శనివారం 19 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 12, 2020 , 09:02:06

చెర్వుగట్టులో భక్తుల రద్దీ

చెర్వుగట్టులో భక్తుల రద్దీ

  •  కొవిడ్‌ నిబంధన   ప్రకారం భక్తులకు దర్శనం
  •  తలనీలాలు గుట్ట కిందే..

నార్కట్‌పల్లి :మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో గురువారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ ప్రధాన అర్చకుడు పోతుపాటి రామలింగేశ్వరశర్మ ఆధ్వర్యంలో తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 6 గంటల నుంచి భక్తులకు దర్శనాలు ప్రారంభించారు. భక్తులు కొవిడ్‌ నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రవేశ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన డిస్‌ఇన్‌ఫెక్షన్‌ టన్నెల్‌ నుంచి భక్తులను లోపలికి ప్రవేశించే సదుపాయం కల్పించారు. ఆలయ సూపరింటెండెంట్‌ తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్ష చేసి భక్తులను అనుమతిస్తున్నారు. అస్వస్థతగా ఉన్నవారిని అనుమతించడంలేదు. 

రామలింగేశ్వరుడి పాదాల వద్ద తల నీలాలు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో గుట్టపై తల నీలాలను తీయించుకోవడాన్ని ఆలయ అధికారులు నిలిపివేశారు. గుట్టకింద ఎల్లారెడ్డి గూడెం సమీపంలోని పార్వతీ రామలింగేశ్వరస్వామి పాదాల వద్ద తల నీలాలను తీయించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో భక్తులు అక్కడే తల నీలాలు తీయించుకొని ఏర్పాటు చేసిన నల్లాల వద్ద స్నానాలు ఆచరించి దర్శనం చేసుకుంటున్నారు.logo