ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 03, 2020 , 02:56:10

నల్లగొండలో ఒకరికి కరోనా

నల్లగొండలో  ఒకరికి కరోనా

  • హోం క్వారంటైన్‌కు కుటుంబ సభ్యులు 
  • 13 మంది నుంచి  నమూనాల  సేకరణ
  • పజ్జూరులో 18 మంది అనుమానితులకు  నెగెటివ్‌గా నిర్ధారణ

నీలగిరి: జిల్లా కేంద్రంలోని పానగల్‌ రోడ్డులో గల శ్రీరామ్‌నగర్‌ కాలనీకి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. సదరు వ్యక్తి లాక్‌డౌన్‌ సమయంలో విజయవాడలో ఉండగా శుక్రవారం వలస కూలీల ఖాతాలో నల్లగొండకు వచ్చాడు. అప్పటి నుంచే అతను అనారోగ్యంతో బాధ పడుతూ ఇంటికే పరిమితమయ్యాడు. శనివారం అనారోగ్య సమస్య తీవ్రమవగా జిల్లాకేంద్రంలోని ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లగా కరోనా లక్షణాలుగా గుర్తించిన వైద్యులు ప్రభుత్వ దవా ఖానకు వెళ్లాలని సూచించారు. బాధితుడి బంధువులు అతడిని హైదరాబాద్‌లోని కేర్‌ దవాఖానకు తీసుకెళ్లగా పరీక్షలు నిర్వహించి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన వైద్యశాఖ అధికారులు అతడి కుటుంబ సభ్యుల్లో ఐదుగురి నుంచి నమూనాలను సేకరించి వారిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. తిప్పర్తికి సంబంధించిన కేసులో నలుగురు, మునుగోడు, విద్యానగర్‌తో పాటు మరికొన్ని చోట్ల మొత్తం 13 మంది నుంచి శాంపిల్స్‌ను సేకరించారు. అయితే ఇప్పటి వరకు జిల్లాలో 16 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఇందులో 9 మంది వలస కూలీలు ఉన్నారు.   

18 మందికి నెగెటివ్‌ 

తిప్పర్తి : మండలంలోని పజ్జూరు గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రాగా గాంధీ దవాఖానకు తరలించిన వైద్యాధికారులు అతడి కుటుంబ సభ్యులతో పాటు ముగ్గురు వైద్యుల నుంచి కూడా నమూనాలు సేకరించి హైదరాబాద్‌ పంపారు. మంగళవారం వాటి ఫలితాలు రాగా మొత్తం 18 మందికి నెగెటివ్‌గా తేలిందని మండల వైద్యాధికారి డా.అనూష తెలిపారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.logo