శనివారం 19 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 15, 2020 , 02:44:40

గుడిసెల నుంచి.. పక్కా గృహాల్లోకి..

గుడిసెల నుంచి.. పక్కా గృహాల్లోకి..

సూర్యాపేట, నమస్తే తెలంగాణ : ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ.. ఆరుబయట క్రిమికీటకాలతో సహజీవనం.. దశాబ్దాల తరబడి జీవచ్ఛవాలుగా బతుకీడుస్తున్న నిరుపేద అభాగ్యులు వారు.. తరాలు మారినా ఏ రాజకీయ నాయకుడు, ఏ ప్రభుత్వం వారి తలరాతలు మార్చలేదు. కేవలం 30 నుంచి 50 గజాల జాగలో పూరి గుడిసెలే వారికి వంశ పారంపర్యంగా వస్తున్న ఆస్తిపాస్తులు. కానీ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి కొండంత అండ దొరికింది. ఇటీవల ఆ గుడిసెలు ఉన్న ప్రదేశంలో 80 డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మించగా ఇటీవల మంత్రి జగదీశ్‌రెడ్డి వాటిని ప్రారంభించారు. ఇప్పటికే అర్హులైన వారందరికీ పింఛన్లతోపాటు ఇతర సంక్షేమ పథకాలు కడుపు నిండుతుండగా తాజాగా డబుల్‌ బెడ్రూం ఇండ్లు రావడంతో ఆ నిరుపేదల సంతోషం అంతా ఇంతాకాదు. 

6 ఎకరాల్లో రూ.16 కోట్ల వ్యయంతో..                         

 ఎలాంటి రాజీలేకుండా నిరుపేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లను కట్టించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు 2014 సాధారణ ఎన్నికలకు ముందు ప్రతి ప్రచార సభలో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరేళ్లుగా ప్రాధాన్యతా క్రమంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ డబుల్‌బెడ్రూం ఇండ్ల పథకాన్ని కూడా ప్రారంభించి ఇప్పటికే లక్షలాది ఇండ్లను నిర్మిస్తున్నారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వందలాది మంది లబ్ధిదారులకు ఇప్పటికే ఇండ్లు నిర్మించి పంపిణీ చేయగా.. తాజాగా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద 6 ఎకరాల స్థలంలో రూ.16 కోట్ల వ్యయంతో నిర్మించిన 80 డబుల్‌ బెడ్రూం ఇండ్లను గత నెల 28న విద్యుత్‌శాఖ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. 

నిలువ నీడలేని స్థానం నుంచి

చివ్వెంల మండలం గుంపుల, తిరుమలగిరి గ్రామాలకు చెందిన 58 నిరుపేద కుటుంబాలతోపాటు ప్రస్తుతం డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మించిన ప్రాంతంలో గుడిసెల్లో ఉండే 22 బేడ బుడిగజంగాల కుటుంబాలకు ఇండ్లు మంజూరు కావడంతో వారు డబుల్‌ బెడ్రూం ఇండ్లలోకి మారారు. నేడు ఆ లబ్ధిదారులంతా సంతోషంగా ఉన్నారు. ఇప్పు డు వారి ముఖాల్లో నిలువ నీడలేని స్థానం నుంచి పక్కా ఇండ్లు వచ్చాయని ధైర్యం.. కళ్లల్లో ఆనం దం, జీవితంపై భరోసా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తినటానికి రూపాయికే కిలో బియ్యం, ఆసరా పిం ఛన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌ లాంటి సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయి. ఇండ్లు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘మా ఇంటికి యజమాని, మా పెద్ద కొడుకే కాదు, మాకు దేవుడు’ అని లబ్ధిదారులు కొనియాడుతున్నారు. 


logo