ఆదివారం 12 జూలై 2020
Suryapet - Jun 04, 2020 , 00:55:38

రైతును రాజుగా చూడాలన్నదే కేసీఆర్‌ ఆలోచన

రైతును రాజుగా చూడాలన్నదే కేసీఆర్‌ ఆలోచన

  • నియంత్రిత సాగు విధానం చేపట్టాలి
  • రైతే ధర నిర్ణయించే రోజు రావాలి
  •  విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
  • హాలియా, దేవరకొండలో సన్నాహక సమావేశాలు

‘మనది సమశీతోష్ణ వాతావరణ ప్రాంతం.. మన నేలలు అన్ని రకాల పంటలకు అనుకూలం.. రైతులు సంఘటితమై మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలు పండించి ఆర్థికంగా ఎదగాలి.. అదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం’ అని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం హాలియా, దేవరకొండలో నియంత్రిత సాగుపై నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. పండించే పంటకు ధరను రైతే నిర్ణయించే రోజు రావాలని, అందుకు ప్రభుత్వం తీసుకొచ్చే నూతన సాగు విధానాన్ని అవలంబించాలని సూచించారు. మూస ధోరణి విడనాడి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే కూరగాయలు, పప్పుదినుసు పంటలు సాగు చేయాలన్నారు.

 తిరుమలగిరి (సాగర్‌)/పెద్దఅడిశర్లపల్లి : రైతు లు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రితసాగు విధానానికి శ్రీకారం చుట్టిందని .. రైతులు మూస ధోరణిలో వెళ్లకుండా డిమాండ్‌ ఉన్న వాటిని సాగు చేసి ఆర్థికాభివృద్ధి సాధించాలని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం హాలియా పట్టణంలోని లక్ష్మీనర్సింహ ఫంక్షన్‌హాల్‌లో, దేవరకొండ సాయిరమ్య ఫంక్షన్‌హాల్‌లో నియంత్రిత సాగు విధానంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులు సాగు చేసిన పంట ఉత్పత్తులకు ధర నిర్ణయించడంలో వారి భాగస్వామ్యం లేని కారణంగా గతంలో దళారుల బారిన పడి తీవ్రంగా నష్టపోయారన్నారు. వ్యవసాయంలో ముఖ్యమైనవి సాగు నీరు, పెట్టుబడి, మార్కెట్‌ సౌకర్యం.. వీటి కోసం రైతులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ కృతనిశ్చయంతో ఉన్నారని.. అందులో భాగంగా సుదీర్ఘంగా నిపుణులతో చర్చించి నియంత్రిత సాగు పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించారన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 80 లక్షల ఎకరాలు ఉండగా..

రాష్ట్రం ఏర్పాటయ్యాక 1.40 కోట్ల ఎకరాలకు పెరిగిందన్నారు. గత పాలకులు దశాబ్ధాల పాటు రైతాంగ సమస్యలను విస్మరించారని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగుకు అధిక ప్రాధాన్యత ఇచ్చి 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తుందని తెలిపారు. గతంలో సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాల కోసం రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తూ లాఠీ దెబ్బలు తిన్న పరిస్థితులను గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో సీజన్‌కు ముందే ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచి రైతాంగ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సమశీతోష్ణ వాతావరణంతో పాటు అన్ని రకాల పంటల సాగుకు  అనుకూలమైన నేలలు ఉన్నాయని పేర్కొ న్నారు. వానకాలం సీజన్‌లో రైతులు మొక్కజొన్న కాకుండా..మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కందులు,  కూరగాయలు, పామాయిల్‌తో పాటు పత్తిని సాగు చేసి అధిక లాభాలు పొందాలని సూచించారు.  మంత్రి తన ప్రసంగంలో పీఏపల్లి రైతులను ఉద్దేశిస్తూ.. సాగు నీటి వసతి ఉందని ఏకంగా వేల ఎకరాలు వరి సాగు చేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. యాసంగి సాగుగా రైతులంతా వరి విస్తారంగా వేయడంతో ధాన్యం ఒకేసారి వచ్చిందని, బస్తాలు,లారీల కొరత ఉన్నా తీవ్రంగా శ్రమించి చివరి గింజ వరకు కొనుగోలు చేశామని పేర్కొన్నారు. పీఏపల్లి రైతులు ఇప్పటికైనా మారాలని, పంట మార్పిడి చేయాలని సూచించారు.

కాంగ్రెస్‌ నాయకులను రైతులు  క్షమించరు : ఎంపీ బడుగుల

రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. పోతిరెడ్డి పాడును దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రారంభించినప్పుడు మంత్రి పదవుల కోసం కక్కుర్తి పడి ఈ ప్రాంత ప్రయోజనాలను విస్మరించిన కాంగ్రెస్‌ నాయకులను అన్నదాతలు క్షమించరన్నారు. 

వ్యవసాయ అధికారుల సూచనలు  పాటించాలి : ఎమ్మెల్యే నోముల

నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మాట్లాడుతూ వానకాలం సీజన్‌లో వ్యవసాయ అధికారులు సూచించిన పంటలు సాగు చేసి ఆర్థికంగా లబ్ధి పొందాలని కోరారు. logo