శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 15, 2020 , 00:31:36

గుడిసెల నుంచి పక్కా గృహాల్లోకి..

  గుడిసెల నుంచి పక్కా గృహాల్లోకి..

  1. నెరవేరిన నిరుపేదల దశాబ్దాల కల
  2. తరాల తలరాతను మార్చిన డబుల్‌ బెడ్రూం ఇండ్ల పథకం
  3. జి.తిరుమలగిరిలో సొంతింట్లోకి చేరిన 80 మంది లబ్ధిదారులు
  4. ఆనందంలో వారి కుటుంబ సభ్యులు
  5. సీఎం కేసీఆర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డికి కృతజ్ఞతలు

వారంతా నిరుపేదలు.. గుడిసెలు, డేరాలే వారి ఆవాసం.. చెట్లు, చెదారం మధ్య ఎండ, వాన, చలికి ఇబ్బందులు పడుతక్రిమికీటకాలతో సహవాసం చేసేవారు.. నాటకాలతోపాటు ఇతర కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు.. తరాలు మారుతున్నా వారి తలరాతలు మారలే.. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అభాగ్యులకు కొండంత అండ దొరికింది. డబుల్‌ బెడ్రూం ఇండ్ల పథకంతో పక్కా ఇండ్లు వరించాయి. ఇదీ చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరిలోని బుడిగజంగాల విజయగాథ. గత నెల 28న 80 డబుల్‌ బెడ్రూం ఇండ్లను మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించి లబ్ధిదారులకు అందించగా నేడు వారంతా ఆనందంగా ఉన్నారు. దశాబ్దాలుగా తాము పడ్డ కష్టాలు ఇప్పుడు తీరాయని, తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటామని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సూర్యాపేట, నమస్తే తెలంగాణ : ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ.. ఆరుబయట క్రిమికీటకాలతో సహజీవనం.. దశాబ్దాల తరబడి జీవచ్ఛవాలుగా బతుకీడుస్తున్న నిరుపేద అభాగ్యులు వారు.. తరాలు మారినా ఏ రాజకీయ నాయకుడు, ఏ ప్రభుత్వం వారి తలరాతలు మార్చలేదు. కేవలం 30 నుంచి 50 గజాల జాగలో పూరి గుడిసెలే వారికి వంశ పారంపర్యంగా వస్తున్న ఆస్తిపాస్తులు. కానీ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి కొండంత అండ దొరికింది. ఇటీవల ఆ గుడిసెలు ఉన్న ప్రదేశంలో 80 డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మించగా ఇటీవల మంత్రి జగదీశ్‌రెడ్డి వాటిని ప్రారంభించారు. ఇప్పటికే అర్హులైన వారందరికీ పింఛన్లతోపాటు ఇతర సంక్షేమ పథకాలు కడుపు నిండుతుండగా తాజాగా డబుల్‌ బెడ్రూం ఇండ్లు రావడంతో ఆ నిరుపేదల సంతోషం అంతా ఇంతాకాదు. 

6 ఎకరాల్లో రూ.16 కోట్ల వ్యయంతో..                         

 ఎలాంటి రాజీలేకుండా నిరుపేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లను కట్టించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు 2014 సాధారణ ఎన్నికలకు ముందు ప్రతి ప్రచార సభలో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరేళ్లుగా ప్రాధాన్యతా క్రమంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ డబుల్‌బెడ్రూం ఇండ్ల పథకాన్ని కూడా ప్రారంభించి ఇప్పటికే లక్షలాది ఇండ్లను నిర్మిస్తున్నారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వందలాది మంది లబ్ధిదారులకు ఇప్పటికే ఇండ్లు నిర్మించి పంపిణీ చేయగా.. తాజాగా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద 6 ఎకరాల స్థలంలో రూ.16 కోట్ల వ్యయంతో నిర్మించిన 80 డబుల్‌ బెడ్రూం ఇండ్లను గత నెల 28న విద్యుత్‌శాఖ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. 

