ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 08, 2020 , 03:24:04

శరవేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి

శరవేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి

  • వైరస్‌ వ్యాప్తిపై   పట్టించుకోని ప్రజలు  
  • ‘నాకేం కాదులే..’ అనే నిర్లక్ష్యంతో వీధుల్లోకి.. 
  •  ఇక్కడి ఉష్ణోగ్రతలకు కరోనా రాదనే సమర్థింపులు
  •  గ్రామాల్లోనూ కన్పించని అప్రమత్తత     
  • మాస్కు ధరించకపోతే కేసులు నమోదు : ఎస్పీ

కరోనా మహమ్మారిని జిల్లా ప్రజలు లెక్కచేయడం లేదు. లాక్‌డౌన్‌ సడలింపుల సాకుతో విచ్చలవిడిగా వీధుల్లో విహరిస్తున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా సమాజాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తున్నారు. మాస్కులు ధరించడం లేదు. భౌతిక దూరం పాటించడం లేదు. తొలి దశలో పట్టణాలకే పరిమితమైన వైరస్‌.. వలస కూలీల రాకతో గ్రామాల్లోకి పాకడం ఆందోళన కల్గిస్తోంది. నిరక్షరాస్యులైన ప్రజల్లో అవగాహన కొరవడి మహమ్మారి బారిన పడే ప్రమాదం ఉండడంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తం కావాల్సి ఉంది. మాస్కు ధరించకుండా తిరిగితే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ భాస్కరన్‌  హెచ్చరించారు.

సూర్యాపేట, నమస్తే తెలంగాణ /నల్లగొండ : కరోనా...ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్‌ .. క్రమంగా మన ప్రాంతంలోనూ విస్తరిస్తోంది. మార్చిలో వైరస్‌ వ్యాప్తి చెందుతుండగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. ఆ తర్వాత ప్రజల ఇబ్బందులు గమనించి దానిని సడలించారు. ఈ సడలింపులను ఆసరాగా చేసుకొని ప్రజలు నిర్లక్ష్యంగా రోడ్లపైకి వస్తుండడంతో వైరస్‌ మళ్లీ పంజా విసురుతోంది. పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది. కొవిడ్‌-19 నివారణకు ప్రభుత్వం నిబంధనలు విధించినా చాలా మంది వాటిని పాటించడం లేదు. ‘నాకేమవుద్దిలే’ అనే నిర్లక్ష్య ధోరణితో కనీసం మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా తిరుగుతున్నారు.        

మళ్లీ విస్తరిస్తున్న వైరస్‌

లాక్‌డౌన్‌ సడలించాక క్రమంగా వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సూర్యాపేటలో 85, నల్లగొండలో 31 మంది కరోనా బారిన పడ్డారు. సూర్యాపేట జిల్లాలో ఒక్కరి వల్లనే 80 మందికి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన విషయాన్ని ప్రజలు విస్మరిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో పట్టణాల్లో కొద్దిమందికి మాత్రమే వైరస్‌ సోకగా..ప్రస్తుతం పట్టణాలు దాటి పల్లెలకు పాకింది. ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారి ద్వారా క్రమంగా వ్యాప్తి చెందుతోంది. అవగాహన లేమి కారణంగా భౌతిక దూరం పాటించకుండా...మాస్కులు లేకుండా తిరుగుతుండడంతో అందరికీ అంటుకుంటోంది. మరో ఏడాది పాటు మాస్కులు ధరిస్తూ...భౌతిక దూరం పాటిస్తేనే తప్ప వైరస్‌ నివారణ సాధ్యం కాదని, లేని పక్షంలో ఇది పెరిగి.. మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

