంపారా లేక హత్యచేసిన తర్వాత చెరువులో వేశారా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్లు విశ్వసనీయం సమాచారం.


logo