శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 12, 2020 , 08:57:04

కరోనా పరీక్షలు ఇక ఇక్కడే

కరోనా పరీక్షలు ఇక ఇక్కడే

  • సూర్యాపేట, నల్లగొండ మెడికల్‌ కళాశాలల్లో ఏర్పాట్లు
  • రెండు కళాశాలలకు ‘ఆర్‌టీ-పీసీఆర్‌' మంజూరు
  • ఇప్పటికే రూ.86లక్షలతో సూర్యాపేటకు ‘ట్రూ-నెట్‌'..
  • 15రోజుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రారంభం
  • జలుబు, దగ్గు, జ్వరాలకు స్థానికంగానే చికిత్స 
  • వైద్యశాలల్లో ఐసోలేషన్‌ వార్డులు సిద్ధం
  • విషమ పరిస్థితుల్లో గాంధీ దవాఖానకు తరలింపు
  • కనిపించని కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. జిల్లాకేంద్రాల్లోనే వైరస్‌ నిర్ధారణ పరీక్షలకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు అవసరమైన అత్యాధునిక పరికరాలను నల్లగొండ, సూర్యాపేట జిల్లాకేంద్రాల్లోని వైద్యకళాశాలలకు కేటాయించింది. ‘ఆర్‌టీ-పీసీఆర్‌' (రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌, పాలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌)ను రెండు కళాశాలలకు మంజూరు చేశారు. ఇప్పటికే సూర్యాపేటకు ‘ట్రూ-నెట్‌' ల్యాబ్‌ రాగా స్థానిక జనరల్‌ దవాఖానలో ఇన్‌స్టాలేషన్‌ పనులు చేస్తున్నారు. 15రోజుల్లో అందుబాటులోకి రానుండగా.. మరోవైపు ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులను సిద్ధం చేస్తున్నారు. ‘ట్రూ-నెట్‌' పరీక్షల ద్వారా రోజుకు 15మందికి పైగా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నదని సంబంధిత అధికారులు వెల్లడించారు.

- సూర్యాపేట, నమస్తే తెలంగాణ 

సూర్యాపేట, నమస్తే తెలంగాణ : ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా మహమ్మారి జిల్లావాసులనూ వదలడం లేదు. ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ అమలు చేయడంతో పాటు ప్రజలకు కావాల్సిన సదుపాయాలను ఇంటి వద్దకే చేర్చింది. దీంతో చాలా వరకు కేసులు తగ్గాయి. ప్రత్యేకించి సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో తొలుత పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలో 85, నల్లగొండ జిల్లాలో 28కు చేరుకున్నాయి. లక్షణాలు ఉన్నవారితోపాటు అనుమానం ఉన్న వారికి టెస్టులు చేస్తే మానసిక ఆందోళన ఉండదనే ఉద్దేశంతో మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో పదిహేను రోజుల క్రితమే కరోనా టెస్టులు చేసే ట్రూ-నెట్‌ విధానం సూర్యాపేట ప్రభుత్వ దవాఖానకు వచ్చింది. దీని ఏర్పాట్లు పూర్తి కావస్తుండగా ఐసీఎంఆర్‌(ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌)నుంచి గైడ్‌లెన్స్‌ రావాల్సి ఉంది. కాగా తాజాగా తెలంగాణ ప్రభుత్వం మెడికల్‌ కళాశాలలు ఉన్న జిల్లాలకు ఆర్‌టీ-పీసీఆర్‌ మంజూరు చేయడంతో ఈ రెండు జిల్లాలకు వచ్చాయి. ట్రూ-నెట్‌ పరీక్షల ద్వారా రోజుకు 10నుంచి 12మందికి టెస్టులు చేసే అవకాశం ఉండగా వచ్చే వారం రోజుల్లోనే ఇన్‌స్టాలేషన్‌ పూర్తవుతుందని సూర్యాపేట జనరల్‌ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దండ మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఆర్‌టీ-పీసీఆర్‌ సౌకర్యం ప్రస్తుతం హైదరాబాద్‌ గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌లాంటి దవాఖానల్లో ఉండగా త్వరలోనే సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు రాబోతోంది.