నాకేమవుద్దిలే.. అనే నిర్లక్ష్యం

ప్రజల ఇబ్బందులు గమనించి ప్రభుత్వం దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తుండగా.. ప్రజలు తమకు స్వేచ్ఛ లభించినట్లుగా భావిస్తున్నారు. కానీ ప్రమాదం ముంచుకొస్తుందనేది గమనించడం లేదు. నిత్యం కేసులు పెరుగుతున్నా.. చాలా మంది మృత్యువాత పడుతున్నా తమకేమి కాదులే అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా యువత బైక్‌ల మీద చక్కర్లు కొడుతూ రాత్రి వరకూ రోడ్లపైనే ఉంటున్నారు. ప్రస్తుతం అన్ని షాపులు తెరుచుకోగా పలు దుకాణాదారులు సైతం కనీసం శానిటైజేషన్‌ చేసుకోకుండా, మాస్కులు లేకుండానే విక్రయాలు జరుపుతున్నారు. దుకాణాలవద్ద కూడా భౌతిక దూరం పాటించడం లేదు. లాక్‌డౌన్‌ సమయంలో కరోనా నిబంధనలు పాటించని వారిపై కొరడా ఝులిపించిన అధికారులు.. ప్రస్తుతం పట్టించుకోక పోవడంతో ప్రజల్లో కూడా భయం లేకుండా పోయిందని పలువురు పేర్కొంటున్నారు. సాధారణంగా వేసవి ఎండలతో కరోనా తన ప్రభావం చూపించలేదని చాలా మంది భావిస్తూ వస్తున్నారు. కానీ అందులో వాస్తవం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.

పది మంది నుంచి నమూనాల సేకరణ

నీలగిరి : జిల్లాలో శనివారం దండెంపల్లిలో , ఆదివారం మిర్యాలగూడ, నిడమనూరులో పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆయా గ్రామాల్లోని పది మంది నుంచి శాంపిళ్లను సేకరించారు. కరోనా లక్షణాలున్న ఒక మహిళ భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నుంచి ఆటోలో నల్లగొండకు రావడంతో.. ఆ ఆటోలో ఉన్న వ్యక్తుల నుంచి.. ఆంధ్రా ప్రాంతం నుంచి నల్లగొండకు వచ్చిన ఇద్దరు వ్యక్తుల కుటుంబ సభ్యుల నుంచి నమూనాలు సేకరించిన అధికారులు పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు పంపించారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రాంతంలోని ప్రతి ఇంటికీ వైద్య, ఆరోగ్య సిబ్బంది తిరుగుతూ జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న వారిని గుర్తిస్తున్నారు. 

ప్రభుత్వ నిబంధనలు పాటించాలి

లాక్‌డౌన్‌ సడలించడంతో ప్రజలు విచ్చలవిడిగా రోడ్లపైకి వస్తున్నారు. వీరికి ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా కూరగాయల దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌, సూపర్‌ మార్కెట్లు, దేవాలయాలు, బ్యాంకుల్లో నిబంధనలు పాటించాలని, శానిటైజర్లు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు ఆదేశించాం. మాస్కులు లేకుంటే వస్తువులు ఇవ్వొద్దనే నిబంధనలు అమలు చేస్తున్నాం.  కూరగాయల వద్ద బారికేడ్లు పెట్టి కావల్సిన వాటిని యజమానులే అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. బ్యాంకుల్లో హాల్‌ సామర్థ్యం అనుసరించి 20 నుంచి 30 మందిని లోపలికి అనుమతించాలి. మిగతా వారిని టెంట్‌ వేసి బయట ఉంచాలని ఆదేశాలిచ్చాం. లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత నిబంధనలు పాటించని వారిపై సుమారు 750 కేసులు నమోదు చేశాం. మాస్కులు ధరించకపోయినా కేసులు నమోదు చేస్తున్నాం. రోడ్లపైకి వచ్చిన వారి పూర్తి వివరాలు , వాహనాల నెంబర్లు తీసుకుని రెండోసారి వస్తే వాటిని సీజ్‌ చేస్తున్నాం. 

-ఎ.వి. రంగనాథ్‌, ఎస్పీ, నల్లగొండ

అప్రమత్తతే సరైన మందు

కరోనాతో పాటు సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అప్రమత్తతే సరైన మందు. లాక్‌డౌన్‌ సడలించినప్పటికీ ప్రజలు అవసరమైతే తప్ప  బయటకు రాకూడదు. ఒకవేళ వెళ్లినా మాస్కు, భౌతికదూరం తప్పక పాటించాలి. స్వీయ నియంత్రణ పాటిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు అనుసరించాలి. ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిది. ప్రస్తుతం వాతావరణంలో మార్పుల కారణంగా సహజంగా జ్వరం, జలుబు, దగ్గు వస్తుంటాయి.. అవన్నీ కరోనా లక్షణాలని ఆందోళన చెందొద్దు. ఒకవేళ కరోనా లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించి పరీక్షలు నిర్వహించుకోవాలి. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత తప్పక పాటించాలి. 

- హర్షవర్ధన్‌, డీఎంహెచ్‌ఓ, సూర్యాపేట - హర్షవర్ధన్‌, డీఎంహెచ్‌ఓ, సూర్యాపేట 


logo