శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 05, 2020 , 00:47:49

అటవీశాఖ అధికారులపై దాడి

అటవీశాఖ అధికారులపై దాడి

  • ముగ్గురికి గాయాలు: కేసు నమోదు

దామరచర్ల/అడవిదేవులపల్లి : నాపరాయి అక్రమ రవాణాను అడ్డుకున్న అటవీశాఖ అధికారులపై స్థానికులు దాడి చేయడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మిర్యాలగూడ మండలం లావూరితండాలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. మిర్యాలగూడ అటవీశాఖ సెక్షన్‌ అధికారి సంతోశ్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. మండలంలోని అటవీభూముల నుంచి రాత్రి వేళల్లో అక్రమంగా నాపరాయి తరలిస్తున్నట్లు సమాచారం మేరకు బుధవారం రాత్రి ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లు చిట్టిపోలు రవి, ఎస్‌కే ఆజాంబాబా, మామిడి నర్సింహ పెట్రోలింగ్‌ నిర్వహించారు. దామరచర్ల సెక్షన్‌ వీర్లపాలెం ఆర్‌ఎఫ్‌ బ్లాక్‌లో ముదిమాణిక్యం నుంచి ముక్కరాయిని తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని అడవిదేవులపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లో స్థలం లేకపోవడంతో మిర్యాలగూడ అటవీశాఖ కార్యాలయానికి తరలించాలని ఎస్‌ఐ నాగుల్‌మీరా సూచించారు.

దీంతో ట్రాక్టర్లను మిర్యాలగూడ ఫారెస్టు కార్యాలయానికి తీసుకెళ్తుండగా రాత్రి 11.30  గంటల సమయంలో లావూరితండా వద్దకు రాగానే ముదిమాణిక్యం గ్రామానికి చెందిన సింగన్న, పుల్లారావు, ట్రాక్టర్ల యాజమానులు జల్లెడ సైదయ్య, గువ్వల సైదయ్యతో పాటు మరికొంత అధికారులను అడ్డగించారు. సీజ్‌ చేసిన ట్రాక్టర్లలో ముక్క రాయిని అన్‌లోడ్‌ చేస్తుండగా అటవీశాఖ అధికారులు ఆపడంతో కర్రలు, రాళ్లతో దాడులు చేసి ట్రాక్టర్లతో పరారయ్యారు. ఈ దాడిలో బీట్‌ ఆఫీసర్లు రవి, నర్సింహ, ఆజంబాబుకు గాయాలు కాగా సంతోశ్‌కుమార్‌, డ్రైవర్‌ తప్పించుకున్నారు. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా దవాఖానకు తరలించారు. అనంతరం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో దాడికి పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ పరమేశ్‌ తెలిపారు. క్షతగాత్రులను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు పరామర్శించారు.


logo