రోజుకు 30పైనే..

రెండు జిల్లాల్లో ఆర్‌టీ-పీసీఆర్‌ రావడం ద్వారా రోజుకు 30కి పైనే మందికి అత్యాధునిక కరోనా టెస్టులు చేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. సూర్యాపేట, నల్లగొండ మెడికల్‌ కళాశాలలకు మంజూరు కాగా ప్రస్తుతం వాటిని అమర్చడంతో పాజిటివ్‌ కేసులకు చికిత్సలు అందించేందుకు ఐసోలేషన్‌, ఐసీయూ తదితరాలను సిద్ధం చేస్తున్నారు. వీటికి తోడు పరీక్షలు చేసేందుకు ముగ్గురు ల్యాబ్‌ అసిస్టెంట్లతో పాటు మరి కొందరికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. రెండు జిల్లాలోని జనరల్‌ దవాఖానల్లో ఇప్పటికే కొవిడ్‌-19 సోకిన పేషెంట్ల కోసం 20 నుంచి 25 బెడ్స్‌తో ఐసోలేషన్‌ వార్డులు, 7 బెడ్స్‌తో ఐసీయూలు అలాగే 4 వెంటిలేటర్లు ఏర్పాటు చేసిన విషయం విదితమే. 

ఇరుగు పొరుగు వారికి సలహాలు, సూచనలు...

మీరు నివాసముంటున్న ప్రదేశంలో ఎవరికైనా కరోనా వైరస్‌ సోకిందని నిర్ధారిస్తే ఆందోళన చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అపార్టుమెంట్లు, ప్లాట్స్‌లో ఉంటే కామన్‌ ప్లేస్‌ను రోజుకు రెండు సార్లు క్రిమిసంహారక మందు (బ్లీచింగ్‌పౌడర్‌ 1 లీ. నీటికి 3 చెంచాలు) కలిపి పిచికారీ చేయాలి. తరచూ మెట్లు, గోడలు, లిప్టు బటన్స్‌ మొదలైన వాటిని శుభ్రం చేస్తుండాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లి వచ్చిన ప్రతిసారి చేతులను సబ్బు, నీటితో 40 నుంచి 60 సెకన్ల పాటు కడగాలి. 

అన్నీ సిద్ధం చేస్తున్నాం 

మాకు ఇప్పటికే కరోనా టెస్టులు చేసేందుకు ట్రూ-నెట్‌ రాగా ఐసీఎంఆర్‌ గైడ్‌లెన్స్‌ కోసం ఎదురు చూస్తున్నాం. అవి రాగానే వెంటనే టెస్టులు చేస్తాం. వీటితో పాటు మెడికల్‌ కళాశాలలు ఉన్న జిల్లాలకు మంజూరు చేసే క్రమంలో సూర్యాపేటకు కూడా ఆర్‌టీ-పీసీఆర్‌ మంజూరైంది. దీనికి సంబంధించిన కొన్ని ఎక్విప్‌మెంట్లు వచ్చాయి. మిగిలినవి కూడా త్వరలోనే రానున్నాయి. అన్నింటినీ అమర్చేందుకు సిద్ధం చేస్తున్నాం. ఐసీఎంఆర్‌తోపాటు ప్రభుత్వ అనుమతులు వస్తే ఎప్పుడంటే అప్పుడు టెస్టులు చేసేందుకు సిబ్బంది కూడా సిద్ధమవుతున్నారు. అన్నీ పూర్తయితే రోజుకు 25 నుంచి 30 మందికి పరీక్షలు చేయవచ్చు. 

-దండ మురళీధర్‌రెడ్డి(జనరల్‌ దవాఖాన , సూపరింటెండెంట్‌, సూర్యాపేట)


logo