బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 03, 2020 , 02:50:46

థర్మల్‌ పవర్‌ప్లాంట్‌, ఇండస్ట్రియల్‌ పార్కులే.. అభివృద్ధికి దిక్సూచీలు

థర్మల్‌ పవర్‌ప్లాంట్‌, ఇండస్ట్రియల్‌ పార్కులే..  అభివృద్ధికి దిక్సూచీలు

  • ఆరేండ్లలో ఫ్లోరిన్‌ను  మటుమాయం చేశాం..
  • ఉచిత విద్యుత్‌తో ఎక్కువ లాభ పడింది ఉమ్మడి నల్లగొండే..
  • ఐదు దశాబ్దాల గోదావరి జలాల కల సాకారమైంది..
  • ఏడో వసంతంలో మరిన్ని తీపి ఫలితాలు 
  • 20సార్లు పర్యటించి జిల్లాను సస్యశ్యామలం చేసింది సీఎం కేసీఆరే 
  • తెలంగాణ ఆవిర్భావ  వేడుకల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి 

సూర్యాపేట : నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌, యాదాద్రి జిల్లా దండుమల్కాపూరంలో నిర్మించిన ఇండస్ట్రియల్‌ పార్కులే ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి దిక్సూచీలు అని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట కలెక్టరేట్‌లో జరిగిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించి తెలంగాణ అమరవీరుల స్తూపానికి, తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌సార్‌, తెలంగాణ తల్లి చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆరేండ్లలో ఉమ్మడి నల్లగొండలో ఫ్లోరిన్‌ భూతాన్ని పారదోలిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని, ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్‌ భగీరథ పథకం ద్వారానే సాధ్యమైందని అన్నారు. ఏడో వసంతంలోకి అడుగుపెడుతున్న తెలంగాణ ప్రజలు మరిన్ని తీపి ఫలితాలు పొందబోతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వడం ద్వారా ఎక్కువగా లబ్ధి పొందింది ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులేనన్నారు. ఏడు దశాబ్దాల కాలంలో మొట్టమొదటి సారిగా టెయిల్‌ ఎండ్‌ భూములకు నీళ్లు పారించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని, ఆయకట్టు చివరి భూముల అనే పదం లేకుండా చేసిన చరిత్ర టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని చెప్పారు.  సూర్యాపేట జిల్లా ప్రజల ఐదు దశాబ్దాల కల గోదావరి జలాల రాకతో సాకారమైందన్నారు. 

సాగర్‌ లోలెవల్‌ కెనాల్‌ పూర్తి చేసుకోవడమే కాకుండా మూసీ ప్రాజెక్టు ఆధునీకరణ పనులు చేపట్టి పసిడి పండించే భూములుగా మార్చుకున్నది మన రాష్ట్రంలోనేనన్నారు. సూర్యాపేట, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో మెడికల్‌ కళాశాలలు, నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్‌, నల్లగొండలో బత్తాయి మార్కెట్లను ఏర్పాటు చేసుకుంది తెలంగాణలోనేనని చెప్పారు. వ్యవసాయ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా సాగు విస్తీర్ణం పెరిగి రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి అయ్యిందన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉద్యమ నేత కేసీఆర్‌ 20 సార్లు ఉమ్మడి జిల్లాలో పర్యటించి అభివృద్ధికి బాటలు వేశారన్నారు. ఈ సందర్భంగా సమాచార ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించిన కొత్త వాహనాన్ని మంత్రి ప్రారంభించారు. వేడుకల అనంతరం పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు ఇతర ప్రజాప్రతినిధులు చేనేత వస్ర్తాలు ధరించి ఆవిర్భావ వేడుకలకు హాజరయ్యారు. లాక్‌డౌన్‌తో అమ్మకాలు నిలిచిపోయి ఆందోళనలో ఉన్న చేనేత కార్మికులను అదుకునేందుకు ఇటీవల జిల్లా ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి పోచంపల్లి చేనేత వస్ర్తాలను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. వాటినే ధరించి వేడుకలకు రావడంతో అందరూ ఆసక్తిగా చూశారు. రోజూ తెల్లని ఖద్దర్‌ బట్టలతో ఉండే మంత్రి కలర్‌ చేత వస్ర్తా లు ధరించి అందరినీ ఆశ్చర్యపర్చారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గా దరి కిశోర్‌కుమార్‌ సైతం చేనేత వస్ర్తాలతో వచ్చారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యు డు బడుగుల లింగయ్యయాదవ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపికాయుగంధర్‌రావు, ఎమ్మెల్యేలు డాక్టర్‌ గాద రి కిశోర్‌కుమార్‌, శానంపూడి సైదిరెడ్డి, కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్‌, అదనపు కలెక్టర్‌ సంజీవరెడ్డి, ఇన్‌చార్జి డీఆర్‌వో మోహన్‌రావు, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి నర్సింహారెడ్డి, వై. వెంకటేశ్వర్లు, పలువరు కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు,  ఉద్యోగులు పాల్గొన్నారు.


logo