సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 05, 2020 , 00:53:37

ప్రతి రైతు లక్షాధికారి కావాలి

ప్రతి రైతు లక్షాధికారి కావాలి

  •  లాభసాటి వ్యవసాయమే ఎంచుకోవాలి  
  • కంది, అంతర పంటలపై దృష్టి పెట్టాలి  
  • వరి తగ్గాలి.. సన్నరకం సాగు పెరగాలి 
  • కూరగాయల సాగుతో మంచి లాభాలు 
  • పంట మార్పిడికి మన నేలలు అనుకూలం
  •  విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి 
  •  సూర్యాపేటలో నియంత్రిత సాగుపై అవగాహన సదస్సు

‘పుష్కలంగా నీళ్లున్నాయి.. వ్యవసాయానికి అనుకూలమైన విలక్షణ నేలలున్నాయి..  రైతు పక్షపాతి ప్రభుత్వం ఉంది.. ఇదే అదును.. రైతులంతా సర్కారు సూచనలకు అనుగుణంగా నియంత్రిత సాగు చేపట్టాలి.. మంచి ఆదాయం పొందాలి’ అని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లాకేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. వరి తగ్గించి అంతర  పంటలు, కంది సాగు చేపట్టాలని, కూరగాయల సాగుతో మంచి లాభాలున్నాయని చెప్పారు. ఒక ఎకరంలో వరి సాగుచేస్తే ఖర్చులు పోను రూ.50వేల ఆదాయం వస్తుందని, అదే కంది పంటకు రూ.2.5లక్షల ఆదాయం పొందవచ్చని ఈ సందర్భంగా మంత్రి ఉదహరించారు. పక్క రాష్ర్టాల్లో, ఇతర దేశాల్లో డిమాండ్‌ ఉన్న పంటలను సాగుచేసి రైతులు ప్రయోజనం పొందాలన్నారు.

- సూర్యాపేట, నమస్తే తెలంగాణ

 రైతులు ఇక లాభాలు ఆర్జించే వ్యవసాయం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా రైతులు దృష్టిసారించాలని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నియంత్రిత సాగు విధానంపై గురువారం సూర్యాపేట, భువనగిరిలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి అవగాహన సమావేశాల్లో ఆయన పాల్గొని ప్రసగించారు. ప్రధానంగా వరి తగ్గించుకోవాలని, ఒకవేళ వేసినా నాణ్యమైన సన్నాలు ఎంచుకోవాలన్నారు. మనకు అన్ని రకాల పంటలకు అనువైన భూములున్నాయని, అది మన రాష్ట్ర ప్రజల అదృష్టమని తెలిపారు. రైతులు ఏడాది పొడవునా ఒకే రకమైన పంటలను సాగు చేసి నష్టపోవడం కన్నా..రకరకాల పంటలను సాగుచేసి అధిక ఆదాయం పొందాలని ఆకాంక్షించారు. ఒక ఎకరంలో వరిని సాగుచేస్తే పెట్టుబడులు పోను రూ.50 వేల ఆదాయం వస్తుందని, అదే కంది పంటను సాగుచేస్తే రెండున్నర లక్షల ఆదాయం వస్తుందని ఈ సందర్భంగా మంత్రి ఉదహరించారు.

ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమని, రైతులు పండించిన పంటలకు రైతులే ధర నిర్ణయించుకునేలా నియంత్రిత సాగుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టి సారిస్తున్నారని తెలిపారు. ఓట్ల రాజకీయం చేసేవారు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోరని, కానీ రైతు బాగుపడాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌ సాహసోపేతంగా నియంత్రిత సాగు విధానం తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక రైతులు సంఘటితం కావాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. వ్యవసాయానికి కావాల్సింది నీళ్లు, పెట్టుబడి, ధర ఈ మూడింటిలో మొదటి రెండు ప్రభుత్వమే ఇస్తున్నందున ఇక మూడోది అయిన ధరల విషయంలో రైతులు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసి వాటినే పండించాలని సూచించారు. లాభదాయకమైన పంటలు రావాలంటే నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవలంబిస్తున్న విధానాలే ఉండాలని గతంలో స్వామినాథన్‌, జయత్‌ఘోష్‌ అధ్యయనం చేసి నివేదికలు ఇచ్చిన అంశాన్ని మంత్రి గుర్తు చేశారు. డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేస్తే స్థానికంగానే కాకుండా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విక్రయించుకుని లాభాలు ఆర్జించవచ్చని తెలిపారు. 

వానకాలంలో మక్కలు వద్దు..

ప్రస్తుత వానకాలంలో మొక్కజొన్నలు వేయడం శ్రేయస్కరం కాదన్నారు. మక్కలు వానకాలంలో ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే, యాసంగిలో 45 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు. అధ్యయనం చేసిన తర్వాతనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ విషయాన్ని ప్రకటించారని మంత్రి చెప్పారు. యావత్‌ భారతదేశం వరివైపు చూస్తున్నదని, అలాగే జరిగితే డిమాండ్‌ తగ్గి ధర పలకదనే విషయం రైతులు గుర్తెరగాలన్నారు. వరిలో కూడా సన్నాలు వేయడం రైతులకు మేలు చేస్తుందన్నారు. సన్నాలను కొనేందుకు మిల్లర్లు సైతం సిద్ధంగా ఉన్నారని, సన్నాలలో తేమ శాతం అనే పంచాయితీ అసలు ఉండదని ఆయన చెప్పారు.

రైతు బంధు ప్రతి ఒక్కరికీ అందుతుందని, ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని స్పష్టం చేశారు. వేసిన పంట వివరాలను విధిగా వ్యవసాయ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్‌ చైర్మన్‌ గుజ్జ దీపికాయుగంధర్‌రావు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్‌ రజాక్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ వట్టె జానయ్యయాదవ్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జ్యోతిర్మయి, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు గుడిపూడి వెంకటేశ్వర్‌రావు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, రైతు బంధు సమితి సభ్యులు రైతులు పాల్గొన్నారు. logo