సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 04, 2020 , 00:47:20

రేపే ఏరువాక పౌర్ణమి

రేపే ఏరువాక పౌర్ణమి

ఉమ్మడి జిల్లాలో కృష్ణా, గోదావరి, మూసీ నదుల పరవళ్లు.. నిండుకుండల్లా  మారిన చెరువులు.. వ్యవసాయానికి ప్రభుత్వం పెట్టుబడి అందిస్తున్న తరుణంలో  ఏరువాక పౌర్ణమికి రైతులు సిద్ధమయ్యారు. రేపు ఆత్మకూర్‌.ఎస్‌లో 150నాగళ్లతో  సాగు పండుగ ఘనంగా ప్రారంభిం చనున్నారు.  

 సూర్యాపేట, నమస్తే తెలంగాణ : గోదావరి జలాలు పుష్కలంగా వచ్చి వ్యవసాయం పండుగలా సాగుతుండడంతో  ఏరువాక ఉత్సవాలను జిల్లాలో నిర్వహించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 5న ఆత్మకూర్‌.ఎస్‌ మండల కేంద్రంలో కేవీకే రైతు నేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏరువాక ఉత్సవాలు ప్రారంభించనుండగా దాదాపు 150 నాగళ్లతో రైతులు తమ భూములను దున్ననున్నారు. 

ఉమ్మడి పాలనలో ఆనవాయితీ  మటుమాయం

ఉమ్మడి పాలనలో తెలంగాణ వనరులు, ఆచారాలే కాదు ఆనవాయితీలు కూడా మటుమాయ్యాయి. 40 ఏళ్ల క్రితం వరకు వానకాలం పంటలకు ముందు రైతులు నిర్వహించే ఏరువాక పౌర్ణమి ఉత్సవాలు కూడా సమైక్య పాలనలో కానరాకపోయేవి. సాధారణంగా సాగునీరుండి వ్యవసాయం బాగా సాగితే రైతులు సంతోషంగా ఇలాంటి ఉత్సవాలు జరుపుకుంటారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరు లేక, దశాబ్దాల తరబడి కరువు కాటకాలతో సతమతమవుతూ రైతు అరిగోస పడ్డాడు. దీంతో ఏరువాక ఉత్సవాలు చేసే ఆనవాయితీని కూడా వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది.  

అన్నీ సమకూరాయి..  ఉత్సవాలు చేస్తున్నారు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో అసలు నీళ్లే రావనుకున్న ప్రాంతాలకు  కూడా గోదావరి జలాలు పారుతున్నాయి. దీంతో గతేడాది వానకాలం, యాసంగి పంటలు ఇబ్బడి ముబ్బడిగా పండాయి. ఇక ఈ వానకాలంలో వర్షాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు. చెరువులు, కుంటలు గోదావరి నీటితో నిండి కళకళలాడుతుండగా.. బావులు, బోర్లలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. 

ఉత్సవాలకు ప్రాధాన్యం

తొలకరి సాగుకు ముందు వచ్చే పౌర్ణమి రోజు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. నాగళ్లు, ఎడ్లను పసుపు, కుంకుమ, మామిడి తోరణాలతో అలంకరించి ఎడ్లకు గంటలు కట్టి వేదమంత్రాల నడుమ తమ భూముల్లో నాగళ్లతో కలియ దున్ని చదును చేస్తారు. ఇలా చేయడం ద్వారా తొలకరి జల్లులు పడగానే భూములో ఉండే వానపాములు, ఆరుద్ర కార్తె పురుగులు సంతానోత్పత్తి చేసుకొని భూమిని గుల్ల చేస్తాయి. తద్వారా మొక్కల వేర్లు సులువుగా భూమిలోకి వెళ్లి బలంగా పెరుగుతాయి. 

పండుగలా నిర్వహిస్తాం 

రైతులకు కావాల్సినవన్నీ సమకూరినందున పురాతన సంప్రదాయమైన ఏరువాక పౌర్ణమి ఉత్సవాలు చేపట్టేందుకు రైతుల్లో అవగాహన పెంపొందిస్తున్నాం. అనేక కారణాలతో ఇది కాలగర్భంలో కలిసి పోగా నేడు వ్యవసాయం అంటే భయపడే స్థాయి నుంచి పండుగలా చేసుకునే రైతులను చూసి మళ్లీ ఉత్సవాలు నిర్వహించాలనే ఆలోచన చేశాం. దీనికి ఆత్మకూర్‌.ఎస్‌ గ్రామ రైతుల ద్వారా శ్రీకారం చుడుతున్నాం. ఈ నెల 5న అంగరంగ వైభవంగా నిర్వహించి వచ్చే ఏడాది నాటికి జిల్లా వ్యాప్తంగా నిర్వహించేలా కేవీకే రైతు నేస్తం ఫౌండేషన్‌ కృషి చేస్తోంది. 

-పగడాల ఉపేందర్‌రెడ్డి, కేవీకే   రైతు నేస్తం ఫౌండేషన్‌ ఆర్గనైజర్‌logo