నిలువ నీడలేని స్థానం నుంచి

చివ్వెంల మండలం గుంపుల, తిరుమలగిరి గ్రామాలకు చెందిన 58 నిరుపేద కుటుంబాలతోపాటు ప్రస్తుతం డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మించిన ప్రాంతంలో గుడిసెల్లో ఉండే 22 బేడ బుడిగజంగాల కుటుంబాలకు ఇండ్లు మంజూరు కావడంతో వారు డబుల్‌ బెడ్రూం ఇండ్లలోకి మారారు. నేడు ఆ లబ్ధిదారులంతా సంతోషంగా ఉన్నారు. ఇప్పు డు వారి ముఖాల్లో నిలువ నీడలేని స్థానం నుంచి పక్కా ఇండ్లు వచ్చాయని ధైర్యం.. కళ్లల్లో ఆనం దం, జీవితంపై భరోసా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తినటానికి రూపాయికే కిలో బియ్యం, ఆసరా పిం ఛన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌ లాంటి సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయి. ఇండ్లు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘మా ఇంటికి యజమాని, మా పెద్ద కొడుకే కాదు, మాకు దేవుడు’ అని లబ్ధిదారులు కొనియాడుతున్నారు. 

2012లోనేసమస్య గుర్తింపు..

 తెలంగాణ రాక ముందు 2012లో ఒకరోజు మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి గుంపుల తిరుమలగిరి వైపు వెళ్తూ బుడిగజంగాల గుడిసెల వద్ద ఆగారు.. వారు ఉండే స్థలం, వసతులు చూసి చలించిపోయారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీకు తప్పక న్యాయం జరుగుతుందని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం, జగదీశ్‌రెడ్డి మంత్రి కావడంతో వారి ఆశలకు అడుగులు పడ్డాయి. మంత్రి చొరవ తీసుకుని పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంతో వారి జీవితంలో ఒక అద్భుత ఘట్టం నెరవేరినట్లయ్యింది. 

మా జీవితంలో ఇదే ఎక్కువ

మా ముత్తాతల ద్వారా మాకు 55 గజాల స్థలంలో గుడిసె దక్కింది. ఏళ్లసంది మా కుటుంబాలు బాగోతాలు వేసేది.. ఎక్కడ పని దొరికితే అక్కడ కూలీ పనిచేసేది. ఇప్పుడు బాగోతాలు లేకపోవడంతో కూలీ పని చేస్తూ పొట్ట నింపుకుంటున్నాం. ఇన్నేళ్లు మాకు వారసత్వంగా వచ్చిన గుడిసెలోనే జీవిస్తుండగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డి చలువతో మాకు డబుల్‌ బెడ్రూం ఇల్లు వచ్చింది. మా కటిక కరువు జీవితాలకు ఇంతకంటే ఎక్కువ కూడా ఆశించం. 

-మోతె దశరథ, సంతోషి, బుడిగ జంగాలు

ఇక్కడే నరకం,  స్వర్గం అనుభవిస్తున్నా 

నా భర్త 20 ఏళ్ల క్రితం చనిపోతే కూలీనాలి పని చేసుకుంటూ ఇద్దరు చంటి పిల్లలను కడుపులో పెట్టుకొని పెద్ద చేసిన. పెద్దోడి పెండ్లి అయ్యింది. వాడి తిండిమందం ఓ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుండు. చిన్నోడు ఇంటికాడనే ఉండి ఈ మధ్యనే సూర్యాపేటలో ఓ మెడికల్‌ దుకాణంలో పనికి చేరిండు. నాకు ఇంచు భూమి లేదు. 40 గజాల జాగలో చిన్న గుడిసె ఉండేది. భర్త చనిపోయినప్పటి నుంచి అష్టకష్టాలు పడ్డ నాకు 20 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాకు దేవుడిలా మారిండు. నెలనెలా వస్తున్న 2వేల రూపాయలు, 18 కిలోల బియ్యం మా కడుపు నింపుతుంటే ఇయ్యాళ డబుల్‌ బెడ్రూం ఇల్లు రావడం సంతోషంగా ఉంది. సస్తే స్వర్గం, నరకం ఉంటుందంటారు.. నేను ఇక్కడే నరకం అనుభవించిన... సీఎం కేసీఆర్‌ చలువతో స్వర్గం అంటే ఏందో చూస్తున్నాం. నాకు కొత్తగా వచ్చిన ఇంట్లో దేవుళ్ల పక్కన కేసీఆర్‌ సారు, జగదీశ్‌సార్ల ఫొటోలకు పూజలు చేస్తున్నా... నా కుటుంబాన్ని ఆదుకున్న వారికి నేను ఇంతకన్నా ఏం చేయగలను. 

- పర్వతం జ్యోతి, తిరుమలగిరి(జి)


logo