మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 06, 2020 , 02:10:14

ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుక

 ఘనంగా  ఏరువాక పౌర్ణమి వేడుక

  • హలం పట్టి పొలం దున్నిన మంత్రి జగదీశ్‌రెడ్డి 
  • ఆత్మకూర్‌.ఎస్‌ మండలంలో 150 మంది రైతులతో పండుగ
  • జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల సాగిన కార్యక్రమం

సూర్యాపేట, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఏరువాక పౌర్ణమి వేడుకలను శుక్రవారం రైతులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఎడ్లు, ట్రాక్టర్లకు పూజలు చేసి, నాగలి పట్టి పొలంలో దుక్కి దున్నారు. ఆత్మకూర్‌.ఎస్‌ మండల కేంద్రంలో కేవీకే రైతు నేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలో విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. తలకు పాగా చుట్టి, నాగలి పట్టి పొలం దున్నారు. 150 మంది రైతులు ఏకకాలంలో నాగలి పట్టి దున్నడంతో అక్కడంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో విధ్వంసమైన వ్యవసాయం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో గాడిలో పడిందన్నారు. రైతును రాజు చేసేందుకు సీఎం కేసీఆర్‌ రూపొందించిన ప్రణాళికలు సత్ఫలితాలనిస్తున్నాయని తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌తోపాటు కృష్ణా, గోదావరి, మూసీ నదుల నీటితో వ్యవసాయం పండుగలా మారిందని, రైతుల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయని చెప్పారు.

సమైక్య పాలనలో గోదావరిపై ప్రాజెక్టు కట్టే ఆలోచన కూడా అప్పటి పాలకులు చేసిన పాపాన పోలేదన్నారు. అలాంటి దుర్భర పరిస్థితుల్లో తొలకరి జల్లు పడగానే చేసుకోవాల్సిన ఏరువాక పౌర్ణమికి రైతులు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి పరిస్థితులను అధిగమించి వ్యవసాయం మీద విశ్వాసం పెరిగిందని, రైతులు ఈ రోజు చేసుకుంటున్న సంబురాలే  ఇందుకు నిదర్శనమన్నారు. ఇంకా సంతృప్తి చెందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు పండించిన పంటకు రైతే ధర నిర్ణయించుకునేలా నియంత్రిత సాగును అమల్లోకి తెస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు మాంసాన్ని ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకున్న మనం ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికీ మనం మహారాష్ట్రలోని      కొల్హాపూర్‌, బెంగళూరు, చిత్తూరు జిల్లా మదనపల్లి, గోదావరి జిల్లాల నుంచి కూరగాయల దిగుమతులు చేసుకుంటున్నామని, అందుకు భిన్నంగా మనమే కూరగాయల సాగుపై దృష్టి సారిస్తే అద్భుతమైన ఫలితాలు రాబట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపికాయుగంధర్‌రావు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, రైతు బంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్‌ రజాక్‌, కేవీకే రైతు నేస్తం ఫౌండేషన్‌ ఆర్గనైజర్‌ పగడాల ఉపేందర్‌రెడ్డి, ఎంపీపీ మర్ల స్వర్ణలతా చంద్రారెడ్డి, సర్పంచ్‌ తంగెళ్ల వీరారెడ్డి, ఎంపీటీసీ వెంకటరెడ్డి, ఏడీఓ జ్యోతిర్మయి, ఏడీఏ రామారావు, గుడిపూడి వెంకటేశ్వర్‌రావు రైతులు పాల్గొన్నారు. 

మేళ్లచెర్వులో..

మేళ్లచెర్వు : మండల కేంద్రంలో ఏరువాక పౌర్ణమిని రైతులు ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకున్నారు. స్థానిక వినాయక ఆలయంలో హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అరకలను శుభ్రం చేసి కాడెద్దులను బుక్కాగులాములతో ముస్తాబు చేసి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో హుజూర్‌నగర్‌ జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, గ్రామ సర్పంచ్‌ పందిళ్లపల్లి శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చింతలపాలెంలో..

చింతలపాలెం : మండల కేంద్రంలో ఏరువాక పౌర్ణమిని రైతులు ఘనంగా జరుపుకొన్నారు. పాడి పంటలు బాగుండాలని, సిరిసంపదలు కలుగాలని దేవతలను మొక్కుకొని పొలాలు దున్నారు. 

పొనుగోడులో..

గరిడేపల్లి : మండలంలోని పొనుగోడు గ్రామానికి చెందిన రైతులు ఏరువాక పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ ట్రాక్టర్లకు ప్రత్యేక అలంకరణ చేసి గ్రామంలోని దేవాలయాల వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ట్రాక్టర్లపై తమ పొలాలకు ర్యాలీగా బయలుదేరి నారుమళ్లు దున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు జోగు అరవిందరెడ్డి, సర్పంచ్‌ జోగు సరోజిని, గండ్ర సైదిరెడ్డి, ఎస్‌.ఆదిరెడ్డి, కటకం గోపయ్య, రాం సైదులు, అంజయ్య, శ్రీను, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo